KTR: 50 ఏళ్లు అధికారం ఇచ్చినా ఏమీ చేయని వారిని పట్టించుకోవద్దు: కేటీఆర్‌

బీసీ బంధు పథకం కొంతమందికే పరిమితం కాదని.. రాష్ట్రంలో ఉన్న అర్హులందరికీ ప్రభుత్వ సాయం అందుతుందని మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇవాళ మంత్రి కేటీఆర్‌ బీసీ బంధు పథకం కింద 600 మంది లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు.

Published : 08 Aug 2023 15:59 IST

సిరసిల్ల: బీసీ బంధు పథకం కొంతమందికే పరిమితం కాదని.. రాష్ట్రంలో ఉన్న అర్హులందరికీ ప్రభుత్వ సాయం అందుతుందని మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంగళవారం బీసీ బంధు పథకం కింద 600 మంది లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. బీసీ బంధు కింద ఇచ్చే ఆర్థిక సాయం మళ్లీ తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదని తెలిపారు. చెక్కుల పంపిణీ అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి కేటీఆర్‌ మాట్లాడారు.

‘‘కేసీఆర్‌ ప్రభుత్వం.. పేదల ప్రభుత్వం. మనసున్న ప్రభుత్వం ఉంటేనే ప్రజలకు మంచి చేసే ఆలోచనలు వస్తాయి. ఇలాంటి ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉంది. వేములవాడ మున్సిపాలిటీ పరిధిలో అర్హులకు 800 పట్టాలు అందిస్తున్నాం. దాంతో పాటు సొంత స్థలం ఉన్న వారికి గృహలక్ష్మి పథకం కింద ఒక్కొక్కరికి రూ.3లక్షలు ఇస్తున్నాం. ప్రతి నియోజకవర్గానికి 3వేల మంది చొప్పున అర్హులను ఎంపిక చేస్తాం. వారందరికీ న్యాయం చేస్తాం. 50 ఏళ్లు అధికారం ఇచ్చినా ఏమీ చేయని వారి మాటలు పట్టించుకోవద్దు. వాళ్లు ఏం చేసినా మేం పట్టించుకోవాలనుకోవడం లేదు.

అయితే, వారు మీ దగ్గరకు వస్తే ఒకటే అడగండి. ఇవాళ మాట్లాడుతున్న మీరు.. మీ హయాంలో రూ.200 మాత్రమే పింఛను ఎందుకిచ్చారని ప్రశ్నించండి. నీరెందుకు ఇవ్వలేదని నిలదీయండి. ప్రజలు చైతన్యం ప్రదర్శించాలి. పని చేసే ప్రభుత్వాలు, నాయకులను ప్రజలు కాపాడుకోవాలి. ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ప్రజలు ఆగం కావొద్దు. నేను ఇంతవరకు  మద్యం, డబ్బులు పంచలేదు. ఇకపై కూడా పంచను. మీ దయ ఉంటే మరోసారి గెలుస్తా. లేకపోతే ఇంట్లో కూర్చుంటా. ఇప్పుడు ఉన్న విధంగానే భవిష్యత్తులో కూడా ప్రజలకు సేవ చేస్తా. కులం, మతం అనే పిచ్చి లేకుండా అవసరమైన పని చేసే బాధ్యత నాది. అందరికీ అండగా ఉంటా’’ అని కేటీఆర్‌ అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు