ఇక యుద్ధ‘మే’..

శాసనసభ ఎన్నికల్లో సాధించిన విజయంతో లోక్‌సభ ఎన్నికల్లోనూ మెజార్టీ స్థానాలు సాధించాలని కాంగ్రెస్‌.. లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక చోట్ల గెలుపొందడం ద్వారా గత ఎన్నికల్లో ఓటమి తాత్కాలికమేనని నిరూపించుకోవడానికి భారాస..

Updated : 17 Mar 2024 07:40 IST

రాష్ట్రంలో కాంగ్రెస్‌, భారాస, భాజపాల త్రిముఖ పోటీ
షెడ్యూలు విడుదలతో రాష్ట్రంలో రాజకీయ వేడి

ఈనాడు, హైదరాబాద్‌: శాసనసభ ఎన్నికల్లో సాధించిన విజయంతో లోక్‌సభ ఎన్నికల్లోనూ మెజార్టీ స్థానాలు సాధించాలని కాంగ్రెస్‌.. లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక చోట్ల గెలుపొందడం ద్వారా గత ఎన్నికల్లో ఓటమి తాత్కాలికమేనని నిరూపించుకోవడానికి భారాస.. సీట్లు, ఓట్లలో ఆధిక్యత సాధించి రాష్ట్రంలో కాంగ్రెస్‌కు తామే ప్రత్యామ్నాయమని నిరూపించుకోవడానికి భాజపా.. రాష్ట్రంలో మూడు పార్టీలూ తీవ్రంగా పోటీపడనున్నాయి. లోక్‌సభ ఎన్నికల నగారా మోగడంతో వ్యూహాలకు మరింత పదును పెట్టనున్నాయి. తెలంగాణలోని 17 లోక్‌సభ నియోజకవర్గాలకు గాను కాంగ్రెస్‌ నాలుగు స్థానాలకు మాత్రమే ఇప్పటివరకు అభ్యర్థులను ప్రకటించింది. భాజపా రెండు మినహా అన్నింటికీ ప్రకటించింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చవిచూసిన భారాస.. 11 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లపరంగా ఆధిక్యత సాధించని సెగ్మెంట్లున్న లోక్‌సభ స్థానాల్లో బలమైన అభ్యర్థులను రంగంలోకి దించేందుకు కాంగ్రెస్‌ కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా కొన్ని నియోజకవర్గాల్లో భారాస నాయకులను చేర్చుకోవడానికి ప్రయత్నిస్తోంది. మరోవైపు, భాజపా ఇప్పటికే భారాస నుంచి చేరిన నాయకులకు అభ్యర్థుల ఎంపికలో పెద్దపీట వేసింది.

తాజా అసెంబ్లీ ఎన్నికలను పరిశీలిస్తే..

గత ఏడాది ఆఖరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తే.. 17 లోక్‌సభ స్థానాలకు గాను హైదరాబాద్‌ పరిధిలో ఎంఐఎంకు, తొమ్మిదిచోట్ల కాంగ్రెస్‌కు, ఏడుచోట్ల భారాసకు ఆధిక్యత లభించింది. నాలుగు సిటింగ్‌ ఎంపీలున్న భాజపాకు ఎక్కడా మెజారిటీ రాలేదు. కరీంనగర్‌, సికింద్రాబాద్‌, నిజామాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో మూడో స్థానంలో, ఆదిలాబాద్‌లో రెండో స్థానంలో నిలిచింది. భారాసకు ఏడు లోక్‌సభ స్థానాల పరిధిలో ఆధిక్యత వచ్చినా.. మూడుచోట్ల మాత్రమే మెజార్టీ ఎక్కువగా ఉంది. మిగిలిన నాలుగుచోట్ల రెండో స్థానంలో నిలిచిన పార్టీకి, భారాసకు మధ్య ఓట్ల తేడా చాలా తక్కువగా ఉంది. ఆదిలాబాద్‌ లోక్‌సభ పరిధిలో ఓట్లపరంగా భారాస మొదటి స్థానంలో ఉన్నా.. రెండో స్థానంలో నిలిచిన భాజపా కన్నా 17 వేల ఓట్లే ఎక్కువొచ్చాయి. కరీంనగర్‌లో రెండో స్థానంలో నిలిచిన కాంగ్రెస్‌ కన్నా ఐదు వేల ఓట్లు మాత్రమే అధికంగా వచ్చాయి. నిజామాబాద్‌లో కాంగ్రెస్‌ కంటే తొమ్మిది వేల ఓట్లు మాత్రమే ఎక్కువగా వచ్చాయి. ఎన్నికల అనంతరం మారిన పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటే ఈ స్థానాల్లో తిరిగి ఆధిక్యత సాధించడం భారాసకు సవాలుతో కూడుకున్నదే.

అత్యధిక స్థానాలే లక్ష్యంగా కాంగ్రెస్‌

అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్‌ లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు పొందేందుకు బలమైన అభ్యర్థులను బరిలో నిలపాలని భావిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఓట్ల ప్రకారం వెనకబడిన స్థానాల్లో ఇతర పార్టీల నుంచి ముఖ్యనాయకులను చేర్చుకోవాలని యత్నిస్తోంది. మహబూబ్‌నగర్‌, నల్గొండ, మహబూబాబాద్‌, జహీరాబాద్‌ స్థానాలకు ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించగా, మిగిలిన స్థానాలపై ఈ నెల 18న జరిగే పార్టీ సీఈసీ సమావేశంలో నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. తెలంగాణలోని లోక్‌సభ స్థానాలకు మే 13న పోలింగ్‌ జరగనుండటంతో అభ్యర్థుల ఎంపికకు మరికొంత సమయం తీసుకొనే అవకాశం లేకపోలేదు. ఖమ్మం, భువనగిరి, వరంగల్‌ స్థానాలకు పోటీ తీవ్రంగా ఉంది. నిజామాబాద్‌ నుంచి జీవన్‌రెడ్డి, కరీంనగర్‌ నుంచి ప్రవీణ్‌రెడ్డి పేర్ల వైపు మొగ్గు చూపుతున్నా.. అసెంబ్లీ ఎన్నికల్లో భారాస కంటే కొద్ది ఓట్లే తక్కువ రావడం.. మూడో స్థానంలో నిలిచిన భాజపా ఈసారి గట్టి పోటీ ఇవ్వనుండటంతో పునరాలోచించే అవకాశం లేకపోలేదు.

చేవెళ్ల నుంచి ఇటీవలే పార్టీలో చేరిన పట్నం సునీత పేరు ఖరారైనట్లు చెబుతున్నా.. తాజాగా భారాస సిటింగ్‌ ఎంపీ రంజిత్‌రెడ్డి కూడా ఈ టికెట్‌ కోసం పోటీపడుతున్నట్లు పార్టీవర్గాల సమాచారం. మల్కాజిగిరి లోక్‌సభ స్థానం పరిధిలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భారాసకు భారీ ఆధిక్యత లభించింది. భాజపా ఇక్కడి నుంచి మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ను బరిలో నిలిపింది. పైగా గత లోక్‌సభ ఎన్నికల్లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గెలిచిన స్థానం కావడంతో.. హస్తం పార్టీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని బలమైన అభ్యర్థిని రంగంలోకి దింపే ప్రయత్నంలో ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో బాగా వెనకబడిన సికింద్రాబాద్‌, మెదక్‌, ఆదిలాబాద్‌ లోక్‌సభ స్థానాలకు కొత్త అభ్యర్థులను బరిలోకి దించే ప్రయత్నాల్లో ఉంది. సికింద్రాబాద్‌కు కొద్ది రోజుల క్రితం వరకు మాజీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌ పేరు వినపడగా, తాజాగా ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ను చేర్చుకొని సికింద్రాబాద్‌ లోక్‌సభ నుంచి పోటీ చేయించే ఆలోచనతో ఉంది. 

మళ్లీ పుంజుకునేందుకు భారాస యత్నం

అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన భారాస లోక్‌సభ ఎన్నికల్లో పుంజుకోవడానికి ప్రయత్నిస్తోంది. అయితే అధికార కాంగ్రెస్‌తోపాటు భాజపా దూకుడుగా వ్యవహరిస్తుండటం, పలువురు నాయకులు పార్టీని వీడుతున్న నేపథ్యంలో ఏ మేరకు తిరిగి పట్టు సాధిస్తుందో చూడాలి. ఇప్పటికే 11 స్థానాలకు భారాస అభ్యర్థులను ప్రకటించింది. నల్గొండ, భువనగిరి, మెదక్‌, సికింద్రాబాద్‌, హైదరాబాద్‌, నాగర్‌కర్నూల్‌ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. మల్కాజిగిరి నుంచి మాజీ మంత్రి మల్లారెడ్డి కుమారుడు, చేవెళ్ల నుంచి సిటింగ్‌ ఎంపీ రంజిత్‌రెడ్డి పోటీకి విముఖత చూపడంతో కొత్త అభ్యర్థులను ఎంపిక చేసింది. బీఎస్పీతో పొత్తు కుదుర్చుకొని హైదరాబాద్‌, నాగర్‌కర్నూల్‌ స్థానాలను ఆ పార్టీకి ఇవ్వడానికి అంగీకరించింది. అయితే పొత్తుకు భాజపా అడ్డుపడుతోందంటూ ఏకంగా బీఎస్పీ రాష్ట్ర అధ్యక్ష పదవికి ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌ రాజీనామా చేశారు.

ఆయన నాగర్‌కర్నూల్‌లో భారాస అభ్యర్థిగానే పోటీ చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. మిగిలిన స్థానాలకు గట్టి అభ్యర్థులను ఎంపిక చేసే ప్రయత్నంలో గులాబీ పార్టీ ఉంది. తాజాగా దిల్లీ మద్యం కేసులో ఎమ్మెల్సీ కవిత అరెస్టు భారాసపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాల్సి ఉంది. ఇది తమకు సానుకూలంగా ఉంటుందని పార్టీలోని ఓ వర్గం పేర్కొంటుండగా, ఇది కార్యకర్తలకు కొంత నిరాశ కలిగించే అవకాశం ఉందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఏడు లోక్‌సభ స్థానాల పరిధిలో భారాస ఓట్ల ఆధిక్యం పొందింది. వచ్చే ఎన్నికల్లో ఇది పునరావృతమవుతుందా లేదా చూడాల్సి ఉంది.

గరిష్ఠ సీట్లు.. భారీ ఓట్లు లక్ష్యంగా భాజపా

2019 లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో అనూహ్యంగా నాలుగు స్థానాల్ని కైవసం చేసుకున్న కమలదళం రానున్న ఎన్నికల్లో తన బలాన్ని మరింత పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. తెలంగాణలో గరిష్ఠ లోక్‌సభ స్థానాలు, భారీగా ఓట్లు సాధించడమే లక్ష్యంగా కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. గతంలో నామినేషన్లకు చివరి రోజు వరకు అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేసేది. ఈసారి అందుకు భిన్నంగా షెడ్యూలు కూడా ప్రకటించకముందే 15 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. సిటింగ్‌ స్థానాల్ని నిలుపుకోవడంతో పాటు మరిన్ని చోట్ల విజయం సాధించడమే లక్ష్యంగా వ్యూహరచన చేస్తోంది. బలహీనంగా ఉన్న నియోజకవర్గాల్లో ఓటింగ్‌ శాతాన్ని గణనీయంగా పెంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తోంది. సిటింగ్‌ ఎంపీల్లో ఆదిలాబాద్‌లో సోయం బాపురావు మినహా మిగిలిన ముగ్గురికి సీట్లు ఇచ్చింది.

గట్టి అభ్యర్థులు లేని వరంగల్‌, ఖమ్మం, నల్గొండ వంటి నియోజకవర్గాల్లో ఇతర పార్టీల నాయకులను చేర్చుకుంటోంది. భాజపా అగ్రనాయకత్వం కూడా రాష్ట్రంపై ప్రత్యేక దృష్టి సారించింది. ప్రధాని మోదీ మార్చిలో ఇప్పటికే రెండుసార్లు రాష్ట్రంలో పర్యటించగా.. 17న రాత్రి మరోసారి రానున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఇటీవల ఒక దఫా పర్యటించారు. మోదీ, అమిత్‌షాలతో పాటు ఇతర జాతీయ నేతలతో రాష్ట్రంలో సభల ఏర్పాటుకు కమలనాథులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో వీలైనన్ని ఎక్కువ సీట్లు సాధించడం ద్వారా అధికార కాంగ్రెస్‌ పార్టీకి తామే ప్రత్యామ్నాయమని నిరూపించుకోవాలనే లక్ష్యంతో కమలదళం ముందుకు సాగుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని