INDIA Bloc: ‘ఇండియా’లో భిన్న స్వరం.. ‘మమత’ దయ అక్కర్లేదు: కాంగ్రెస్‌

పశ్చిమ్‌బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ దయ అవసరం లేదని, సార్వత్రిక ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసే సత్తా కాంగ్రెస్‌కు ఉందని ఆ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు అధీర్‌ రంజన్‌ చౌధరి వ్యాఖ్యానించారు.

Updated : 04 Jan 2024 17:05 IST

కోల్‌కతా: కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వాన్ని కూల్చడమే లక్ష్యంగా విపక్ష పార్టీలు ఏర్పాటు చేసిన ‘ఇండియా’ కూటమిలో (INDIA Bloc) భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. సీట్ల పంపిణీ విషయంలో అంతర్గత విభేదాలు బయటపడుతున్నాయి. ఇటీవల మహారాష్ట్రలో కాంగ్రెస్‌, శివసేన (యూబీటీ), ఎన్సీపీ మధ్య ఏర్పడిన అనిశ్చితి ఓ కొలిక్కి రాకముందే.. ఇదే తరహా సమస్య పశ్చిమ్‌బెంగాల్‌లోనూ కనిపిస్తోంది. తృణమూల్‌తో పొత్తు అవసరం లేదని, సార్వత్రిక ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగే సత్తా కాంగ్రెస్‌కు (Congress) ఉందంటూ ఆ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు అధీర్‌ రంజన్‌ చౌధరి (adhir ranjan chowdhury) వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది. 

కాంగ్రెస్‌తో కలిసి సీఎం మమతా బెనర్జీ పని చేయాలనుకోవడం లేదని, ప్రధాని మోదీని ప్రసన్నం చేసుకునేందుకే ఆమెకు సమయం సరిపోతోందని ఆయన తీవ్రంగా వ్యాఖ్యానించారు. గురువారం విలేకరులతో మాట్లాడుతూ.. ‘‘ కూటమిలో భాగస్వామి అవుతానని తొలుత మమతాబెనర్జీయే ప్రతిపాదించారు. ఆమె దయాదాక్షిణ్యాలు మాకు అవసరం లేదు. కాంగ్రెస్‌ పార్టీ సొంతంగా పోటీ చేయగలదు. నిజానికి ఇండియా కూటమిలో కొనసాగడం దీదీకి ఇష్టం లేదు’’ అని పేర్కొన్నారు. పొత్తుల్లో భాగంగా మొత్తం 42 లోక్‌సభ నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌కు 2 స్థానాలు ఇవ్వాలని అధికార తృణమూల్‌ భావిస్తున్నట్లు సమాచారం. ఆ ప్రతిపాదన నచ్చకపోవడం వల్లే అధీర్‌ రంజన్‌ ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.

వీటిపై కాంగ్రెస్‌ అధిష్ఠానం నుంచి ఎలాంటి స్పందన లేదు. మరోవైపు జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌ పార్టీకి తృణమూల్‌ పూర్తి మద్దతు ప్రకటిస్తోంది. ఇండియా కూటమి కన్వీనర్‌గా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకే ఓటు వేసింది. ఆ కూటమిలో మరో కీలక నేత, జేడీయూ అధినేత నీతీశ్‌ కుమార్‌పై పార్టీకి ఎలాంటి వ్యతిరేకత లేనప్పటికీ, కన్వీనర్‌గా ఖర్గేనే మెరుగైన ప్రభావం చూపుతారని ఆ పార్టీ భావిస్తోంది. ఈ తరుణంలో అధీర్‌ రంజన్‌ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని