Nara Lokesh: గ్రంధి శ్రీనివాస్‌.. భీమవరానికి పట్టిన క్యాన్సర్‌ గడ్డ: లోకేశ్‌

స్థానిక వైకాపా ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్‌ భీమవరానికి పట్టిన క్యాన్సర్‌ గడ్డ అని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ విమర్శించారు.

Updated : 05 Sep 2023 19:03 IST

భీమవరం: స్థానిక వైకాపా ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌ భీమవరానికి పట్టిన క్యాన్సర్‌ గడ్డ అని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ విమర్శించారు. యువగళం పాదయాత్రలో భాగంగా పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. గ్రంధి శ్రీనివాస్‌ అక్రమాలపై వైకాపా కార్యకర్తలే ఫిర్యాదు చేశారన్నారు. జగన్‌ ఇసుకాసురుడైతే.. గ్రంధి శ్రీనివాస్‌ భూబకాసురుడని లోకేశ్‌ ధ్వజమెత్తారు. తక్కువ ధరకు భూములు కొని ఎక్కువ ధరకు అమ్మారని ఆరోపించారు. పేదలకు ఒక్క ఇల్లు కట్టలేదు.. ఆయన మాత్రం పెద్ద ప్యాలెస్‌ కట్టుకున్నారని ఎద్దేవా చేశారు.

‘‘గ్రంధి శ్రీనివాస్‌ సొంత పార్టీ కార్యకర్తలపైనే కేసులు పెట్టించారు. టిడ్కో ఇళ్లు ఉచితంగా ఇస్తామన్న హామీ ఏమైంది. భీమవరాన్ని మోడల్‌ టౌన్‌గా తీర్చిదిద్దుతాం. డంపింగ్‌ యార్డు, రింగ్‌రోడ్డు, అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ ఏర్పాటు చేస్తాం. కిడ్నీ బాధితులకు డయాలసిస్‌ కేంద్రం ఏర్పాటు చేస్తాం. ఉండి సెంటర్‌లో వంతెన నిర్మిస్తాం. ఆకివీడు పంచాయతీలో సమస్యలు పరిష్కరిస్తాం. తెదేపా హయాంలో భీమవరంలో రూ.1500 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టాం. తెదేపా అధికారంలోకి రాగానే రోడ్లు బాగు చేస్తాం’’ అని లోకేశ్‌ హామీ ఇచ్చారు.

మీ కష్టాలు చూశా.. కన్నీళ్లు తుడుస్తా

‘‘మీ లోకేశ్‌ ప్రజల్లో ఉంటాడు.. జగన్‌ పరదాల్లో ఉంటాడు. జగన్‌ది రాజారెడ్డి రాజ్యాంగం అయితే.. లోకేశ్‌ది అంబేడ్కర్‌ రాజ్యాంగం. యువగళాన్ని తొక్కేస్తామన్నారు.. ఇప్పుడు రాష్ట్రమంతా యువగళమే. యువగళం దెబ్బకి వైకాపా ఫ్యాన్‌ రెక్కలు విరిగిపోయాయి. జగన్‌ ముఖం మాడిపోయింది. ఇప్పుడు రెచ్చగొట్టే ఫ్లెక్సీలు పెడుతున్నారు. జగన్‌ హాలిడే సీఎం.. అప్పుడప్పుడు రూ.కోట్లు ఖర్చుపెట్టి హాలిడేకి లండన్ వెళ్తారు. 2వేల కి.మీ పాదయాత్రలో మీ కష్టాలు చూశా.. కన్నీళ్లు తుడుస్తా. భవిష్యత్తుకు గ్యారెంటీ పేరుతో అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రకటించాం. జగన్‌ పాలనలో నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగు మందులతో రైతులు నష్టపోతున్నారు’’ అని లోకేశ్‌ తెలిపారు.

చిచ్చు రేపిన ఫ్లెక్సీ వివాదం..

భీమవరం ప్రకాశం చౌక్‌ వద్ద వైకాపా, తెదేపా శ్రేణుల మధ్య ఫ్లెక్సీల వివాదం రేగింది. ‘పేదలకు పెత్తందారులకు మధ్య యుద్ధం పేరుతో’ వైకాపా ఫ్లెక్సీ ఏర్పాటు చేసింది. వైకాపాకు పోటీగా ‘అబ్బాయ్‌ కిల్డ్‌ బాబాయ్‌’ పేరుతో తెదేపా ఫ్లెక్సీ పెట్టింది. ఈ నేపథ్యంలో పోలీసుల, తెదేపా కార్యకర్తలకు మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగింది. ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన ప్రాంతంలో పోలీసులు భారీగా మోహరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు