KCR: ప్రజలు మౌనంగా ఉండొద్దు.. పోరాడి సాధించుకోవాలి: కేసీఆర్‌

ప్రజలు మౌనంగా ఉంటే సమస్యలు పరిష్కారం కావని, పోరాడి సాధించుకోవాలని భారాస అధినేత కేసీఆర్‌ పిలుపునిచ్చారు.

Updated : 13 Apr 2024 20:37 IST

చేవెళ్ల: ప్రజలు మౌనంగా ఉంటే సమస్యలు పరిష్కారం కావని, పోరాడి సాధించుకోవాలని భారాస అధినేత కేసీఆర్‌ పిలుపునిచ్చారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా చేవెళ్లలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్‌ ప్రసంగించారు. ‘‘ ప్రభుత్వం ఆదుకుంటందనే విశ్వాసం ప్రజల్లో ఉండాలి. కానీ, ప్రజలకు మేలు చేయాలనే చిత్తశుద్ధి కాంగ్రెస్‌ ప్రభుత్వంలో కనిపించడం లేదు. కొన్ని ప్రలోభాలతో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చింది. రాష్ట్రం వచ్చిన తొలినాళ్లలో చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉండేవి. కరెంటు కోతలు, కాలిపోయిన మోటార్లు, పేలిపోయిన ట్రాన్స్‌ఫార్మర్లు. అందని సాగు, తాగునీరు. చాలా ఇబ్బందుల్లో రైతాంగం చెట్టుకొకరు పుట్టకొకరు ఉండే పరిస్థితి. దాన్ని నివారించాలని.. కోడి రెక్కల కింద పిల్లల్ని కాపాడుకున్నట్టు రైతుల్ని మనం కాపాడుకున్నాం.

లబ్ధిదారులతో కలిసి ధర్నా చేస్తా...

గ్రామాలు పట్టుకొమ్మలు కావాలని పట్టుబట్టి ఐదు పథకాలు పెట్టి రైతులకు మేలు చేశాం. రైతు బంధును తొలిసారి మనమే అమలు చేశాం. సాగుకు 24గంటల విద్యుత్‌ ఇచ్చాం. రైతులు పండించిన పంటను ప్రభుత్వమే కొనుగోలు చేసింది. దళితవాడలు ధనికవాడలు కావాలని దళితబంధు పథకం తెచ్చాం. 1.30లక్షల మందికి భారాస ప్రభుత్వం దళిత బంధు మంజూరు చేసింది. ఆ డబ్బులను ఈ ప్రభుత్వం ఇవ్వకుండా ఆపేసింది. దళితబంధు త్వరగా ఇవ్వకుంటే ఎంపిక చేసిన లబ్ధిదారులతో కలిసి అంబేడ్కర్‌ విగ్రహం వద్ద ధర్నా చేసి ప్రభుత్వం మెడలు వంచుతాం. ప్రజలు మౌనంగా ఉండకుండా పోరాడి సాధించుకోవాలి. అప్పుడే సమస్యలు పరిష్కరామవుతాయి. 

కాంగ్రెస్‌, భాజపాలకు డిపాజిట్లు రాకుండా ఓడించాలి..

తెలంగాణ ప్రజలకు మంచి జరిగేలా బతికున్నంత వరకు పోరాడుతూనే ఉంటా. భారాస ప్రభుత్వం దిగిపోగానే కరెంటు, సాగునీరు, తాగునీరు లేకుండా పోయాయి. ప్రజల తరఫున పోరాడే భారాస అభ్యర్థులను గెలిపించాలి. కాంగ్రెస్‌ ఇచ్చిన వాగ్దానాలు నెరవేరాలంటే భారాసను గెలిపించాలి. బలమైన ప్రతిపక్షం ఉంటేనే ప్రభుత్వ వాగ్దానాలు నెరవేరుతాయి. పదేళ్ల పాలనలో భాజపా ఈ దేశం కోసం ఏమైనా చేసిందా?ప్రజల్లో మత పిచ్చిలేపి ఓట్లు దండుకోవాలని చూస్తోంది. రాష్ట్రానికి ఇవ్వాల్సిన ఐటీఐఆర్‌ ప్రాజెక్టును మోదీ ప్రభుత్వం రద్దు చేసింది. బయ్యారం ఉక్కు పరిశ్రమ, కాజీపేట రైల్వేకోచ్‌ ఫ్యాక్టరీ ఎందుకు ఇవ్వలేదు? రాష్ట్రానికి ఒక్క విద్యాసంస్థను కూడా ఇవ్వని భాజపాకు ఎందుకు ఓటు వేయాలి? కేంద్ర సంస్థలను పంపించి పార్టీలను బెదిరించడమే మోదీ పని.  భారాస పుట్టిందే తెలంగాణ కోసం, ఈ రాష్ట్ర ప్రజల కోసం. కాంగ్రెస్‌ ఇచ్చిన 420 హామీలపై ఎక్కడికక్కడ నిలదీయాలు. కాంగ్రెస్‌, భాజపా అభ్యర్థులకు డిపాజిట్లు రాకుండా ఓడించాలి’’ అని కేసీఆర్‌ పిలుపునిచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని