Vijaysai Reddy: యాప్‌లను ట్యాప్‌ చేయడం నేను చూశా: ఎంపీ విజయసాయిరెడ్డి

వాట్సప్‌, ఫేస్‌టైమ్‌, టెలిగ్రామ్‌, సిగ్నల్‌ ఇలా మొబైల్‌ లోని ఏ యాప్‌నైనా ట్యాప్‌ చేయొచ్చని, అలా చేయడాన్ని తాను కళ్లారా చూశానని వైకాపా పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి తెలిపారు.

Updated : 10 Aug 2023 09:05 IST

ఈనాడు, దిల్లీ: వాట్సప్‌, ఫేస్‌టైమ్‌, టెలిగ్రామ్‌, సిగ్నల్‌ ఇలా మొబైల్‌ లోని ఏ యాప్‌నైనా ట్యాప్‌ చేయొచ్చని, అలా చేయడాన్ని తాను కళ్లారా చూశానని వైకాపా పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి తెలిపారు. డేటా ప్రొటెక్షన్‌ బిల్లుపై రాజ్యసభలో బుధవారం జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. మొబైల్‌లోని స్పీకర్‌ను నియంత్రించడం ద్వారా, వెనుక వైపు ఉన్న కెమెరా ద్వారా కూడా సంభాషణలు ట్యాప్‌ చేయొచ్చని, ఇందుకు సర్వీస్‌ ప్రొవైడర్‌నో, టవర్‌ నుంచి వచ్చే సంకేతాలనో నియంత్రణలోకి తీసుకోవాల్సిన అవసరం కూడా లేదన్నారు. ట్యాప్‌ చేసే విధానాన్ని విదేశీ కంపెనీలు ప్రదర్శిస్తుండగా ప్రత్యక్షంగా చూశానని ఆయన వెల్లడించారు. విదేశాలకు చెందిన ఆ కంపెనీలు ప్రభుత్వాలు, ప్రభుత్వ సంస్థలకు మాత్రమే ఆ సాఫ్ట్‌వేర్‌లు అమ్ముతామనే నిబంధనను విధిస్తున్నాయని తెలిపారు. అయితే ప్రభుత్వ శాఖల ముసుగులో పలువురు వాటిని కొనుగోలు చేసి స్వప్రయోజనాల కోసం వినియోగిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ‘అకడమిక్‌ పర్పస్‌ కోసం నేను వారిని సంప్రదిస్తే అలాంటివి 15 నుంచి 20 సాఫ్ట్‌వేర్లు ఉన్నాయని చెప్పారు. వాటి విలువ రూ.50 కోట్ల నుంచి రూ.వంద కోట్ల వరకు ఉంది. పైగా ఏడాదికి వార్షిక నిర్వహణ అందులో 20 శాతం వరకు వసూలు చేస్తారు. అంత పెద్ద మొత్తం వెచ్చించే వారు ఎవరి ఫోన్‌నైనా ట్యాప్‌ చేయొచ్చు. ఉదాహరణకు తాను తన ప్రత్యర్ధి రవీంద్రకుమార్‌ (తెదేపా ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌ను ఉద్దేశించి) మొబైల్‌లోకి బగ్‌ను పంపించొచ్చు. లేదా ఆయన నా ఫోన్‌లోకి బగ్‌ పంపించొచ్చు’ అని అంటూ గత తెదేపా ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తుండగా అధ్యక్ష స్థానంలో ఉన్న ఫన్గాన్‌ కోన్యాంక్‌ అభ్యంతరం చేస్తూ నిర్దేశిత విషయానికి పరిమితం కావాలని సూచించారు. మొబైల్‌ నుంచి బగ్‌ ద్వారా వ్యక్తిగత డేటా సేకరించే ప్రమాదం ఉన్నందున కేంద్ర ప్రభుత్వం వ్యక్తిగత డేటాను ఎలా రక్షిస్తుందనే దానిపై దృష్టిపెట్టాలని విజయసాయిరెడ్డి కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని