అనుమానాస్పదంగా ఏపీ సీఎం క్యాంపు కార్యాలయంలోకి కంటెయినర్‌

తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి మంగళవారం మధ్యాహ్నం ఒక కంటెయినర్‌ వాహనం వచ్చి వెళ్లిన తీరు చర్చనీయాంశంగా మారింది.

Updated : 27 Mar 2024 07:15 IST

ఈ కంటెయినర్‌ ఎందుకొచ్చింది.. ఏం తెచ్చింది?
వెళ్లాల్సిన మార్గంలో కాకుండా వ్యతిరేక మార్గంలో లోపలికి, బయటకు..
భద్రతా సిబ్బంది వద్ద నమోదు కాని వాహన వివరాలు

ఈనాడు, అమరావతి: తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి మంగళవారం మధ్యాహ్నం ఒక కంటెయినర్‌ వాహనం వచ్చి వెళ్లిన తీరు చర్చనీయాంశంగా మారింది. ఏపీ16జడ్‌ 0363 నంబరుతో వచ్చిన ఈ వాహనంపై పోలీసు స్టిక్కరు ఉంది. సాధారణంగా జడ్‌ సిరీస్‌ ఆర్టీసీ బస్సులకు, పి సిరీస్‌ అయితే పోలీసు వాహనాలకు ఉంటుంది. సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చే దారిలో ప్రధాన రహదారి వద్ద మెయిన్‌గేట్‌ ఉంటుంది. అక్కడ వాహనం, అందులో ఉన్నవారి వివరాలను నమోదు చేసుకుని అనుమతిస్తారు. అదే సమయంలో ఆ వాహనం వివరాలను వైర్‌లెస్‌ ద్వారా ముందున్న చెక్‌పోస్టు సిబ్బందికి చెబుతారు. మెయిన్‌గేటు నుంచి నుంచి డివైడర్‌కు ఎడమవైపున ఈ వాహనాలు లోనికి వస్తాయి. మధ్యలో రెండో చెక్‌పోస్టు వద్ద ఆటోమేటిక్‌ స్కానర్‌ ఉంటుంది. ఇక్కడ కూడా భద్రతా సిబ్బంది వాహనం నంబరు, అందులో వచ్చినవారి వివరాలను సరిచూసుకుంటారు. ముందుగా అనుమతి ఉన్న/ సమాచారం ఉన్న వాహనాలనైతే ఆ స్కానర్‌ మీదుగా లోపలికి పంపుతారు.

మంగళవారం వచ్చిన కంటెయినర్‌ ప్రధాన గేటు వద్ద ఎడమవైపు రహదారిలో వచ్చినా, రెండో చెక్‌పోస్టుకు కాస్త ముందుగానే ఎడమవైపు కాకుండా.. కుడివైపు దారిలో మళ్లించి రాంగ్‌రూట్‌లోనే క్యాంపు కార్యాలయానికి తీసుకువెళ్లారు. అందువల్ల రెండో చెక్‌పోస్టు వద్ద వాహనాన్ని స్కాన్‌ చేయలేదు. ఈ రెండో చెక్‌పోస్టు ముందు నుంచి (డివైడర్‌ ఎడమవైపు దారిలో) కాకుండా వెనుకవైపు నుంచి ఈ వాహనం నేరుగా సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకుంది. అక్కడ ద్వారం వద్ద వాహనాన్ని వెనక్కి తిప్పి కంటెయినర్‌ భాగాన్ని లోపలివైపు ఉంచారు. సుమారు గంట తర్వాత ఆ వాహనం వచ్చినదారిలోనే (డివైడర్‌కు కుడివైపు) వేగంగా బయటకు వెళ్లిపోయింది. ఈ కంటెయినర్‌ ఎందుకు వచ్చింది? అన్ని వాహనాల్లా ఎడమవైపు నుంచి కాకుండా వ్యతిరేకమార్గంలో వెళ్లడం, అలా వెళుతున్నా భద్రతా సిబ్బంది వాహనాన్ని ఆపకపోవడం ఇవన్నీ సందేహాలకు దారితీస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని