హస్తవాసి మార్చేలా!

అయిదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికలకు రోడ్‌మ్యాప్‌ ఖరారుకు, లోక్‌సభ ఎన్నికల వ్యూహంపై చర్చించేందుకు శనివారం ప్రారంభం కానున్న కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ(సీడబ్ల్యూసీ) సమావేశాలతో పాటు ఆదివారం జరిగే బహిరంగ సభను విజయవంతం చేసేందుకు పీసీసీ ముమ్మర యత్నాలు చేస్తోంది.

Published : 15 Sep 2023 04:02 IST

రేపటి నుంచి హైదరాబాద్‌లో సీడబ్ల్యూసీ సమావేశాలు
నేటి నుంచే ముఖ్య నేతల రాక
ఏర్పాట్లు ముమ్మరం

ఈనాడు హైదరాబాద్‌: అయిదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికలకు రోడ్‌మ్యాప్‌ ఖరారుకు, లోక్‌సభ ఎన్నికల వ్యూహంపై చర్చించేందుకు శనివారం ప్రారంభం కానున్న కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ(సీడబ్ల్యూసీ) సమావేశాలతో పాటు ఆదివారం జరిగే బహిరంగ సభను విజయవంతం చేసేందుకు పీసీసీ ముమ్మర యత్నాలు చేస్తోంది. గత కొన్ని రోజులుగా సమావేశాల ఏర్పాట్లు, బహిరంగ సభకు జనసమీకరణపై ముఖ్య నాయకులంతా తలమునకలయ్యారు. సీడబ్ల్యూసీ సమావేశాన్ని దిల్లీలో కాకుండా బయట నిర్వహించాలని నిర్ణయించడం, అది కూడా పార్టీ అధికారంలో లేని తెలంగాణలో జరపనుండటం ప్రాధాన్యం సంతరించుకొంది. వచ్చే శాసనసభ ఎన్నికల్లో గెలిచి తెలంగాణలో అధికారంలోకి రావాలన్న కాంగ్రెస్‌ ప్రయత్నాలకు ఈ సమావేశాలు దోహదం చేస్తాయని పార్టీ నాయకులు భావిస్తున్నారు. ఈ కారణంగానే సీడబ్ల్యూసీ సమావేశాలు, బహిరంగ సభ విజయవంతానికి తెలంగాణ నాయకులు ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇటీవలే సీడబ్ల్యూసీకి సభ్యులను, శాశ్వత, ప్రత్యేక ఆహ్వానితులను నియమించారు. ఈ కమిటీ తొలి సమావేశానికి హైదరాబాద్‌ వేదిక కానుంది. నలుగురు ముఖ్యమంత్రులతో పాటు కాంగ్రెస్‌ అగ్రనాయకత్వమంతా 16, 17 తేదీల్లో హైదరాబాద్‌లోనే ఉండనుంది. 16న సీడబ్ల్యూసీ సమావేశం, 17న పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నేతలతో కూడిన విస్తృతస్థాయి సీడబ్ల్యూసీ సమావేశం, అదేరోజు సాయంత్రం తుక్కుగూడలో నిర్వహించే బహిరంగ సభలో అగ్రనాయకులు పాల్గొననున్నారు.

అసెంబ్లీ ఎన్నికల వ్యూహంపై చర్చించే అవకాశం

తెలంగాణతో పాటు ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, మిజోరం రాష్ట్రాలకూ డిసెంబరులో ఎన్నికలు జరగాల్సి ఉంది. తెలంగాణలో భారాసతో కాంగ్రెస్‌ పోరాడుతుండగా.. ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌లలో భాజపాతో తలపడుతోంది. వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికలకు సెమీఫైనల్‌గా భావిస్తున్న అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, చేపట్టాల్సిన కార్యక్రమాలు, అభ్యర్థుల ఎంపికలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇతరులతో అవగాహన.. ఇలా పలు అంశాలపై సమావేశాల్లో చర్చించి రోడ్‌మ్యాప్‌ ఖరారు చేసే అవకాశముంది. తాజాగా కేంద్రం జమిలి ఎన్నికలను తెరపైకి తేవడంతో.. దానిపైనా చర్చించి తీర్మానం చేసే అవకాశముంది. ‘ఇండియా’ కూటమిలోని పార్టీలతో రాష్ట్రాలవారీగా అవగాహన, లోక్‌సభ ఎన్నికల్లో భాజపాను ఎదుర్కొనే వ్యూహంపై సమావేశంలో లోతుగా చర్చించనున్నట్లు పార్టీవర్గాలు తెలిపాయి. దేశ ఆర్థిక పరిస్థితి, ధరల పెరుగుదల, నిరుద్యోగం.. ఇలా అనేక అంశాలపై తీర్మానాలు చేయనున్నారు.  

నేటినుంచే నేతల రాక

సమావేశాల కోసం శుక్రవారం నుంచే హైదరాబాద్‌కు నాయకుల రాక ప్రారంభం కానుంది.  56 మంది సభ్యులు శుక్రవారమే రానున్నారు. అగ్రనేతలు ఖర్గే, సోనియా, రాహుల్‌, ప్రియాంకా గాంధీ తదితరులు శనివారం ఉదయం చేరుకుంటారు. హిమాచల్‌ప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌, కర్ణాటక ముఖ్యమంత్రులు శుక్రవారమే రానున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

రాష్ట్రంలో సానుకూల వాతావరణం కోసం..

త్వరలో జరిగే శాసనసభ ఎన్నికలపై దృష్టి సారించిన తెలంగాణ కాంగ్రెస్‌.. సీడబ్ల్యూసీ సమావేశాలు, ముఖ్య నాయకుల పర్యటనను సద్వినియోగం చేసుకుని, రాష్ట్రంలో సానుకూల వాతావరణం ఏర్పడేలా తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇందుకు రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గాల స్థాయి నాయకులతో పలు కమిటీలు ఏర్పాటు చేసింది. 17వ తేదీన జరిగే బహిరంగ సభకు భారీ జనసమీకరణకు నియోజకవర్గస్థాయి సమావేశాలు నిర్వహించింది. లోక్‌సభ నియోజకవర్గాలకు నియమించిన ఇన్‌ఛార్జులు సమావేశాలు ఏర్పాటు చేశారు. జనసమీకరణపై నాయకులు పూర్తిస్థాయి దృష్టి సారించారు.

అడ్డుకునేందుకు ఆ పార్టీల యత్నం: ఠాక్రే

భారాస, భాజపాలు ఒక్కటై విజయభేరి బహిరంగ సభను అడ్డుకునేందుకు యత్నించాయని.. కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణిక్‌రావ్‌ ఠాక్రే ఆరోపించారు. ప్రతిపక్ష పార్టీ సభలను అడ్డుకునే సంస్కృతి తెలంగాణలో మాత్రమే చూస్తున్నామని విమర్శించారు.  అగ్రనేతలు సోనియా, రాహుల్‌, ప్రియాంకా గాంధీ, మల్లికార్జున ఖర్గేలతో పాటు నాలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వేదికపై ఉండే విజయభేరి సభ అరుదైందని ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని