INDIA bloc: కాంగ్రెస్‌ ఆత్మపరిశీలన చేసుకోవాలి : జేడీయూ

బిహార్‌ ముఖ్యమంత్రి నీతీశ్‌ కుమార్‌ (Nitish Kumar).. మహాగఠ్‌బంధన్‌ను వీడి ఎన్‌డీఏతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నారనే వార్తలను జేడీయూ తోసిపుచ్చింది.

Published : 26 Jan 2024 19:33 IST

పట్నా: బిహార్‌ ముఖ్యమంత్రి నీతీశ్‌ కుమార్‌ (Nitish Kumar).. మహాకూటమిని వీడి ఎన్‌డీఏతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మరో రెండు రోజుల్లో భాజపా సాయంతో మళ్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారనే ఊహాగానాలు అక్కడి రాజకీయాలను (Bihar Politics) వేడెక్కించాయి. ఈక్రమంలో నీతీశ్‌ నేతృత్వంలోని జేడీయూ తొలిసారి స్పందించింది. విపక్షాల కూటమితోనే (INDIA) ఉన్నామని తెలిపింది. సీట్ల సర్దుబాటు, కూటమి భాగస్వామ్య పక్షాల విషయంలో కాంగ్రెస్‌ ఆత్మ పరిశీలన చేసుకోవాలని పేర్కొంది.

ఎన్‌డీఏలోకి వెళ్లేందుకు జేడీయూ ఆలోచిస్తోందని వస్తున్న వార్తలను జేడీయూ రాష్ట్ర అధ్యక్షుడు ఉమేశ్‌ సింగ్‌ కుశ్వాహ తోసిపుచ్చారు. ‘బిహార్‌లో అధికారంలో ఉన్న మహాకూటమిలో అంతా సవ్యంగానే ఉంది. కొన్ని మీడియాల్లోనే ఊహాగానాలు వస్తున్నాయి. నిన్న, నేడు సీఎంతో భేటీ అయ్యాను. ఇది సహజంగా జరిగే ప్రక్రియే. పార్టీ ఎమ్మెల్యేలు పట్నాకు చేరుకోవాలంటూ వస్తోన్న వార్తలు కూడా వదంతులే’ అని ఉమేశ్‌ స్పష్టం చేశారు.

నీతీశ్‌ యూ.. టర్‌ర్‌ర్‌ర్న్‌..? పదవి కోసం ఎన్నిసార్లో!!

గణతంత్ర దినోత్సవంలో పాల్గొన్న సీఎం నీతీశ్‌ కుమార్‌, ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్‌లు.. దూరంగా కూర్చోవడం పైనా ఉమేశ్‌ స్పందించారు. విపక్షాల కూటమి ఇండియా (INDIA)తోనే ఉన్నామన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సీట్ల పంపకం త్వరగా ఖరారు చేయాలని కాంగ్రెస్‌పై ఒత్తిడి తెస్తూనే ఉన్నామని చెప్పారు. ఈ అంశంపై కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు అఖిలేశ్‌ ప్రసాద్‌ సింగ్‌ను విలేకరులు ప్రశ్నించగా... ఇదే ప్రశ్నను ఎన్‌డీఏను ఎందుకు అడగరని ఎదురు ప్రశ్న వేశారు. మిత్రపక్షాలతో సీట్ల పంపకానికి కొంత సమయం పడుతుందన్నారు. అయినప్పటికీ బిహార్‌లో నీతీశ్‌కుమార్‌ తమ  నేత అంటూ పేర్కొనడం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని