Published : 29 May 2022 05:47 IST

నేనో ఫూల్‌ను!

పంజాబ్‌ సీఎంగా ఉన్నప్పుడు జీతం కూడా తీసుకోలేదు

కోర్టులో పాక్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ వ్యాఖ్యలు

లాహోర్‌: పాకిస్థాన్‌ ప్రధానమంత్రి షెహబాజ్‌ షరీఫ్‌ కోర్టులో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఒక ఫూల్‌ను అని కోర్టు ముందు చెప్పారు. మనీ లాండరింగ్‌ కేసుకు సంబంధించి శనివారం ప్రత్యేక కోర్టులో జరిగిన విచారణ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘నేనో తెలివితక్కువ వాడిని, అందుకే పంజాబ్‌ ప్రావిన్స్‌కు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కనీసం జీతం కూడా తీసుకోలేదు’’ అని అన్నారు. అక్రమ సంపాదన, అవినీతి నిరోధక చట్టం కింద షెహబాజ్‌, ఆయన కుమారులు హంజా, సులేమాన్‌లపై ఫెడరల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ(ఎఫ్‌ఐఏ) 2020, నవంబరులో కేసు నమోదు చేసింది. హంజా ప్రస్తుతం పంజాబ్‌ ప్రావిన్స్‌కు ముఖ్యమంత్రిగా ఉండగా సులేమాన్‌ యూకేలో తలదాచుకున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా.. షెహబాజ్‌ షరీఫ్‌ కుటుంబానికి 28 బినామీ ఖాతాలు ఉన్నట్లు గుర్తించామని, వీటి ద్వారా ఈ కుటుంబం 2008 నుంచి 2018 మధ్య 14 బిలియన్ల పాకిస్థానీ రూపీలను అక్రమంగా ఆర్జించిందని ఎఫ్‌ఐఏ ఆరోపించింది. ఈ ఆరోపణలను తోసిపుచ్చిన షెహబాజ్‌.. ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఇజాజ్‌ హసన్‌ అనుమతితో తన వాదనను వినిపించారు.

దేవుడు నన్ను ప్రధానిగా చేశాడు

‘‘12.5 సంవత్సరాల పదవీ కాలంలో ప్రభుత్వం నుంచి నేనేమీ తీసుకోలేదు. కానీ, రూ.25 లక్షలు అక్రమంగా సంపాదించినట్లు ఈ కేసులో నిందితుడిగా ఉన్నా. దేవుడు నన్ను ఈ దేశానికి ప్రధానిగా చేశాడు. నేను పంజాబ్‌ సీఎంగా ఉన్న సమయంలో జీతం కూడా తీసుకోలేదు. అందుకే నేను ఓ ఫూల్‌ని. సీఎంగా చక్కెర ఎగుమతులపై పరిమితులు విధించాను. ఆ సమయంలో నాకు ప్రయోజనం కల్పించే నోట్‌ను సెక్రటరీ పంపినా దాన్ని తిరస్కరించాను’’ అని షెహబాజ్‌ పేర్కొన్నారు. తన సోదరుడు నవాజ్‌ షరీఫ్‌ పాకిస్థాన్‌ ప్రధానిగా ఉన్న సమయంలో 1997లో షెహబాజ్‌ షరీఫ్‌ తొలిసారి పంజాబ్‌ ముఖ్యమంత్రి అయ్యారు. జనరల్‌ పర్వేజ్‌ ముషారఫ్‌ 1999లో నవాజ్‌ షరీఫ్‌ ప్రభుత్వాన్ని కూలదోయడంతో షెహబాజ్‌ కుటుంబం దేశాన్ని విడిచి సౌదీ అరేబియాకు వెళ్లింది. అక్కడ ఎనిమిదేళ్లపాటు ఉన్న తరవాత 2007లో తిరిగి స్వదేశానికి వచ్చింది. ఆ తరవాత 2008, 2013లో మళ్లీ పంజాబ్‌ ముఖ్యమంత్రిగా షెహబాజ్‌ బాధ్యతలు నిర్వర్తించారు. ఇటీవల ఇమ్రాన్‌ ఖాన్‌పై అవిశ్వాసంతో ఆ ప్రభుత్వం కూలిపోవడంతో పాక్‌ ప్రధానిగా షెహబాజ్‌ ఎన్నికైన విషయం తెలిసిందే.

Read latest Related stories News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts