Nitish Kumar: సంకీర్ణంతో విభేదాల వేళ.. గవర్నర్‌ నివాసానికి నీతీశ్ కుమార్‌

Nitish Kumar: బిహార్‌ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్‌ నేడు రాజ్‌భవన్‌కు వెళ్లారు. సంకీర్ణ ప్రభుత్వంలో విభేదాల వేళ ఈ పరిణామం ఆసక్తికరంగా మారింది.

Updated : 26 Jan 2024 19:39 IST

పట్నా: వారసత్వ రాజకీయాలపై బిహార్‌ (Bihar) ముఖ్యమంత్రి నీతీశ్‌కుమార్‌ (Nitish Kumar) చేసిన వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. నేడో, రేపో సంకీర్ణ కూటమి కూలిపోయే పరిస్థితులు కన్పిస్తున్నాయంటూ ఊహాగానాలు వెల్లువెత్తాయి. ఈ పరిణామాల నేపథ్యంలో సీఎం, రాజ్‌భవన్‌కు వెళ్లడం ప్రాధాన్యం సంతరించుకుంది. అధికారిక కార్యక్రమం నిమిత్తం ఆయన గవర్నర్‌ నివాసానికి వెళ్లగా.. మిత్ర పక్షానికి చెందిన ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్‌ (Tejashwi Yadav) హాజరుకాకపోవడం చర్చనీయాంశమైంది.

గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర గవర్నర్‌ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్‌ తేనీటి విందు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సీఎం నీతీశ్‌కుమార్‌ పాల్గొన్నారు. ఆర్జేడీ నుంచి మంత్రులు, సీనియర్‌ నేతలు హాజరైనా.. తేజస్వీ మాత్రం రాలేదు. సీఎం పక్కన ఆయనకు కేటాయించిన స్థానంలో జేడీయూ(JDU) నేత అశోక్‌కుమార్‌ కూర్చున్నారు. ఇక, ఈ కార్యక్రమానికి హాజరైన శాసనసభ ప్రతిపక్ష నేత విజయ్‌ కుమార్‌ సిన్హా (భాజపా).. సీఎంతో కొంతసేపు ముచ్చటించారు. కార్యక్రమం అనంతరం తేజస్వీ గైర్హాజరీపై నీతీశ్‌ను మీడియా ప్రశ్నించగా.. ‘అది రానివాళ్లనే అడగాలి’ అంటూ ఆయన సమాధానమివ్వడం గమనార్హం. ఇదే విషయంపై మరో జేడీయూ నేత, మంత్రి అశోక్‌ చౌదరిని విలేకర్లు ప్రశ్నంచిగా.. ‘‘దీనికి నేనేం చెప్పగలను.. ఎవరు రాలేదో వాళ్లు మాత్రమే సమాధానం చెప్పగలరు.. ’ అన్నారు. 

పేకమేడలా కూలుతుందని ముందే తెలుసు.. మాంఝీ

ఈ కార్యక్రమంలో పాల్గొన్న హిందుస్థానీ ఆవామ్‌ మోర్చా నేత, మాజీ సీఎం జితన్‌ రాం మాంఝీ మాట్లాడుతూ.. జేడీయూ-ఆర్జేడీ కూటమి పేకమేడలా కూలిపోతుందని తనకు ముందునుంచే తెలుసంటూ వ్యాఖ్యానించారు.

భాజపాతో నీతీశ్‌ పొత్తు ఖాయమేనా..? బిహార్‌లో మళ్లీ కొత్త ప్రభుత్వం రానుందా..?

2022లో భాజపా (BJP)తో పొత్తుకు గుడ్‌బై చెప్పిన నీతీశ్.. కాంగ్రెస్‌, ఆర్జేడీలతో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన విషయం తెలిసిందే. అయితే, కొంతకాలంగా ఆయన మిత్రపక్షాలపై అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే నీతీశ్‌కు రాజకీయ గురువైన మాజీ సీఎం కర్పూరీ ఠాకుర్‌కు ఇటీవల కేంద్రం ‘భారతరత్న’ ప్రకటించింది. దీని తర్వాత కర్పూరీ శతజయంతి వేడుకల్లో సీఎం మాట్లాడుతూ వారసత్వ రాజకీయాలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈనేపథ్యంలో సంకీర్ణ కూటమి కూలిపోనుందనే ప్రచారం మొదలైంది. నీతీశ్‌ మరోసారి భాజపాతో పొత్తు పెట్టుకొని కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయనున్నారనే వార్తలు జోరందుకున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని