Janasena: పిఠాపురం నుంచి పవన్‌ కల్యాణ్ పోటీ

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ పోటీ చేసే స్థానంపై ఉత్కంఠ వీడింది. పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నట్టు  పవన్‌ స్వయంగా వెల్లడించారు.

Updated : 14 Mar 2024 15:40 IST

మంగళగిరి: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ పోటీ చేసే స్థానంపై ఉత్కంఠ వీడింది. కాకినాడ జిల్లా పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నట్టు  పవన్‌ స్వయంగా వెల్లడించారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఆవిర్భావ దినోత్సవ సభలో ఈమేరకు ప్రకటన చేశారు. తనకు ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఉందని,  ప్రస్తుతానికి ఎంపీగా పోటీ చేసే ఆలోచన లేదని స్పష్టం చేశారు. తెదేపా, భాజపాతో పొత్తులో భాగంగా జనసేనకు 21 అసెంబ్లీ, రెండు లోక్‌సభ స్థానాలు కేటాయించిన విషయం తెలిసిందే.

ఇప్పటి వరకు ప్రకటించిన అభ్యర్థులు వీరే..

ఇప్పటికే ఆరు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన ఆయన బుధవారం రాత్రి మరో 9 మందికి పచ్చజెండా ఊపినట్లు తెలిసింది. వారితో మాట్లాడి ఎన్నికల ప్రచారం చేసుకునేందుకు అనుమతి ఇచ్చారు. ఉమ్మడి విశాఖ జిల్లాలోని పెందుర్తి నియోజకవర్గం నుంచి పంచకర్ల రమేశ్‌, ఎలమంచిలి నుంచి సుందరపు విజయకుమార్‌, విశాఖ దక్షిణం నుంచి వంశీకృష్ణయాదవ్‌లను పిలిచి మాట్లాడి ప్రచారం చేసుకోవాలని చెప్పారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం అభ్యర్థిగా బొలిశెట్టి శ్రీనివాస్‌, ఉంగుటూరు నుంచి పత్సమట్ల ధర్మరాజు, నరసాపురం నుంచి బొమ్మిడి నాయకర్‌, భీమవరం నుంచి మంగళవారం పార్టీలో చేరిన పులపర్తి రామాంజనేయులు అభ్యర్థిత్వాలకు ఆమోదం తెలిపారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రాజోలు నుంచి దేవవరప్రసాద్‌ అభ్యర్థిత్వం ఖరారు చేశారు. తిరుపతి నుంచి ఆరణి శ్రీనివాసులుతో భేటీ అయ్యారు. ఈ స్థానం కూడా దాదాపు ఖరారైనట్లేనని చెబుతున్నారు. ఇప్పటికే పార్టీ తరఫున నిడదవోలు నియోజకవర్గం నుంచి కందుల దుర్గేష్‌, కాకినాడ గ్రామీణం నుంచి పంతం నానాజీ, నెల్లిమర్ల నుంచి లోకం మాధవి పోటీ చేస్తున్నట్లు పవన్‌ కల్యాణ్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని