MP Laxman: కేసీఆర్‌ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారు: భాజపా ఎంపీ లక్ష్మణ్‌

తొలి దశ తెలంగాణ ఉద్యమంలో 369 మంది ప్రాణాలను ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం బలి తీసుకుందని భాజపా రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్‌ ఆరోపించారు.

Published : 02 Jun 2024 12:18 IST

హైదరాబాద్‌: తొలి దశ తెలంగాణ ఉద్యమంలో 369 మంది ప్రాణాలను ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం బలి తీసుకుందని భాజపా రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్‌ ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నాంపల్లిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించి మాట్లాడారు. తెలంగాణ ఉద్యమానికి భాజపా మద్దతు తెలిపి పోరాటం చేసిందన్నారు. ప్రత్యేక రాష్ట్ర బిల్లుకు మద్దతు ఇస్తామని అప్పట్లో రాజ్‌నాథ్‌‌ సింగ్ హామీ ఇచ్చారని గుర్తుచేశారు. సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీ పార్లమెంటు ఉభయ సభల్లో తెలంగాణ కోసం గళమెత్తారని తెలిపారు.  

‘‘ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చరిత్రను వక్రీకరిస్తున్నారు. 1200 మంది బలిదానాల మీద తెలంగాణ ఏర్పడింది. ఉద్యమ సమయంలో సోనియా గాంధీని రేవంత్ రెడ్డి బలిదేవత అన్నారు. ముఖ్యమంత్రి అయ్యాక బలిదేవతను ఎలా ఆరాధిస్తున్నారు? కేసీఆర్ ప్రభుత్వం కవులు, కళాకారులు, ఉద్యమకారులను విస్మరించింది. రేవంత్ రెడ్డి రాజకీయ వివాదాలు సృష్టించి కాలం గడుపుతున్నారు. తెలంగాణ చిన్నమ్మ సుష్మా స్వరాజ్‌ను విస్మరిస్తున్నారు. ప్రత్యేక రాష్ట్రాన్ని సోనియా గాంధీ ఇచ్చినట్లు రేవంత్ రెడ్డి చెప్పడం సరి కాదు. సకల జనులు పోరాటం చేసి సాధించుకున్నారు. నీళ్లు, నిధులు, నియామకాలు అమలు చేయకపోవడం వల్లే కేసీఆర్‌ను గద్దె దించారు. ఆయన రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసును కాంగ్రెస్‌ ప్రభుత్వం సీబీఐకి ఎందుకు అప్పగించడం లేదు’’ అని లక్ష్మణ్‌ ప్రశ్నించారు.  

పదేళ్లయినా ఉద్యమ ఆకాంక్షలు నెరవేరలేదు: బండి సంజయ్‌

తెలంగాణ ఏర్పడి పదేళ్లయినా నీళ్లు, నిధులు, నియామకాలు అనే ఉద్యమ ఆకాంక్షలు నెరవేరలేదని భాజపా ఎంపీ బండి సంజయ్‌ విమర్శించారు. ఈ మేరకు హైదరాబాద్‌లో ఒక ప్రకటన  విడుదల చేశారు. భారాస బాటలోనే కాంగ్రెస్ నడుస్తోందన్నారు. అవినీతితో రాజ్యమేలుతూ తెలంగాణను ఆ పార్టీ పెద్దలకు ఏటీఎంగా మార్చారని ఆరోపించారు. 6 గ్యారంటీలు సహా ఎన్నికల హామీలను తుంగలో తొక్కారని తెలిపారు. ఏ వర్గం ప్రజలను కదిలించినా ఆశాంతి, ఆగ్రహమే కనిపిస్తోందని చెప్పారు. ఉద్యమ ఆకాంక్షల అమలుకు మరో పోరుకు భాజపా సిద్ధమని బండి సంజయ్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని