Karnataka Farmers: నారాయణఖేడ్‌, పరిగిలో కర్ణాటక రైతుల నిరసన.. అడ్డుకున్న కాంగ్రెస్‌ శ్రేణులు

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌లో కర్ణాటక రాష్ట్రానికి చెందిన రైతులు ఆందోళన ఉద్రిక్తతకు దారి తీసింది.

Published : 28 Oct 2023 16:04 IST

నారాయణ్‌ఖేడ్‌: సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌లో కాంగ్రెస్‌ పార్టీకి వ్యతిరేకంగా కర్ణాటక రాష్ట్రానికి చెందిన రైతులు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారి తీసింది. కర్ణాటకలో కాంగ్రెస్ ఇచ్చిన ఆరు హామీలు అమలు కావడం లేదంటూ ప్రకార్డులతో నారాయణఖేడ్‌లో నిరసన చేపట్టారు. తెలంగాణ పౌరులు కాంగ్రెస్‌కు ఓటు వేయొద్దని కర్ణాటక రైతులు నినాదాలు చేశారు. నిరసన చేస్తున్న వారిని స్థానిక కాంగ్రెస్‌ నేతలు అడ్డుకున్నారు. ప్లకార్డులను చించివేశారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి ఇరు వర్గాల వారిని చెదరగొట్టారు.

అనంతరం పలువురు కర్ణాటక రైతు సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ.. కర్ణాటకలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు కావడం లేదన్నారు. తెలంగాణ వాసులు కాంగ్రెస్ హామీలను నమ్మి మోసపోవద్దని కోరారు. మరోవైపు స్థానిక కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ.. ‘‘వీరు రైతులు కాదు. పెయిడ్ ఆర్టిస్టులు. తెలంగాణలో కాంగ్రెస్ హవా చూసి భారాస నాయకులు పెయిడ్ ఆర్టిస్టులతో తప్పుడు ప్రచారం చేయిస్తున్నారు’’ అని ఆరోపించారు.

పరిగిలోనూ ఆందోళన..

వికారాబాద్‌ జిల్లా పరిగిలోనూ కర్ణాటకకు చెందిన పలువురు అన్నదాతుల నిరసన తెలిపారు. కాంగ్రెస్‌ ప్రకటించిన 6 గ్యారెంటీలు అమలు కావడం లేదంటూ ఆ పార్టీకి వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించారు. పరిగిలోని కొడంగల్‌ చౌరస్తా నుంచి బస్టాండ్‌ వరకు రైతులు ర్యాలీ నిర్వహించారు. పరిగిలో రేవంత్‌ రెడ్డి రోడ్‌ షోకు ముందు కర్ణాటక రైతులు ఆందోళన చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇది గమనించిన స్థానిక కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలు రైతుల నుంచి ప్లకార్డులు లాక్కున్నారు. దీంతో రైతులు, కాంగ్రెస్‌ నేతల మధ్య వాగ్వాదం, ఉద్రిక్తత నెలకొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని