ఆర్‌ఎల్‌డీ అడుగులు ఎన్డీయే వైపు!

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో భాజపా-రాష్ట్రీయ లోక్‌దళ్‌ (ఆర్‌ఎల్‌డీ) పొత్తు దాదాపుగా ఖాయమైనట్లు కనిపిస్తోంది. ఆర్‌ఎల్‌డీ చీఫ్‌ జయంత్‌ చౌధరి మాటలు ఈ విషయాన్ని ధ్రువీకరించేలా ఉన్నాయి.

Published : 10 Feb 2024 03:49 IST

సంకేతమిచ్చిన జయంత్‌ చౌధరి

దిల్లీ: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో భాజపా-రాష్ట్రీయ లోక్‌దళ్‌ (ఆర్‌ఎల్‌డీ) పొత్తు దాదాపుగా ఖాయమైనట్లు కనిపిస్తోంది. ఆర్‌ఎల్‌డీ చీఫ్‌ జయంత్‌ చౌధరి మాటలు ఈ విషయాన్ని ధ్రువీకరించేలా ఉన్నాయి. తన తాత, మాజీ ప్రధాని చరణ్‌ సింగ్‌కు తాజాగా కేంద్రం భారతరత్న ప్రకటించిన నేపథ్యంలో ఎన్డీయేలో ఆర్‌ఎల్‌డీ చేరిక గురించి ఆయనను ప్రశ్నించగా.. ‘‘ఇంకా ఏమైనా మిగిలి ఉన్నాయా? నేడు మీ ప్రశ్నలను ఎలా తిరస్కరించగలను..?’’ అంటూ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. ఇప్పటివరకు ఇతర పార్టీలు చేయలేని పనిని మోదీ దార్శనికత, అంకితభావం చేసి చూపిందని కొనియాడారు.  మునుపటి కాంగ్రెస్‌ ప్రభుత్వాలు చరణ్‌ సింగ్‌కు భారతరత్న ఇవ్వకపోవడంపై స్పందిస్తూ.. ‘‘భారత్‌లో అధికారం.. ‘ప్రధాన స్రవంతి’లో ఉన్న కొందరికే పరిమితమై ఉండేది. నవీన భారత్‌లో ఇవన్నీ మారిపోతున్నాయి. ప్రధాన స్రవంతిలో లేనివారిని కూడా ప్రోత్సహించాలని ప్రస్తుత ప్రభుత్వం నిర్ణయించింది’’ అని జయంత్‌ పేర్కొన్నారు. అంతకుముందు.. చరణ్‌సింగ్‌కు మోదీ నివాళి అర్పిస్తున్న ఫొటోను జయంత్‌ ‘ఎక్స్‌’లో షేర్‌ చేశారు. ‘హృదయాలను గెలుచుకున్నారు’ అన్న వ్యాఖ్యను జోడించారు. సీట్ల సర్దుబాటులో ఆర్‌ఎల్‌డీకి రెండు లోక్‌సభ స్థానాలు, ఒక రాజ్యసభ సీటును భాజపా ఇవ్వజూపినట్లు తెలుస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని