Komatireddy Venkat Reddy: ఎవరి మీదా కావాలని కక్ష సాధించం.. తప్పులుంటే చర్యలు: మంత్రి కోమటిరెడ్డి

గత పదేళ్లుగా రహదారులపై భారాస ప్రభుత్వం శ్రద్ధ పెట్టలేదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి (Komatireddy Venkat Reddy) ఆరోపించారు.

Updated : 10 Dec 2023 15:43 IST

హైదరాబాద్‌: గత పదేళ్లుగా రహదారులపై భారాస ప్రభుత్వం శ్రద్ధ పెట్టలేదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి (Komatireddy Venkat Reddy) ఆరోపించారు. సచివాలయంలో రోడ్లు, భవనాలు (ఆర్‌అండ్‌బీ) శాఖ మంత్రిగా ఆయన ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. మొత్తం 9 దస్త్రాలపై సంతకాలు చేశారు. వీటిలో నల్గొండ నుంచి ధర్మాపురం, ముషంపల్లి రహదారిని 4 లైన్‌లుగా చేయడం, కొడంగల్, దుడ్యాల రహదారి విస్తీర్ణానికి సంబంధించిన దస్త్రాలు కూడా ఉన్నాయి. రానున్న 2 - 3 ఏళ్లలో రహదారుల విస్తీర్ణానికి చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి కోమటిరెడ్డి వెల్లడించారు. ఎన్నికల వేళ ఇచ్చిన 6 గ్యారంటీలను వీలైనంత త్వరగా అమలు చేస్తామన్నారు.

హైదరాబాద్ - విజయవాడ రహదారికి అత్యంత ప్రాధాన్యత

‘‘దాదాపు పదేళ్ల తర్వాత కాంగ్రెస్‌ పార్టీ తిరిగి తెలంగాణలో అధికారంలోకి వచ్చింది. రోడ్లు, భవనాల శాఖ మంత్రిగా రహదారుల మెరుగుకు కృషి చేస్తాను. భువనగిరి ఎంపీ పదవికి సోమవారం రాజీనామా చేస్తా. రాష్ట్రంలోని 14 రహదారులకు జాతీయ హోదా ఇవ్వాలని కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీని కలిసి అడుగుతాను. ప్రాంతీయ రింగ్ రోడ్ (Regional Ring Road Hyderabad) సౌత్‌ను జాతీయ రహదారిగా గుర్తించాలని కోరుతాను. అలాగే విజయవాడ - హైదరాబాద్ రహదారిని 6 లైన్‌లకు, హైదరాబాద్ - కల్వకుర్తి 4 లైన్‌లకు, సెంట్రల్ రోడ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ (CRIF)ని పెంచాలని అడుగుతా. 9 దస్త్రాల్లో ఐదింటి అనుమతికి సోమవారం గడ్కరీని కలుస్తాను. హైదరాబాద్ - విజయవాడ రహదారిలో మల్కాపూర్ వరకు కొంత పని అయిపోయింది. 6 నెలల్లో దానిని పూర్తి చేస్తాం. హైదరాబాద్ - విజయవాడ రహదారికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి రెండున్నర గంటల్లో విజయవాడ చేరుకునేలా విస్తరిస్తాం.

2 రోజుల్లోనే ఏం చేశారని హరీశ్‌రావు మాట్లాడుతున్నారు

కొత్త కౌన్సిల్‌ భవన నిర్మాణానికి ముఖ్యమంత్రి ఆదేశించారు. త్వరలో కొత్త కౌన్సిల్‌ భవన నిర్మాణం చేపడుతాం. పాత భవనం ఆవరణలోనే ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సీఎల్‌పీ కార్యాలయాలు కూల్చి కొత్త భవనాలు నిర్మిస్తాం. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన 2 రోజుల్లోనే ఏం చేశారని హరీశ్‌రావు మాట్లాడుతున్నారు. 10 ఏళ్లుగా భారాస నేతలు ఏం చేశారు? గత పదేళ్లుగా రహదారుల మీద శ్రద్ధ పెట్టలేదు. ఎవరి మీదా.. కావాలని కక్ష సాధించం. తప్పులు ఉంటే వాటిపై చర్యలు తీసుకుంటాం. రహదారుల నిర్వహణే మా మొదటి ప్రాధాన్యత’’ అని కోమటిరెడ్డి వెల్లడించారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని