Congress: ‘రాహుల్‌ యాత్రకు పశ్చిమ బెంగాల్‌లోనూ అడ్డంకులు’.. రాష్ట్ర ప్రభుత్వంపై అధీర్‌ విమర్శలు

భారత్‌ జోడో న్యాయ్‌ యాత్రలో భాగంగా సభల నిర్వహణకు పశ్చిమ బెంగాల్‌లో అధికారులు అనుమతులు ఇవ్వడం లేదని కాంగ్రెస్‌ పార్టీ ఆరోపించింది.

Published : 26 Jan 2024 16:43 IST

సిలిగురి: రాహుల్‌ గాంధీ (Rahhul Gandhi) చేపట్టిన భారత్‌ జోడో న్యాయ్‌ యాత్ర (Bharat Jodo Nyay Yatra)కు పశ్చిమ బెంగాల్‌ (West Bengal)లోనూ అడ్డంకులు ఎదురవుతున్నాయని కాంగ్రెస్‌ (Congress) ఆరోపించింది. బహిరంగ సభల నిర్వహణకు అధికారులు అనుమతులు ఇవ్వడం లేదని రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు అధీర్‌ రంజన్‌ చౌధరి (Adhir Ranjan Chowdhury) ఆరోపించారు. ‘‘రాష్ట్రంలో యాత్ర వెళ్లే  కొన్ని మార్గాల్లో పరీక్షల నిర్వహణను సాకుగా చూపి అధికారులు సభలకు అనుమతులు ఇవ్వడం లేదు. ఇతర ప్రాంతాల్లో అయినా మినహాయింపు లభిస్తుందని భావించాం. కానీ, అక్కడ కూడా అనుమతి ఇవ్వలేమని చెబుతున్నారు. యాత్ర ప్రారంభమైన తర్వాత అస్సాంలో మాత్రమే సమస్యలు ఎదురయ్యాయి. ఇప్పుడు పశ్చిమ బెంగాల్‌లో కూడా అడ్డంకులు సృష్టిస్తున్నారు’’అని ఆరోపించారు. 

రాహుల్‌ యాత్ర గురువారం అస్సాం నుంచి బెంగాల్‌లోని కూచ్‌బెహర్‌ జిల్లాలోకి ప్రవేశించగా, కాంగ్రెస్‌ శ్రేణులు ఆయనకు ఘన స్వాగతం పలికాయి. అనంతరం రోడ్‌ షోలో పాల్గొన్న రాహుల్‌ మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో దిల్లీకి వెళ్లారు. శుక్ర, శనివారాల్లో ఆయన విశ్రాంతి తీసుకుంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈనెల 28న యాత్ర పునఃప్రారంభమవుతుంది. మరుసటిరోజు బిహార్‌లోకి ప్రవేశిస్తుంది. తిరిగి 31న బెంగాల్‌లోకి వస్తుంది. 2021 అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాహుల్‌గాంధీ బెంగాల్‌కు రావడం ఇదే తొలిసారి. 

ఇండియా కూటమి నేతలు ఒక్కొక్కరుగా దూరమవుతుండటంతో తాజా పరిమాణాలపై చర్చించేందుకే యాత్రకు రాహుల్‌ తాత్కాలిక విరామం ప్రకటించినట్లు తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీతో పొత్తు ఉండదని టీఎంసీ అధ్యక్షురాలు, పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బుధవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. సీట్ల సర్దుబాటు విషయంలో తమ ప్రతిపాదనను కాంగ్రెస్‌ పట్టించుకోలేదని ఆమె ఆరోపించారు. కాంగ్రెస్‌, టీఎంసీల మధ్య పొత్తు విఫలం కావడానికి అధీర్‌ రంజన్‌ కారణమని టీఎంసీ నేత డెరెక్‌ ఓబ్రియెన్‌ ఆరోపించారు. ఈనేపథ్యంలో మమత ప్రభుత్వంపై ఆయన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని