Chandra Babu: సంపద సృష్టితో పేదరికం పోగొట్టాలి: చంద్రబాబు

పూర్‌ టు రిచ్‌ అర్థం చేసుకోవడం కష్టమైనా ఆచరణలో ఇది అద్భుత ఫలితాన్ని ఇస్తుందని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు.

Updated : 12 Jul 2023 12:42 IST

అమరావతి: పూర్‌ టు రిచ్‌ అర్థం చేసుకోవడం కష్టమైనా ఆచరణలో ఇది అద్భుత ఫలితాన్ని ఇస్తుందని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. తెదేపా మినీ మేనిఫెస్టోలోని పూర్‌ టు రిచ్‌ విధానం వినూత్నమైందని చెప్పారు. ప్రజలు, ప్రభుత్వం, ప్రైవేటు భాగస్వామ్యమే పీ-4 విధానమన్నారు. మీడియాతో చంద్రబాబు చిట్‌చాట్‌ నిర్వహించారు. రాష్ట్రంలో పేదరికం ఉందన్నది ఎంత వాస్తవమో సంపద సృష్టి కూడా అంతే అవసరమన్నారు. పేదలకు ఇప్పుడు రోజుకు రూ.150 మాత్రమే వస్తోందని.. సంపద సృష్టి ద్వారా అది మార్చాలన్నదే తమ లక్ష్యమని చెప్పారు. 

ఆనాడు మా అమ్మ కష్టాలు చూశా..

మహిళలకు ఇప్పటివరకు ప్రకటించిన నాలుగు పథకాలే కాకుండా వీలైనన్ని ఎక్కువ కార్యక్రమాలు చేసే ఆలోచన ఉందని చంద్రబాబు తెలిపారు. వారిని వీలైనన్ని ఎక్కువ కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేయడం ద్వారా కుటుంబం, సమాజం రెండూ బాగుపడేలా చూస్తామన్నారు. మహిళాశక్తి అనేది ఎప్పుడూ నిర్లక్ష్యానికి గురవుతూ వస్తోందని.. ఈ విధానం పోవాలనే మినీ మేనిఫెస్టోలో మహాశక్తి పేరిట మహిళలకు ప్రాధాన్యం కల్పించామని చంద్రబాబు వివరించారు. ‘‘కట్టెల పొయ్యిపై మా అమ్మ పడిన కష్టాలు ఎన్నో చూశాను. మా అమ్మ కష్టాలు చూసే ఆనాడు గ్యాస్‌ స్టవ్‌లు అందించే పథకం తీసుకొచ్చాం. పెరిగిన ధరలతో మహిళలు మళ్లీ కట్టెల పొయ్యికి పరిమితమయ్యేలా ఉన్నారు. సంపద సృష్టి ద్వారా పేదరికం పోగొట్టాలి’’అని చంద్రబాబు అన్నారు.

ఒకరి మూర్ఖత్వానికి రాష్ట్రం బలికావాలా?

‘‘సంపద సృష్టించే అమరావతిని జగన్‌ చంపేశారు. ఒకరి మూర్ఖత్వానికి, పిచ్చితనానికి రాష్ట్రం బలికావాలా?అమరావతిని రాజధానిగా ప్రకటించకముందు అక్కడ భూమి ధరెంత? రాజధానిగా కొనసాగి ఉంటే ఎంత ఉండేదో ఎవరైనా బేరీజు వేశారా? జీవనాడి పోలవరాన్ని ముంచేస్తే ప్రజల్లో చైతన్యం ఏమైంది? కృష్ణా - గోదావరితో రెండు రాష్ట్రాల్లో ప్రతి ఎకరాకు నీళ్లివ్వచ్చు. వైకాపా నేతలు భూ కబ్జాలు, సెటిల్‌మెంట్లతో వేల కోట్లు దోచేశారు. రైతులు కోలుకోలేని దుస్థితిలో ఉన్నారు. తెలంగాణలో రైతు ఆత్మహత్యలు తగ్గితే ఏపీలో పెరుగుతున్నాయి. కౌలు రైతులు పూర్తిగా నాశనమయ్యారు. అధికారంలో ఉండగా నేనేం చేశానో ప్రజలు చూశారు. నాలుగేళ్లుగా జగన్‌ ఏం చేస్తున్నారో కూడా బేరీజు వేసుకున్నారు. భవిష్యత్తుకు గ్యారెంటీతో త్వరలోనే పల్లె నిద్ర చేపడతాను’’ అని చంద్రబాబు తెలిపారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని