Chandrababu: రైతుల బాధలు పట్టించుకోని సీఎంను దేవుడు కూడా క్షమించడు: చంద్రబాబు

రైతులను మోసం చేయడం చాలా సులువని సీఎం జగన్‌ అనుకుంటున్నారని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు. 

Updated : 09 Dec 2023 17:20 IST

పర్చూరు: రైతులను మోసం చేయడం చాలా సులువని సీఎం జగన్‌ అనుకుంటున్నారని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు. బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గంలో తుపాను కారణంగా దెబ్బతిన్న పంట పొలాలను చంద్రబాబు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గుండ్లకమ్మ ప్రాజెక్టు గేట్ల మరమ్మతులు చేయలేని వ్యక్తి మూడు రాజధానులు కడతారట! అని ఎద్దేవా చేశారు. విత్తనాలు ఇవ్వలేని ఈ ప్రభుత్వం అవసరమా? అని రైతులను ప్రశ్నించారు. ఎన్నికలు వచ్చినప్పుడు ముద్దులు పెట్టడం..  ఆ తర్వాత పిడిగుద్దులు గుద్దడంలో, నేరాలు చేయడంలో జగన్‌ దిట్ట అని విమర్శించారు.

‘‘తెదేపా అధికారంలో ఉన్నప్పుడు తుపానులు రాకముందే పంట చేతికి వచ్చేలా జాగ్రత్తలు తీసుకున్నాం. పట్టిసీమ ద్వారా రైతులకు సాగునీరు ఇచ్చిన ప్రభుత్వం మాది. నేను కట్టాను కనుకే పట్టిసీమ ద్వారా రైతులకు నీళ్లు ఇవ్వలేదు. ఎక్కడ చూసినా రోడ్లు బాగాలేవు.. మురికి కాల్వలు గాలికి వదిలేశారు. ఈ ప్రభుత్వం వచ్చాక ఎవరి జీనవ ప్రమాణాలైనా పెరిగాయా? వైకాపా నేతలకు ఇసుకపై ఉన్న ప్రేమ రైతులపై లేదు. దేశంలోనే ఎక్కువ అప్పులున్న రైతులు ఏపీలో ఉన్నారు. రైతు బాధలను పట్టించుకోని సీఎంను దేవుడు కూడా క్షమించడు. మిగ్‌జాం తుపానుపై రైతులను ఏమాత్రం అప్రమత్తం చేయలేదు. కనీసం గోనె సంచులు ఇచ్చినా ధాన్యం ఇంటికి తెచ్చుకునేవారు. రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తా. వచ్చేది తెదేపా-జనసేన ప్రభుత్వమే.. రైతు రాజ్యం తెస్తాం’’ అని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని