‘ఇండియా’ కూటమి నేతల బెదిరింపులను కట్టడి చేయాలి

కాంగ్రెస్‌ సహా ‘ఇండియా’ కూటమి నేతల భాష దూషణలు, బెదిరింపులతో కూడుకొని ఉంటోందని, ఈసీ వాటిని సుమోటోగా పరిగణనలోకి తీసుకొని తగిన చర్యలు తీసుకోవాలని భాజపా గురువారం డిమాండ్‌ చేసింది.

Published : 19 Apr 2024 04:30 IST

ఈసీకి భాజపా డిమాండ్‌

దిల్లీ: కాంగ్రెస్‌ సహా ‘ఇండియా’ కూటమి నేతల భాష దూషణలు, బెదిరింపులతో కూడుకొని ఉంటోందని, ఈసీ వాటిని సుమోటోగా పరిగణనలోకి తీసుకొని తగిన చర్యలు తీసుకోవాలని భాజపా గురువారం డిమాండ్‌ చేసింది. పార్టీ ప్రధాన కార్యాలయంలో జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్‌ పూనావాలా మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాని మోదీని 400 అడుగుల లోతున పాతిపెట్టాలని ఝార్ఖండ్‌కు చెందిన జేఎంఎం నేత నజరుల్‌ ఇస్లాం వ్యాఖ్యలు చేసినట్లు తెలిపారు. దేశ ప్రజలు ఎన్నుకొన్న ప్రధాని గురించి ఇలా మాట్లాడటం ‘ఇండియా’ కూటమి నేతల మానసిక పరిస్థితిని సూచిస్తోందన్నారు. నజరుల్‌ ఇస్లాం వ్యాఖ్యలను భారత ఎన్నికల సంఘం సుమోటోగా పరిగణనలోకి తీసుకొని, ఆయనపై  చర్య తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. అలాగే కర్ణాటకలో ఎంపీగా పోటీచేస్తున్న తన సోదరుడు డీకే సురేశ్‌కు ఓటు వేయకపోతే నీటి సరఫరా ఉండదని ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ హౌసింగ్‌ సొసైటీ ఓటర్లను ఇటీవల బెదిరించినట్లు పూనావాలా తెలిపారు. ఆ రాష్ట్ర మంత్రి డి.సుధాకర్‌ సైతం కాంగ్రెస్‌ అభ్యర్థికి ఓటు వేయకపోతే రూ.25 కోట్ల ప్రత్యేక గ్రాంటు నిలిచిపోతుందని ఓటర్లను బెదిరించారన్నారు. కర్ణాటక కాంగ్రెస్‌ నేతల వ్యాఖ్యలనూ ఈసీ సుమోటోగా పరిగణనలోకి తీసుకొని కఠినమైన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. కాగా, ఎన్నికల సభలో మాట్లాడుతూ ప్రధానిని కించపరిచేలా తాను చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ కోరుతూ నజరుల్‌ ఇస్లాం బుధవారమే ఓ వీడియో ప్రకటన విడుదల చేశారు. ఎవరినీ బాధపెట్టడం తన ఉద్దేశం కాదని, 400కు పైగా సీట్లు గెలుస్తామన్న ప్రధాని మోదీ వ్యాఖ్యలకు ఖండనగా అలా మాట్లాడినట్లు వివరణ ఇచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని