Nara Lokesh: ఆ కంటెయినర్‌లో ఏముంది?బ్రెజిల్‌ సరకా.. మద్యంలో మెక్కిన రూ.వేలకోట్లా?: నారా లోకేశ్‌

రోజూ తన కాన్వాయ్‌ను తనిఖీ చేస్తున్న పోలీసులకు ఒక్కటైనా ఎన్నికల నిబంధన ఉల్లంఘన కనిపించిందా అని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ (Nara Lokesh) ప్రశ్నించారు.

Updated : 27 Mar 2024 11:54 IST

అమరావతి: రోజూ తన కాన్వాయ్‌ను తనిఖీ చేస్తున్న పోలీసులకు ఒక్కటైనా ఎన్నికల నిబంధన ఉల్లంఘన కనిపించిందా అని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ (Nara Lokesh) ప్రశ్నించారు. ఈ మేరకు ఎక్స్‌ (ట్విటర్‌)లో ఆయన పోస్ట్‌ చేశారు. ‘‘నిబంధనలు అతిక్రమించి సీఎం జగన్‌ ఇంట్లోకి వెళ్లిన కంటెయినర్‌ సంగతేంటి? ఎందుకు దాన్ని తనిఖీ చేయలేదు. అందులో ఏముంది? బ్రెజిల్‌ సరకా?మద్యంలో మెక్కిన రూ.వేలకోట్లా? లండన్‌ పారిపోయేందుకు ఏర్పాట్లా? ఏపీ సెక్రటేరియట్‌ ఇన్నాళ్లూ దాచిన దొంగ ఫైళ్లా? దీనికి డీజీపీ సమాధానం చెబుతారా?’’ అని ప్రశ్నించారు.

అనుమానాస్పదంగా ఏపీ సీఎం క్యాంపు కార్యాలయంలోకి కంటెయినర్‌

జగన్‌ డబ్బుల డంప్‌ను ఎప్పుడు పట్టుకుంటారు?

జగన్‌ ఐదేళ్ల అరాచక పాలనతో ప్రజలు విసిగిపోయారని మరో పోస్ట్‌లో లోకేశ్‌ పేర్కొన్నారు. జగన్‌ను శాశ్వతంగా తాడేపల్లి ప్యాలెస్‌లో బంధించాలనే నిర్ణయానికి ప్రజలు వచ్చారన్నారు. చీప్ ట్రిక్స్‌తో ప్రజాభీష్టాన్ని తారుమారు చేయాలని అధికార పార్టీ చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ఎన్నికల్లో ఎలాగూ గెలవడం సాధ్యం కాదని తేలిపోవడంతో వైకాపా నేతలు తాయిలాలతో ఓటర్లను ఏమార్చే ప్రయత్నం చేస్తున్నారు. రేణిగుంటలో చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి చెందిన గోదాంలో రాష్ట్రవ్యాప్తంగా పంపకానికి సిద్ధంగా ఉంచిన చేతి గడియారాలు, స్పీకర్లు, విసనకర్రలతో పాటు మొత్తం 52 రకాల వస్తువుల డంప్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తెదేపా ఫిర్యాదు చేయడంతోనే వైకాపా తాయిలాల డంప్‌ను పట్టుకున్నారు. మరి ఇసుక, లిక్కర్‌లో జగన్ దోచుకొని ఎన్నికల్లో పంచడానికి సిద్ధం చేసిన డబ్బుల డంప్‌ను ఎప్పుడు పట్టుకుంటారు? ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంటికి కిలో బంగారం ఇచ్చినా ప్రజల్లో మీపై నెలకొన్న ప్రజాగ్రహ జ్వాలలను అడ్డుకోవడం సాధ్యం కాదన్న విషయాన్ని సీఎం గుర్తించాలి’’ అని లోకేశ్‌ అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని