సీఎస్కే ఆటగాడు 7 రోజులు క్వారంటైన్‌ 

చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఆటగాడు, ఆస్ట్రేలియా మాజీ ఆల్‌రౌండర్‌ షేన్‌వాట్సన్‌ ఆ జట్టుకన్నా ముందే దుబాయ్‌ చేరుకున్నాడు. ఈ సందర్భంగా అతడిని 7 రోజుల పాటు క్వారెంటైన్‌లో...

Published : 22 Aug 2020 01:36 IST

వీడియో పంచుకున్న చెన్నై సూపర్‌ కింగ్స్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఆటగాడు, ఆస్ట్రేలియా మాజీ ఆల్‌రౌండర్‌ షేన్‌వాట్సన్‌ ఆ జట్టుకన్నా ముందే దుబాయ్‌ చేరుకున్నాడు. ఈ సందర్భంగా అతడిని 7 రోజుల పాటు క్వారెంటైన్‌లో ఉండమని చెప్పారు. దీంతో అతడికి కేటాయించిన హోటల్‌ గదికే పరిమితమయ్యాడు. అక్కడ తన గది నుంచే ఒక వీడియో రూపొందించి మాట్లాడిన అతడు తానేం చేయబోతున్నాడనే విషయాలను వివరించాడు. సీఎస్కే శుక్రవారం దాన్ని ట్వీట్‌ చేసి అభిమానులతో పంచుకుంది. అందులో వాట్సన్‌ మాట్లాడుతూ.. ‘ప్రతీ ఒక్కరికి హాయ్‌, నేనిప్పుడే దుబాయ్‌కి చేరుకున్నాను. ప్రస్తుతం హోటల్లో ఉన్నాను. 7 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాలి. అలాగే కొన్ని కరోనా పరీక్షలు కూడా చేయించుకోవాలి’ అని పేర్కొన్నాడు.

అనంతరం తన గది నుంచి బయటి లొకేషన్‌ను వీడియోలో చూపించాడు. అందులో ప్రపంచంలోనే ఎత్తైన బిల్డింగ్‌ ‘బూర్జ్‌ ఖలీఫా’ కనిపించింది. అదెంతో ప్రత్యేకమైనదని, అద్భుతమైనదని వివరించాడు. తర్వాత తన గదిలోనే వ్యాయామాలు చేస్తానని, అక్కడే వాకింగ్‌ కూడా చేస్తానని చెప్పాడు. తమ జట్టును కలిసేవరకు ఇతర ఆటగాళ్లతో పాడ్‌కాస్ట్‌లో మాట్లాడతానని, ఆపై సీఎస్కేతో కలిసి ట్రైనింగ్‌ క్యాంప్‌లో పాల్గొంటానన్నాడు. ఇంకో ఐపీఎల్‌ దుబాయ్‌లో జరుగుతుండడంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు వాట్సన్‌ అన్నాడు. కాగా, ఈ ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ గతేడాది ముంబయి ఇండియన్స్‌తో తలపడిన ఫైనల్‌ మ్యాచ్‌లో చెన్నైను విజేతగా నిలపడానికి వీరోచితంగా పోరాడాడు. చివరి రెండు బంతులుండగా అనూహ్యంగా రనౌటై.. వాట్సన్‌(80; 59 బంతుల్లో 8x4, 4x6) పరుగుల వద్ద నిష్క్రమించాడు. ఆపై ముంబయి ఒక్క పరుగుతో గెలుపొంది రికార్డు స్థాయిలో నాలుగోసారి టైటిల్‌ సాధించింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని