భాజపాతో కేసీఆర్‌ దోస్తీ

కేంద్రంలోని భాజపా ప్రభుత్వాన్ని, రాష్ట్రంలో ఆ పార్టీ మిత్రుడు కేసీఆర్‌ సర్కారును గద్దె దించే బాధ్యత ప్రజలపైనే ఉందని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు.

Updated : 27 Aug 2023 06:38 IST

ప్రధాని మోదీ, తెలంగాణ సీఎంలను గద్దె దించడమే లక్ష్యం
రాష్ట్రంలో అధికారంలోకి రాగానే ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌ అమలు
భారత్‌ను బలమైన శక్తిగా మార్చింది కాంగ్రెస్‌ పార్టీయే
చేవెళ్ల ప్రజాగర్జన సభలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే

ఈనాడు, హైదరాబాద్‌: కేంద్రంలోని భాజపా ప్రభుత్వాన్ని, రాష్ట్రంలో ఆ పార్టీ మిత్రుడు కేసీఆర్‌ సర్కారును గద్దె దించే బాధ్యత ప్రజలపైనే ఉందని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించుతామన్న కేసీఆర్‌కు భాజపాతో అంతర్గత స్నేహం కుదిరిందని, అందుకే ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం మానేశారని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే నిర్వహించే తొలి మంత్రివర్గ సమావేశంలోనే 12 అంశాలతో కూడిన ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌ అమలుకు నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. కర్ణాటకలో ఇచ్చిన అయిదు వాగ్దానాలు ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామన్నారు. ఈ నెల 30న మైసూరులో రాహుల్‌ గాంధీతో కలిసి గృహలక్ష్మి పథకాన్ని ప్రారంభించనున్నామని తెలిపారు. తెలంగాణలోనూ అధికారంలోకి వచ్చిన వెంటనే హామీలను అమలు చేస్తామని స్పష్టంచేశారు. ఎస్సీ, ఎస్టీల నుంచి ప్రభుత్వం తీసుకున్న భూముల్ని వారికే తిరిగిచ్చేస్తామని చెప్పారు. దేశానికి కాంగ్రెస్‌ ఏం చేసిందంటూ ప్రశ్నించేవారికి.. పార్టీ చేసిన అభివృద్ధిని వివరిస్తూ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. దేశంలో కాంగ్రెస్‌ బలపడుతోందని.. ఎక్కడికెళ్లినా పార్టీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారని చెప్పారు. శనివారం చేవెళ్లలో కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో జరిగిన ప్రజాగర్జన సభలో ఖర్గే మాట్లాడారు.

ప్రతిపక్షాల సమావేశాలకు కేసీఆర్‌ ఎందుకు రాలేదు?

‘‘మోదీ సర్కారును గద్దె దించేందుకు 26 పార్టీలు కలిసి కూటమిగా ఏర్పడ్డాయి. కూటమి నిర్వహించిన ఒక్క సమావేశానికీ కేసీఆర్‌ రాలేదు. మోదీని తప్పించేందుకు లౌకిక పార్టీలు ఏకం కావాలని గతంలో కేసీఆర్‌ చెప్పారు. భారాస లౌకిక పార్టీ అయితే ఎందుకు రాలేదు? బయటికి ఒకటి చెప్పి.. లోపల భాజపాతో ఆయన దోస్తీ చేస్తున్నారు. ప్రతిపక్షాల కూటమి లక్ష్యం ఒక్కటే.. కేంద్రంలో భాజపా ప్రభుత్వాన్ని, ఆ పార్టీకి అండగా ఉండే కేసీఆర్‌ సర్కారును తొలగించడమే. కేసీఆర్‌ ప్రభుత్వం లాంటి అవినీతి ప్రభుత్వాన్ని ఎక్కడా చూడలేదు.

వెన్నుపోటు రాజకీయాలు మానుకోవాలి

రాజకీయాల్లోకి వచ్చిన తరువాత 12 ఎన్నికల్లో పోటీ చేశాను. 11 సార్లు గెలిచాను. 12వసారి ఎన్నికలో మోదీ నా వెంట పడ్డారు. అయినా భయపడలేదు. కానీ, నాతోపాటు ఉన్నవారే నాకు వెన్నుపోటు పొడిచారు. వచ్చే ఎన్నికల్లో ఇలాంటి వెన్నుపోటు రాజకీయాలు మానుకోవాలి. ఒకరి కాలు పట్టుకుని ఒకరు లాగితే నష్టపోయేది తెలంగాణ రాష్ట్రమే. అందరూ సమష్టిగా పనిచేస్తే రాష్ట్రంలో కచ్చితంగా గెలుస్తాం.

మా కారణంగానే మోదీ, షా, కేసీఆర్‌లు చదువుకున్నారు..

కాంగ్రెస్‌ పార్టీ ఏం చేసిందని అమిత్‌షా అడుగుతున్నారు. ఆదివారం ఖమ్మం వచ్చే ఆయనకు పార్టీ చేసిన పనుల నివేదిక ఇవ్వండి. భారత్‌ను బలమైన శక్తిగా మార్చింది కాంగ్రెస్‌ పార్టీయే. బ్యాంకులను ఇందిరాగాంధీ జాతీయం చేశారు. 1947లో 18 శాతం ఉన్న అక్షరాస్యతను 74 శాతానికి పెంచాం. అప్పట్లో మేం చేసిన పని కారణంగానే అమిత్‌షా, మోదీ, కేసీఆర్‌ చదువుకున్నారు. స్వాతంత్య్రానికి ముందు దేశంలో ప్రతి వెయ్యి మందికి 165 మంది చిన్నారులు చనిపోతే.. ఆ సంఖ్యను 30కి తగ్గించాం. మహిళా అక్షరాస్యతను 7 నుంచి 65 శాతానికి పెంచాం. నెహ్రూ, పటేల్‌ కలిసి.. దేశాన్ని ఏకం చేశారు. స్వతంత్ర సంస్థానాలను కాంగ్రెస్‌ రద్దు చేసింది. హైదరాబాద్‌ను దేశంలో కలిపింది. హైదరాబాద్‌లోని ప్రభుత్వరంగ సంస్థలన్నీ నెహ్రూ, కాంగ్రెస్‌ హయాంలో ఏర్పాటైనవే. స్వాతంత్య్రం వచ్చేనాటికి దేశంలో సూదులు, బోల్టులు కూడా తయారయ్యేవి కాదు. కాంగ్రెస్‌ చేపట్టిన పారిశ్రామికీకరణ ద్వారా అన్ని నగరాల్లో పరిశ్రమలు వచ్చాయి. భాక్రా నంగల్‌, నాగార్జునసాగర్‌ లాంటి పెద్ద సాగునీటి ప్రాజెక్టులెన్నో కాంగ్రెస్‌ కట్టించింది. రాజీవ్‌ గాంధీ తెచ్చిన మొబైల్‌ విప్లవంతో దేశంలో 140 కోట్ల మంది సెల్‌ఫోన్లు వినియోగిస్తున్నారు. ఇలాంటివి ఎన్నో చేశాం. కాంగ్రెస్‌ పార్టీకి నష్టం జరుగుతుందని తెలిసినా జమిందారీ వ్యవస్థను రద్దు చేశాం. భూసంస్కరణలు తీసుకొచ్చేందుకు పీవీ నరసింహారావు ప్రయత్నిస్తే ఆయనను అధికారం నుంచి దించేశారు’’ అని ఖర్గే పేర్కొన్నారు.


సభ విజయవంతమైందని పార్టీ వర్గాల హర్షం

చేవెళ్లలో నిర్వహించిన ‘ప్రజా గర్జన’ సభ విజయవంతమైందని కాంగ్రెస్‌ వర్గాలు హర్షం వ్యక్తం చేశాయి. జనసమీకరణపై ఖర్గే కూడా సంతృప్తి వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌ నేపథ్యంలో ఆ వర్గాలవారిని ఎక్కువగా సమీకరించారు. వికారాబాద్‌, రంగారెడ్డి, హైదరాబాద్‌, నాగర్‌కర్నూల్‌, మహబూబ్‌నగర్‌, మేడ్చల్‌ జిల్లాల నుంచి ప్రధానంగా జనాన్ని సభకు తరలించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని