Sushil Modi:రాజకీయాల్లో ఎవరికీ తలుపులు శాశ్వతంగా మూసి ఉండవు: సుశీల్‌ మోదీ

 జేడీయూ అధినేత నీతీశ్ కుమార్‌ ఎన్డీయేలో చేరేందుకు రంగం సిద్ధమైనట్లు వార్తలొస్తున్న వేళ భాజపా నేత సుశీల్‌ మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు.

Updated : 26 Jan 2024 16:27 IST

పట్నా:  బిహార్‌  సీఎం నీతీశ్ కుమార్‌ (Nitish Kumar) మళ్లీ ఎన్డీయే (NDA)కు దగ్గరవుతున్నారనే ప్రచారం జోరుగా సాగుతున్న వేళ భాజపా సీనియర్‌ నేత సుశీల్‌ కుమార్‌ మోదీ (Sushil Kumar Modi) కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో ఎవరికీ శాశ్వతంగా తలుపులు మూసి ఉండవని పేర్కొన్నారు.  కర్పూరీ ఠాకూర్‌ శతజయంతి వేడుకల్లో నీతీశ్ కుమార్ వారసత్వ రాజకీయాలపై వ్యాఖ్యలు చేయడం.. వాటిని లాలూ కుమార్తె రోహిణి ఆచార్య తప్పుబట్టడం వంటి పరిణామాలతో నీతీశ్‌ ఆర్జేడీ-కాంగ్రెస్‌తో దోస్తీ వీడి మళ్లీ ఎన్డీయే కూటమిలో చేరుతున్నట్లు ప్రచారం జోరందుకుంది. ఈ పరిణామాలతో బిహార్‌ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఈనేపథ్యంలో భాజపా నేత సుశీల్‌కుమార్‌ మోదీ పట్నాలో మీడియాతో మాట్లాడారు.  ‘‘నీతీశ్‌కైనా, జేడీయూకైనా గానీ రాజకీయాల్లో తలుపులు శాశ్వతంగా మూసి ఉండవు.. సమయం వచ్చినప్పుడు మూసివేసిన తలుపులు తెరుచుకుంటాయి. అయితే, తలుపులు తెరవాలో, లేదో మా కేంద్ర నాయకత్వం నిర్ణయిస్తుంది’’ అన్నారు. 

2022లో నీతీశ్ కుమార్‌ భాజపాతో సుదీర్ఘ బంధాన్ని తెంచుకొని ఆర్జేడీ, కాంగ్రెస్‌తో చేతులు కలిపి ప్రభుత్వం ఏర్పాటుచేయడంతో జేడీయూకి శాశ్వతంగా తలుపులు మూసివేసినట్లు భాజపా పేర్కొన్న విషయం తెలిసిందే. తాజా పరిణామాల నేపథ్యంలో సుశీల్‌ మోదీ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. నీతీశ్‌ కుమార్‌ సారథ్యంలో కొలువుదీరిన ప్రభుత్వాల్లో సుశీల్‌ మోదీ చాలాకాలం పాటు డిప్యూటీ సీఎంగా పనిచేయడంతో వీరిద్దరి మధ్య స్నేహసంబంధాలు ఉన్నా.. 2022 పరిణామాల తర్వాత నీతీశ్‌ను తీవ్రంగా విమర్శిస్తూ వచ్చారు.  

మరోవైపు, నీతీశ్‌ ఎన్డీయే కూటమిలో తిరిగి చేరేందుకు రంగం సిద్ధమైందంటూ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. బిహార్‌లో పరిణామాలపై భాజపా అగ్రనాయకత్వం అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. చిరాగ్ పాసవాన్‌, మాజీ సీఎం జితన్ రామ్ మాంఝీతో పాటు తన మిత్ర పక్షాలతో టచ్‌లో ఉంది. నీతీశ్‌ కుమార్‌ తిరిగి తమ కూటమిలోకి చేరే అవకాశాలు ఉన్నాయని, జేడీయూ తమ కూటమిలో చేరితే, వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయే క్లీన్‌స్వీప్‌ చేస్తుందని భాజపా వర్గాలు పేర్కొంటున్నాయి. ఇదిలాఉండగా.. నీతీశ్‌ మళ్లీ ఎన్డీయేలో చేరడంపై ఒక వర్గం భాజపా నేతలు ఆసక్తిగా లేనట్లు వార్తలు వస్తున్నాయి. ఆయనకు ప్రజాదరణ, విశ్వసనీయత తగ్గడం వల్ల తమ పార్టీకి నష్టం చేస్తుందని కొందరు అంచనా వేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని