Nitish Kumar: నీతీశ్‌ కుమార్‌ వల్ల భాజపాకే నష్టం.. డీఎంకే

నీతీశ్ కుమార్‌ ‘ఇండియా’ కూటమిని వీడటం భాజపాకే నష్టం చేస్తుందని డీఎంకే అభిప్రాయపడింది.

Published : 28 Jan 2024 17:24 IST

దిల్లీ/చెన్నై: జేడీయూ అధినేత నీతీశ్‌ కుమార్‌ (Nitish Kumar) బిహార్‌లో మహాకూటమిని వీడి తిరిగి ఎన్డీయే (NDA) కూటమిలో చేరడం ద్వారా భాజపాకే నష్టం జరుగుతుందని డీఎంకే (DMK) అభిప్రాయపడింది. ఈ పరిణామంతో జాతీయ స్థాయిలో విపక్ష కూటమి ‘ఇండియా’కే మేలు జరుగుతుందని డీఎంకే అధికార ప్రతినిధి జె.రవీంద్రన్‌ వ్యాఖ్యానించారు. ఇలాంటి ద్రోహాన్ని ప్రజలు అంగీకరించరన్నారు. నీతీశ్ కుమార్‌ ఎంత సీనియర్‌ నాయకుడైనా అయినా..  పూర్తిగా విశ్వాసం కోల్పోయారన్నారు. ఒక నాయకుడికి చిత్తశుద్ధి, విశ్వసనీయత అత్యంత ముఖ్యమన్నారు. సరైన సమయంలో ప్రజలే గుణపాఠం నేర్పుతారన్నారు.

ముగిసిన జేడీయూ-ఆర్జేడీ బంధం.. బిహార్‌ సీఎం నీతీశ్‌ కుమార్‌ రాజీనామా..

నీతీశ్‌ నిర్ణయం దురదృష్టకరం.. సౌగతా రాయ్‌

నీతీశ్ కుమార్‌ ఇండియా కూటమిని వీడి ఎన్డీయే వైపు చేరాలని తీసుకున్న నిర్ణయం దురదృష్టకరమని తృణమూల్‌ కాంగ్రెస్‌  ఎంపీ సౌగతారాయ్‌ అన్నారు. ఇలాంటి రాజకీయ అవకాశవాదానికి ప్రజలు తగిన రీతిలో బుద్ధిచెబుతారని వ్యాఖ్యానించారు. ఇండియా కూటమి నుంచి జేడీ(యూ) వైదొలగడం వల్ల అంత ప్రతికూల ప్రభావం ఏమీ ఉండదన్నారు. కూటమి నుంచి ఒక మిత్ర పక్షం వైదొలగడం రాజకీయంగా మంచిది కాదన్న ఆయన.. కాకపోతే రాజకీయాల్లో ఇలాంటివి జరుగుతుంటాయన్నారు. నేతలు వస్తుంటారు.. పోతుంటారు.. అందువల్ల ఇదేమీ పెద్ద నష్టం కాదన్నారు.

నీతీశ్‌ రాజకీయ ద్రోహి: జేఎంఎం 

బిహార్‌లో రాజకీయ పరిణామాలపై ఝార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) స్పందించింది.  నీతీశ్ రాజకీయ ద్రోహి అని.. ఆయన రాజీనామా చేస్తారని ముందే ఊహించినట్లు జేఎంఎం అధికార ప్రతినిధి సుప్రియో భట్టాచార్య తెలిపారు. ద్రోహమే నీతీశ్ రాజకీయ స్వభావమన్న ఆయన..  బిహార్‌ ప్రజలతో పాటు కర్పూరీ ఠాకూర్, జార్జ్ ఫెర్నాండెజ్, శరద్ యాదవ్, లాలూ ప్రసాద్‌ వంటి నేతలకు సైతం ద్రోహం చేశారంటూ మండిపడ్డారు. నీతీశ్‌పై విశ్వాసం లేకపోవడం వల్లే ఆయన్ను విపక్ష కూటమి ‘ఇండియా’ (INDIA bloc)కి  కన్వీనర్‌గా చేయలేదని భట్టాచార్య అన్నారు.  బిహారీలకు రాజకీయ అవగాహన ఉందని.. ఈ పరిణామాలతో వారు ఆగ్రహంతో ఉన్నారన్నారు. తరచూ పార్టీలను మార్చే వారిని ప్రజలు క్షమించబోరన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని