RK Roja: రోజాకు వ్యతిరేకంగా భగ్గుమంటున్న అసమ్మతి.. ముదిరి పాకాన పడ్డ కలహాలు

మంత్రి రోజాకు..ఆమె సొంత నియోజకవర్గం నగరిలోనే అసమ్మతి సెగ తగులుతోంది. నగరిలో ఆమెకు వ్యతిరేకంగా వర్గపోరు తీవ్రమవుతోంది.

Updated : 24 Jan 2024 09:06 IST

ఆమెకు సీటు ఇవ్వొద్దని స్థానిక ప్రజాప్రతినిధుల డిమాండ్‌

ఈనాడు, చిత్తూరు, అమరావతి: మంత్రి రోజాకు..ఆమె సొంత నియోజకవర్గం నగరిలోనే అసమ్మతి సెగ తగులుతోంది. నగరిలో ఆమెకు వ్యతిరేకంగా వర్గపోరు తీవ్రమవుతోంది. పార్టీ కోసం పనిచేసిన వారిని మంత్రి రోజా పట్టించుకోవడం లేదని, ఆమె అన్న ఆధిపత్యం మితిమీరిపోయిందంటూ స్థానిక నేతలు కొంతకాలంగా గుర్రుగా ఉన్నారు. చిత్తూరు జిల్లాలో చక్రం తిప్పుతున్న మంత్రి పెద్దిరెడ్డితోనూ ఆమెకు కొన్ని విభేదాలున్న విషయం తెలిసిందే.

రోజాకు టికెట్‌ రాదనే ప్రచారం

వైకాపాలో నియోజకవర్గాల సమన్వయకర్తల మార్పుల ప్రక్రియ మొదలైనప్పటి నుంచి నగరి టికెట్‌ ఈసారి రోజాకు ఇవ్వరనే ప్రచారం మొదలైంది. ఈ క్రమంలోనే ఆమె వ్యతిరేకులూ అసమ్మతి స్వరాలు పెంచుతూనే ఉన్నారు. మంత్రి రోజా సోదరుడు పుత్తూరు వైకాపా ఇన్‌ఛార్జి కుమారస్వామిరెడ్డి పురపాలక ఛైర్మన్‌ పదవి ఇప్పిస్తానని రూ.40 లక్షలు తీసుకున్నారని పుత్తూరు 17వ వార్డు ఎస్సీ కౌన్సిలర్‌ భువనేశ్వరి మంగళవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. మధ్యాహ్నానికి నగరి పరిధిలోని జడ్పీటీసీ సభ్యులు మల్లీశ్వరి, మురళీధర్‌ రెడ్డి చిత్తూరు జిల్లా పరిషత్‌ కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడుతూ రోజాపై విమర్శలు గుప్పించారు. ‘రోజా వద్దు’ అంటూ నినదించారు. 

తొలి నుంచి కలహాల కాపురమే

నగరిలో రోజాకు మొదటి నుంచీ వర్గపోరు ఉంది. నియోజకవర్గంలో వడమాలపేటలో జడ్పీటీసీ సభ్యుడు మురళీధర్‌రెడ్డి, పుత్తూరులో వైకాపా బీసీ సెల్‌ రాష్ట్ర కార్యదర్శి ఏలుమలై, నిండ్రలో శ్రీశైలం బోర్డు ఛైర్మన్‌ చక్రపాణిరెడ్డి, నగరిలో ఈడిగ కార్పొరేషన్‌ ఛైర్‌పర్సన్‌ కేజీ శాంతి, ఆమె భర్త.. మాజీ మున్సిపల్‌ ఛైర్మన్‌ కేజే కుమార్‌, విజయపురంలో ఎంపీటీసీ సభ్యుడు లక్ష్మీపతిరాజు మంత్రిపై తిరుగుబాటు బావుటా ఎగరేశారు. చక్రపాణిరెడ్డి స్వగ్రామం కొప్పేడులో 2022 అక్టోబరులో జరిగిన రైతుభరోసా కేంద్ర శంకుస్థాపన కార్యక్రమానికి మంత్రి రోజాను ఆహ్వానించలేదు. తరవాత పత్తిపుత్తూరులో సచివాలయ భవన ప్రారంభోత్సవానికి రోజా వస్తుండగా జడ్పీటీసీ సభ్యుడు మురళీధర్‌రెడ్డి ఆ భవనానికి తాళం వేశారు. ఈ క్రమంలో ఆమె అనుకూల, వ్యతిరేకవర్గాల మధ్య వాగ్వాదం జరిగింది.

మరోసారి అవకాశం వద్దంటూ

గతేడాది ఆగస్టు 28న సీఎం నగరికి రాగా ఆయన ముందే వైకాపాలోని వర్గ విభేదాలు బయటపడ్డాయి. కేజీ శాంతి, రోజా మధ్య సయోధ్య కుదిర్చేందుకు, వారిద్దరి చేతులను కలిపేందుకు సీఎం జగన్‌ విఫలయత్నం చేశారు. ఇప్పుడు టికెట్లు ఖరారు చేస్తున్నందున రోజా వ్యతిరేక గ్రూపులన్నీ దూకుడు పెంచాయి. ఆమెకు టికెట్‌ ఇవ్వకూడదని కుండబద్దలు కొడుతున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని