ఆప్‌ గుజరాత్‌ సీఎం అభ్యర్థి ఓటమి

గుజరాత్‌, హిమాచల్‌ప్రదేశ్‌ శాసనసభ ఎన్నికల్లో పోటీచేసిన ప్రముఖుల్లో కొందరు ఊహించినట్లుగానే విజయం సాధించగా.. మరికొందరికి పరాభవం తప్పలేదు.

Updated : 09 Dec 2022 06:23 IST

పార్టీ అధ్యక్షుడు  ఇటాలియా కూడా

హిమాచల్‌ప్రదేశ్‌లో నెగ్గిన  వీరభద్రసింగ్‌ తనయుడు

రెండు రాష్ట్రాల్లో ప్రముఖుల  గెలుపోటములు ఇలా

ఇంటర్నెట్‌ డెస్క్‌: గుజరాత్‌, హిమాచల్‌ప్రదేశ్‌ శాసనసభ ఎన్నికల్లో పోటీచేసిన ప్రముఖుల్లో కొందరు ఊహించినట్లుగానే విజయం సాధించగా.. మరికొందరికి పరాభవం తప్పలేదు.

గుజరాత్‌ ముఖ్యమంత్రి, భాజపా నేత భూపేంద్ర పటేల్‌ ఘట్లోడియా స్థానం నుంచి 2,12,480 ఓట్లు దక్కించుకుని ఘన విజయం సాధించారు. ఇక్కడ పటేల్‌ ప్రత్యర్థి, కాంగ్రెస్‌ అభ్యర్థికి 21,120 ఓట్లు మాత్రమే లభించాయి.

ఆమ్‌ ఆద్మీ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఇసుదాన్‌ గఢ్వీ కంభాలియా నుంచి ఓటమిపాలయ్యారు. ఇక్కడ భాజపా అభ్యర్థి ములుభాయ్‌ బేరాకు 77,305 ఓట్లు రాగా.. గఢ్వీకి 58,467 ఓట్లు వచ్చాయి.

ఆప్‌ గుజరాత్‌ శాఖ అధ్యక్షుడు గోపాల్‌ ఇటాలియా కటార్‌గామ్‌ నుంచి ఓటమిపాలయ్యారు. ఇక్కడ భాజపా అభ్యర్థి వినోద్‌ మోరాదియా  64,629 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.

పాటీదార్‌ నేత, భాజపా అభ్యర్థి హార్దిక్‌ పటేల్‌ విరంగమ్‌ నుంచి విజయం సాధించారు. తన సమీప ఆమ్‌ ఆద్మీ అభ్యర్థి అమర్‌సిన్హ్‌ ఠాకూర్‌పై 51,555 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.

ఓబీసీ నేత, భాజపా అభ్యర్థి అల్పేశ్‌ ఠాకుర్‌ గాంధీనగర్‌ (సౌత్‌) నియోజకవర్గం నుంచి 43,322 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.

క్రికెటర్‌ రవీంద్ర జడేజా సతీమణి, భాజపా అభ్యర్థి రీవాబా జడేజా జామ్‌నగర్‌(నార్త్‌) నుంచి విజయం సాధించారు. రీవాబాకు 88,119 ఓట్లు రాగా.. కాంగ్రెస్‌ అభ్యర్థి బీపేంద్రసిన్హ్‌ జడేజాకు 23,088 ఓట్లు దక్కాయి.

మోర్బీ వంతెన కూలిన సమయంలో చూపిన ధైర్యసాహసాలతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన ఐదు సార్లు గెలిచిన ఎమ్మెల్యే కాంతిలాల్‌ అమృతియా మోర్బీ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. ఆయనకు 1,13,701 ఓట్లు లభించగా కాంగ్రెస్‌ అభ్యర్థి జయంతిలాల్‌ పటేల్‌కు 52,121 ఓట్లు లభించాయి. ప్రమాదం అనంతరం నదిలోకి దూకి మరీ కాంతిలాల్‌ పలువురి ప్రాణాలను కాపాడిన సంగతి తెలిసిందే.

గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో అత్యంత సంపన్న అభ్యర్థి అయిన భాజపాకు చెందిన జయంతిభాయ్‌ సోమాభాయ్‌ పటేల్‌ గెలుపొందారు. మాన్సా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి భాజపా తరఫున పోటీ చేసిన ఆయన.. కాంగ్రెస్‌ అభ్యర్థి మోహన్‌ సిన్హా థకోర్‌పై 39,248 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు.  

హిమాచల్‌ప్రదేశ్‌లోని శిమ్లా గ్రామీణం నుంచి కాంగ్రెస్‌ తరఫున పోటీచేసిన మాజీ ముఖ్యమంత్రి వీరభద్రసింగ్‌ తనయుడు విక్రమాదిత్యసింగ్‌ భాజపా అభ్యర్థి రవికుమార్‌ మెహతాపై విజయం సాధించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని