Mohan Yadav: ఆమెను చూసి ‘నెహ్రూ’ ఆత్మ కన్నీరు పెడుతుంది: మధ్యప్రదేశ్‌ సీఎం

కాంగ్రెస్‌ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీపై మధ్యప్రదేశ్‌ సీఎం మోహన్‌ యాదవ్‌ విమర్శలు గుప్పించారు. ఆమె ఇంటి పేరు ప్రస్తావిస్తూ తీవ్ర ఆరోపణలు చేశారు. 

Published : 29 Apr 2024 00:09 IST

భోపాల్‌: దేశం కోసం తన తల్లి మంగళసూత్రాన్ని త్యాగం చేశారని కాంగ్రెస్‌ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) వ్యాఖ్యానించడంపై మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి మోహన్‌ యాదవ్‌ (Mohan Yadav) మండిపడ్డారు. ప్రియాంక ఇంటి పేరును ప్రస్తావిస్తూ తీవ్ర విమర్శలు చేశారు.  గుణ నియోజకవర్గంలో జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో ఆయన మాట్లాడుతూ.. ‘‘అసలు మంగళసూత్రం ధరించని ప్రియాంక ఈ అంశం గురించి మాట్లాడుతున్నారు. తన కుటుంబంలో పుట్టిన ఇలాంటి గొప్ప వ్యక్తి, తన మనవరాలిని చూసి దివంగత ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ ఆత్మ కచ్చితంగా కన్నీళ్లు పెట్టుకుంటుంది. త్వరలో నా కుమార్తె వివాహం జరగనుంది. అనంతరం తన ఇంటి పేరు మారిపోతుంది. ఆమెకు ఎప్పటికీ తన అత్తగారింటి పేరు మాత్రమే వర్తిస్తుంది. కానీ ప్రియాంక మాత్రం ఇంకా ‘గాంధీ’ పేరును ఇంకా వాడుకుంటున్నారు’’ అంటూ ఎద్దేవా చేశారు.

నవాబులు, సుల్తాన్‌ల అరాచకాలపై మౌనమా?: రాహుల్‌పై మోదీ ధ్వజం

ఓట్ల దాహంతో ఉన్నవారే ఇలా చేయగలరు..!

తన అసలైన ఇంటి పేరును మరచిపోయి నలికీ పేరును కొనసాగిస్తూ ఓట్లను పొందాలనుకుంటున్నారని సీఎం ఆరోపించారు. ఓట్ల దాహంతో ఉన్నవారు మాత్రమే ఇలా చేయగలరన్నారు. యుద్ధం సమయంలో ఇందిరా గాంధీ తన బంగారాన్ని విరాళంగా ఇచ్చేశారని.. తన తల్లి (సోనియా గాంధీ) మంగళసూత్రాన్ని దేశం కోసం త్యాగం చేశారని రాజీవ్‌ గాంధీని ఉద్దేశించి ప్రియాంక ఇటీవల వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. దీనిపై తాజాగా స్పందించిన సీఎం మోహన్‌ పైవిధంగా విమర్శలు చేశారు. 

ప్రియాంక గాంధీనుద్దేశించి సీఎం చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ పార్టీ తీవ్రంగా స్పందించింది. ఆమె ‘గాంధీ’ పేరును కొనసాగించడం నేరమా లేక రాజ్యాంగ విరుద్ధమా? అని ప్రశ్నించింది. ఆమె అధికారిక ఖాతాలో ‘ప్రియాంక గాంధీ వాద్రా’ అని పూర్తి పేరు ఉందని.. ఇలాంటి వ్యాఖ్యలు చేసే ముందు అది కూడా చూసి ఉండాల్సిందంటూ సీఎంకు కౌంటర్‌ ఇచ్చింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని