Mamata Banerjee: ‘మోదీపై పోటీ చేయండి’.. దీదీకి భాజపా సవాల్‌

పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రికి భాజపా నేత సవాల్‌ విసిరారు. వచ్చే ఎన్నికల్లో దీదీ.. మోదీపై పోటీ చేయాలని అన్నారు.

Updated : 23 Dec 2023 14:13 IST

కోల్‌కతా: సార్వత్రిక ఎన్నికల్లో వారణాసి నియోజకవర్గం నుంచి ప్రధాని మోదీ(Modi)పై పోటీ చేయాలని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ(Mamata Banerjee)కి భాజపా నేత ఒకరు సవాల్‌ విసిరారు. ‘‘మమతా బెనర్జీ వారణాసి నుంచి ఎందుకు పోటీ చేయరు..? కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీకి బదులు.. ఆమె బరిలో నిల్చోవాలి. మీరు ప్రధాని కావాలని అనుకుంటున్నారు కదా..! అందుకే ప్రధానిపై పోటీ చేయాలి’ అని భాజపా ఎమ్మెల్యే, మహిళా మోర్చా నాయకురాలు అగ్నిమిత్రా పాల్‌ వ్యాఖ్యలు చేశారు. వారణాసి నుంచి ప్రియాంక గాంధీ పోటీ చేయాలని దీదీ ప్రతిపాదించినట్లు వచ్చిన వార్తలపై భాజపా నాయకురాలు స్పందిస్తూ మమతకు సవాల్‌ విసిరారు.

‘చిన్న పార్టీలతో సర్దుబాట్లు ఎందుకు చేసుకోలేదు?’

కొద్దిరోజుల క్రితం విపక్షాల ‘ఇండియా’ కూటమి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా 2024 లోక్‌సభ ఎన్నికల్లో వారణాసి నుంచి ప్రధాని మోదీ (PM Modi)పై ప్రియాంక గాంధీని నిలబెట్టాలని దీదీ ప్రతిపాదించారని ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే దీనిపై కాంగ్రెస్ నేతల నుంచి స్పందన రాలేదు. వాస్తవానికి 2019 ఎన్నికల సమయంలోనే వారణాసి నుంచి ప్రియాంక గాంధీని నిలబెడతారనే ప్రచారం జరిగింది. కానీ, ఆ స్థానంలో కాంగ్రెస్‌.. అజయ్‌ రాయ్‌ని పోటీకి దించింది. అయితే, ఇటీవల పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రియాంక గాంధీ చురుగ్గా పాల్గొనడంతో మరోసారి ఆమె అభ్యర్థిత్వంపై చర్చ మొదలైంది. ఆ మధ్య దీనిపై శివసేన (యూబీటీ) నేత సంజయ్‌ రౌత్ (Sanjay Raut) మాట్లాడుతూ.. ‘‘ఆమె వారణాసి నుంచి పోటీ చేస్తే తప్పకుండా గెలుస్తారు’ అని పేర్కొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని