Bihar Crisis: సంక్షోభం వేళ సోనియా గాంధీ ఫోన్‌.. పట్టించుకోని నీతీశ్‌..!

Bihar Crisis: బిహార్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పాటవడం దాదాపు ఖాయంగానే కన్పిస్తోంది. రాష్ట్ర రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. ఆదివారం కీలక పరిణామాలు చోటుచేసుకోనున్నట్లు సమాచారం.

Updated : 27 Jan 2024 10:32 IST

పట్నా: లోక్‌సభ ఎన్నికలకు ముందు బిహార్‌ (Bihar) రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. సంకీర్ణ ప్రభుత్వంలో విభేదాల వేళ.. భాజపా (BJP)తో మళ్లీ జట్టు కట్టాలని ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్‌ (Nitish Kumar) ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అదే నిజమైతే కేంద్రంలోని విపక్ష ‘ఇండియా’ కూటమికి గట్టి ఎదురుదెబ్బే. ఈ ఊహాగానాల వేళ కాంగ్రెస్‌ (Congress) అగ్రనేత సోనియా గాంధీ (Sonia Gandhi).. నీతీశ్‌కు ఫోన్‌ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఆమెతో మాట్లాడేందుకు సీఎం విముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం.

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ నేతృత్వంలోని ‘భారత్‌ జోడో న్యాయ యాత్ర’ ఈ నెల 30న బిహార్‌లో ప్రవేశించనుంది. ఈ యాత్రలో పాల్గొనాలని ఇప్పటికే హస్తం పార్టీ నీతీశ్‌ను ఆహ్వానించింది. దీని గురించి సోనియా గాంధీ శుక్రవారం ఆయనతో ఫోన్‌లో మాట్లాడేందుకు ప్రయత్నించినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. కానీ, ఆ కాల్స్‌ను సీఎం పట్టించుకోలేదని పేర్కొన్నాయి. రాహుల్‌ యాత్రలో పాల్గొనకూడదని ఇప్పటికే ఆయన నిర్ణయించుకున్నట్లు సదరు వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలో సంకీర్ణ కూటమి కూలిపోనుందనే ఊహాగానాలకు ఈ వార్తలు మరింత బలం చేకూర్చాయి.

మళ్లీ ఎన్‌డీయే గూటికి నీతీశ్‌?

మాకు మెజార్టీ ఉంది: లాలూ

కుటుంబ రాజకీయాలపై ఇటీవల నీతీశ్‌ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో.. ఆర్జేడీ (RJD), కాంగ్రెస్‌తో జేడీయూ బంధం బీటలు వారింది. ఈ క్రమంలోనే భాజపా మద్దతుతో జేడీయూ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం రానుందని తెలుస్తోంది. ఆదివారమే సీఎం.. గవర్నర్‌ను కలవనున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘కూటమి నుంచి నీతీశ్ విడిపోతే మా తలుపులు తెరుస్తాం. మాకు మెజార్టీ ఉంది’’ అని ఆయన వ్యాఖ్యానించడం ప్రాధాన్యం సంతరించుకుంది. నీతీశ్‌ను మళ్లీ సీఎం కాకుండా అడ్డుకునేందుకు.. చిన్న పార్టీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఆర్జేడీ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

పోటాపోటీ సమావేశాలు..

రాష్ట్రంలో కీలక పరిణామాలు జరగనున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో భాజపా, కాంగ్రెస్‌, ఆర్జేడీ పోటాపోటీగా సమావేశాలు ఏర్పాటు చేశాయి. ఈ మధ్యాహ్నం డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్‌ ఇంట్లో ఆర్జేడీ కీలక నేతలు సమావేశం కానున్నారు. అదే సమయంలో పూర్ణియాలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు భేటీ కానున్నారు. సాయంత్రం 4 గంటలకు భాజపా సమావేశం ఏర్పాటు చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని