Dilip Ghose: నీతీశ్‌ది రాజకీయ అవకాశవాదం: భాజపా నేత దిలీప్‌ ఘోష్‌ సెటైర్లు

బిహార్‌లో నీతీశ్‌ కుమార్‌ తీరుపై కాంగ్రెస్‌ నుంచే కాకుండా భాజపా శిబిరం నుంచి కూడా విమర్శలు వస్తున్నాయి.

Published : 28 Jan 2024 15:15 IST

కోల్‌కతా: జేడీయూ అధినేత నీతీశ్ కుమార్‌ (Nitish Kumar) ఆర్జేడీ-కాంగ్రెస్‌ కూటమిని వీడి తిరిగి ఎన్డీయేలో చేరిన తీరుపై అటు కాంగ్రెస్‌ (Congress) నుంచే కాకుండా భాజపా (BJP) శిబిరం నుంచి కూడా విమర్శలు ఎదురవుతున్నాయి. నీతీశ్‌ కుమార్‌ది రాజకీయ అవకాశవాదమని.. ఇలాంటి వాటికి ముగింపు పలకాలని పశ్చిమ బెంగాల్‌ భాజపా మాజీ అధ్యక్షుడు దిలీప్‌ ఘోష్‌ (Dilip Ghose) వ్యాఖ్యానించారు. నీతీశ్‌ కుమార్‌ వ్యవహార శైలిపై దిలీప్‌ ఘోష్‌ కోల్‌కతాలో విలేకర్లతో మాట్లాడారు.  ఒక రాజకీయ నాయకుడు మామూలుగా ఐదేళ్లకు ఒకసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారన్నారు. కానీ, నీతీశ్‌ కుమార్‌ లాంటి వాళ్లైతే వేర్వేరు శిబిరాలకు మారడం ద్వారా ఐదేళ్లలో కనీసం రెండు మూడు సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారంటూ ఎద్దేవా చేశారు. దీన్ని రాజకీయ అవకాశవాదంగా తాను భావిస్తున్నానని.. ఇలాంటి వాటిని అడ్డుకోవాల్సిన తరుణం ఆసన్నమైందన్నారు.

ముగిసిన జేడీయూ-ఆర్జేడీ బంధం.. బిహార్‌ సీఎం నీతీశ్‌ కుమార్‌ రాజీనామా..

మరోవైపు, నీతీశ్‌ కుమార్‌ తీరు పట్ల దిలీప్‌ ఘోష్‌ చేసిన వ్యాఖ్యలపై స్పందించేందుకు బెంగాల్‌ రాష్ట్ర భాజపా అధికార ప్రతినిధి సమిక్‌ భట్టాచార్య నిరాకరించారు. నిజానికి ప్రేమలేని పెళ్లి శాశ్వతంగా కొనసాగదని.. జేడీయూ-ఆర్జేడీ మధ్య బంధం కూడా అలాంటిందేనన్నారు. నీతీశ్ కుమార్‌ తిరిగి ఎన్డీయేలోకి రావడం ద్వారా గతంలో భాజపాను వీడి ప్రజాతీర్పును విస్మరించడం ద్వారా చేసిన తన రాజకీయ పాపాలను ప్రాయశ్చిత్తం చేసుకున్నారంటూ వ్యాఖ్యానించారు. 

2022లో ఎన్డీయేకు గుడ్‌బై చెప్పి ఆర్జేడీ, కాంగ్రెస్‌తో కలిసి నీతీశ్‌ కుమార్‌ ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.  మహాకూటమి ప్రభుత్వంతో 18 నెలల బంధానికి గుడ్‌బై చెబుతూ తిరిగి ఎన్డీయేతో కలిసేందుకు సిద్ధమైన నీతీశ్‌ తీరు పట్ల  కాంగ్రెస్‌ కూడా తీవ్రస్థాయిలో మండిపడింది. రంగులు మార్చడంలో నీతీశ్‌ ఊసరవెల్లితో పోటీ పడుతున్నారని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరాం రమేశ్‌ ఎద్దేవా చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని