రైతుల ఉసురు పోసుకుంటున్న కాంగ్రెస్‌

రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ, వరి, మొక్కజొన్న పంటలకు రూ.500 బోనస్‌ ఇస్తామంటూ బోగస్‌ మాటలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌.. నాలుగు నెలల్లోనే కర్షకుల ఉసురు పోసుకుంటోందని, వారిని వేదనకు గురిచేస్తోందని భారాస సీనియర్‌ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు ధ్వజమెత్తారు.

Published : 19 Apr 2024 04:38 IST

రూ.2 లక్షల రుణమాఫీ హామీని సీఎం రేవంత్‌రెడ్డి అటకెక్కించారు: మాజీ మంత్రి హరీశ్‌రావు

బెజ్జంకి, న్యూస్‌టుడే: రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ, వరి, మొక్కజొన్న పంటలకు రూ.500 బోనస్‌ ఇస్తామంటూ బోగస్‌ మాటలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌.. నాలుగు నెలల్లోనే కర్షకుల ఉసురు పోసుకుంటోందని, వారిని వేదనకు గురిచేస్తోందని భారాస సీనియర్‌ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు ధ్వజమెత్తారు. గురువారం రాత్రి సిద్దిపేట జిల్లా బెజ్జంకిలో భారాస కరీంనగర్‌ లోక్‌సభ నియోజకవర్గ అభ్యర్థి బోయినపల్లి వినోద్‌కుమార్‌కు మద్దతుగా నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు. రైతుబంధు అడిగితే చెప్పుతో కొడతామని, ఎన్నికల తరువాత భారాస ఉండదని మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి అంటున్నారని.. వారి అహంకారపు మాటలకు ఓటుతో గుణపాఠం చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. డిసెంబరు 9 తరువాత రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామంటూ చెప్పిన సీఎం రేవంత్‌రెడ్డి.. ఆ మాటను అటకెక్కించి తాను మాత్రం గద్దెనెక్కారని ఎద్దేవా చేశారు. ఆసరా పింఛన్లు పెంచుతామని, మహిళలకు బ్యాంకు ఖాతాల్లో ప్రతినెలా రూ.2,500 జమ చేస్తామని, నిరుద్యోగ భృతి, కల్యాణలక్ష్మి కింద తులం బంగారం ఇస్తామంటూ చెప్పి.. అన్ని వర్గాల ప్రజలను నిలువునా ముంచారని విమర్శించారు. సీఎం రేవంత్‌రెడ్డివి తుపాకీరాముడు మాటలని.. వాటిని నమ్మి మోసపోవద్దని హరీశ్‌రావు అన్నారు. 24 గంటల కరెంటు 14 గంటలకే పరిమితమైందని, మోటార్లు కాలుతున్నా ప్రభుత్వంలో చలనం లేదన్నారు. గతంలో కొనుగోలు కేంద్రాల్లో చివరి గింజ వరకూ కొనుగోలు చేశామని, నేడు ప్రభుత్వంపై నమ్మకం లోపించి రైతులు కల్లాల వద్దే ధాన్యాన్ని అమ్ముకుంటూ నష్టపోతున్నారని చెప్పారు. కాంగ్రెస్‌ నాయకులు ఎన్నికల ప్రచారానికి వస్తే.. నాలుగు నెలల్లో మోసగించిన తీరును ఎండగట్టాలని కోరారు. కేంద్రంలోని భాజపా ప్రభుత్వం జీఎస్టీ, పెట్రోల్‌, డీజిల్‌, నిత్యావసర ధరలు పెంచి.. పేదలపై భారం మోపిందని దుయ్యబట్టారు. పదేళ్ల కాలంలో ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని విమర్శించారు. ఆ పార్టీ నాయకులు ఇంటింటికీ దేవుళ్ల చిత్రపటాలు పంచుతూ ఓట్లు దండుకునేందుకు కుట్ర పన్నుతున్నారన్నారు. కార్యక్రమంలో భారాస ఎంపీ అభ్యర్థి వినోద్‌కుమార్‌, మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌, టెస్కాబ్‌ ఛైర్మన్‌ రవీందర్‌రావు తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని