ఈటల సేవలు దేశానికి అవసరం

కరోనా సమయంలో తెలంగాణ రాష్ట్ర మంత్రిగా ప్రజలకు సేవలందించిన ఈటల రాజేందర్‌ను లోక్‌సభ ఎన్నికల్లో గెలిపించి దేశవ్యాప్తంగా ఆయన సేవలు విస్తరిద్దామని కేంద్ర పట్టణాభివృద్ధి, పెట్రోలియం శాఖల మంత్రి హర్‌దీప్‌సింగ్‌ పురి అన్నారు.

Updated : 19 Apr 2024 06:20 IST

కేంద్ర మంత్రి హర్‌దీప్‌సింగ్‌

ఈనాడు - హైదరాబాద్‌, న్యూస్‌టుడే- శామీర్‌పేట్‌, హబ్సిగూడ: కరోనా సమయంలో తెలంగాణ రాష్ట్ర మంత్రిగా ప్రజలకు సేవలందించిన ఈటల రాజేందర్‌ను లోక్‌సభ ఎన్నికల్లో గెలిపించి దేశవ్యాప్తంగా ఆయన సేవలు విస్తరిద్దామని కేంద్ర పట్టణాభివృద్ధి, పెట్రోలియం శాఖల మంత్రి హర్‌దీప్‌సింగ్‌ పురి అన్నారు. గురువారం మల్కాజిగిరి భాజపా అభ్యర్థి ఈటల నామినేషన్‌కు ముందు శామీర్‌పేట్‌ సమీపంలోని ఆయన నివాసం వద్ద నిర్వహించిన సమావేశంలో కేంద్ర మంత్రి మాట్లాడారు. దేశంలోనే పెద్దదిగా, మినీ ఇండియాగా మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గానికి ప్రత్యేక ప్రాధాన్యం ఉందని ఆయన అన్నారు. ఈటల భారీ మెజార్టీతో విజయం సాధించడం ఖాయమని.. ఆయన విజయోత్సవ సభకు తాను మళ్లీ వస్తానని అన్నారు. మరో కేంద్ర మంత్రి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో 12 లోక్‌సభ స్థానాలు గెలవబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. భారాస నాయకులు దిల్లీకి వచ్చి చేసేదేమీలేదని విమర్శించారు. ఎన్నో ఆటుపోట్లు, సవాళ్లు ఎదుర్కొన్న ఈటల రాజేందర్‌ను గెలిపించాలని కోరారు. ఈటల మాట్లాడుతూ.. అందరి సహకారంతో పోటీ చేస్తున్నానని,  కొందరు దొంగ సర్వేలతో ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. మల్కాజిగిరి గడ్డ మీద కాషాయ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే ఎన్‌వీఎస్‌ఎస్‌ ప్రభాకర్‌, శోభ, మాజీ ఎమ్మెల్సీ రాంచందర్‌రావు, పార్టీ జిల్లా అధ్యక్షుడు విక్రంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


భాజపాలో చేరిన మాజీ ఎమ్మెల్యే సుభాష్‌రెడ్డి

భారాసకు చెందిన ఉప్పల్‌ మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి భాజపాలో చేరారు. ఈటల నివాసంలో ఆయనకు కిషన్‌రెడ్డి కాషాయం కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సుభాష్‌రెడ్డి సతీమణి, మాజీ కార్పొరేటర్‌ స్వప్నరెడ్డి, కుమారుడు కూడా పార్టీలో చేరారు. ఉద్యమ సహచరుడైన ఈటలను గెలిపించుకుంటామని సుభాష్‌రెడ్డి తెలిపారు. అంతకుముందు ఆయన తన రాజీనామా లేఖను భారాస అధ్యక్షుడు కేసీఆర్‌కు పంపారు. తనతో చర్చించకుండానే ఎమ్మెల్యే అభ్యర్థిగా బండారి లక్ష్మారెడ్డికి, ఎంపీ అభ్యర్థిగా రాగిడి లక్ష్మారెడ్డికి టికెట్లు ఇవ్వడంతో మనస్తాపానికి గురైనట్లు లేఖలో పేర్కొన్నారు.


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని