అధిష్ఠానంపై తిరుగుబావుటా

కాంగ్రెస్‌లో అసంతృప్తితో రగిలిపోతూ, అధిష్ఠానానికి విన్నవించుకొనే అవకాశమూ రాక, వచ్చినా సరైన న్యాయం జరగక ఇతర పార్టీల్లోకి వలస వెళ్లిన నేతల జాబితాలో మరొకరి పేరు చేరింది. లోక్‌సభ ఎన్నికలకు ముందు మహారాష్ట్రకు చెందిన కేంద్ర మాజీ మంత్రి మిలింద్‌ దేవ్‌రా తాజాగా శివసేన(శిందే వర్గం) కండువా కప్పుకొన్నారు.

Updated : 15 Jan 2024 04:32 IST

కాంగ్రెస్‌ను వీడుతున్న కీలక నేతలు

దిల్లీ: కాంగ్రెస్‌లో అసంతృప్తితో రగిలిపోతూ, అధిష్ఠానానికి విన్నవించుకొనే అవకాశమూ రాక, వచ్చినా సరైన న్యాయం జరగక ఇతర పార్టీల్లోకి వలస వెళ్లిన నేతల జాబితాలో మరొకరి పేరు చేరింది. లోక్‌సభ ఎన్నికలకు ముందు మహారాష్ట్రకు చెందిన కేంద్ర మాజీ మంత్రి మిలింద్‌ దేవ్‌రా తాజాగా శివసేన(శిందే వర్గం) కండువా కప్పుకొన్నారు. మిలింద్‌ తండ్రి మురళీ దేవ్‌రా కూడా కాంగ్రెస్‌లో కీలక నేతగా కొనసాగారు. ఆయన వారసత్వాన్ని, కాంగ్రెస్‌ పట్ల విధేయతనూ మిలింద్‌ కొనసాగిస్తూ వచ్చారు. అగ్రనేత రాహుల్‌ గాంధీకి సన్నిహితుడిగానూ మెలిగారు. అలాంటి కీలక నేత ఇప్పుడు అనూహ్యంగా పార్టీని వీడారు. దక్షిణ ముంబయి లోక్‌సభ టికెట్‌ ఇచ్చే విషయంలో అధిష్ఠానం భరోసా ఇవ్వనందుకే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈయనొక్కరే కాదు.. ఇటీవలి కాలంలో రాహుల్‌ సన్నిహితులుగా ముద్రపడిన పలువురు నేతలు పార్టీని వీడటం గమనార్హం.


హార్దిక్‌ పటేల్‌

గుజరాత్‌ పటీదార్‌ నేత హార్దిక్‌ పటేల్‌ను రాహుల్‌ 2019లో పార్టీలోకి తీసుకొచ్చారు. ఆయన 2022లో రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలపై తీవ్ర విమర్శలు చేస్తూ రాజీనామా చేశారు. ఆ తర్వాత భాజపాలో చేరారు.


అశ్వనీ కుమార్‌

పంజాబ్‌కు చెందిన సీనియర్‌ నేత అశ్వనీ కుమార్‌ కేంద్ర మంత్రిగా పనిచేశారు. 2022 ఫిబ్రవరిలో పంజాబ్‌ ఎన్నికలకు కొన్ని రోజుల ముందు పార్టీని వీడారు. అధిష్ఠానం తీరుపై ఆగ్రహంతోనే ఆయన రాజీనామా చేసినట్లు వినిపించింది.


సునీల్‌ జాఖఢ్‌

పంజాబ్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా కొనసాగిన సునీల్‌ జాఖఢ్‌ 2022లో పార్టీకి రాజీనామా చేశారు. అప్పటి ముఖ్యమంత్రి చరణ్‌జీత్‌ సింగ్‌ చన్నీపై విమర్శలు చేసినందుకు అధిష్ఠానం షోకాజ్‌ నోటీసు జారీ చేయడంతో ఆ నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత భాజపాలో చేరి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎంపికయ్యారు.


ఆర్‌పీఎన్‌ సింగ్‌

కేంద్ర మంత్రిగా పనిచేసిన ఆర్‌పీఎన్‌ సింగ్‌ 2022 జనవరిలో ఉత్తర్‌ప్రదేశ్‌ ఎన్నికలకు కొద్దిరోజుల ముందు పార్టీని వీడారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో సరైన ప్రాధాన్యాన్ని ఇవ్వలేదన్న అసంతృప్తితోనే రాజీనామా చేసి భాజపాలో చేరారు.


జ్యోతిరాదిత్య సింధియా

ప్రస్తుత కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా 2020లో కాంగ్రెస్‌ను వీడి తన వర్గం ఎమ్మెల్యేలతో కలసి భాజపాలో చేరారు. తద్వారా మధ్యప్రదేశ్‌లోని నాటి కమల్‌నాథ్‌ ప్రభుత్వాన్ని కూల్చి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ సీఎం అయ్యేందుకు సహకారం అందించారు.


జితిన్‌ ప్రసాద

కేంద్ర మాజీ మంత్రి, రాహుల్‌ గాంధీకి ఒకప్పటి సన్నిహితుడు జితిన్‌ ప్రసాద యూపీ ఎన్నికలకు ఏడాది ముందు 2021లో కాంగ్రెస్‌ నుంచి భాజపాలో చేరారు. భాజపా ఒక్కటే నిజమైన జాతీయ పార్టీ, మిగిలినవి ప్రాంతీయ పార్టీలని ఆయన రాజీనామా సమయంలో వ్యాఖ్యానించారు.

సీనియర్‌ నేత ఏకే ఆంటోనీ తనయుడు అనిల్‌ ఆంటోనీ, ప్రస్తుత అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ, పంజాబ్‌ మాజీ సీఎం అమరీందర్‌ సింగ్‌ కూడా కాంగ్రెస్‌ను వీడి భాజపాలో చేరినవారే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని