Ashes : హాఫ్‌ సెంచరీ కొట్టగానే ఔట్.. అసహనంతో పెవిలియన్‌ బాట

యాషెస్‌ సిరీస్‌లో భాగంగా మూడో టెస్టు మ్యాచ్‌ తొలి రోజు ఆట ముగిసింది. తొలి రెండు టెస్టుల ...

Updated : 26 Dec 2021 17:09 IST

మూడో టెస్టులోనూ తడబడిన ఇంగ్లాండ్‌ బ్యాటర్లు

ఇంటర్నెట్ డెస్క్‌: యాషెస్‌ సిరీస్‌లో భాగంగా మూడో టెస్టు మ్యాచ్‌ తొలి రోజు ఆట ముగిసింది. తొలి రెండు టెస్టుల మాదిరిగానే ఈ సారి కూడానూ ఇంగ్లాండ్‌ బ్యాటర్లు చేతులెత్తేశారు. ఇంగ్లాండ్‌ సారథి జో రూట్ (50), బెయిర్‌స్టో (35) ఫర్వాలేదనిపించారు. ఆసీస్‌ బౌలర్ల ధాటికి పర్యాటక జట్టు 185 పరుగులకే ఆలౌటైంది. మిగతా బ్యాటర్లలో హసీబ్‌ హమీద్ డకౌట్, క్రావ్లే 12, మలన్ 14, స్టోక్స్ 25, బట్లర్ 3, మార్క్ ఉడ్ 6, రాబిన్‌సన్ 22, లీచ్‌ 13 పరుగులు చేశారు. ఆసీస్‌ బౌలర్లలో కమిన్స్ 3, లియాన్ 3, స్టార్క్ 2.. బొలాండ్, గ్రీన్ చెరో వికెట్ తీశారు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ఆసీస్‌ వికెట్ నష్టానికి 61 పరుగులు చేసింది. డేవిడ్ వార్నర్ (38)ను అండర్సన్‌ ఔట్ చేశాడు. ప్రస్తుతం క్రీజ్‌లో మార్కస్ హారిస్ (20*), నాథన్‌ లియాన్ (0*) ఉన్నారు. 

కీలక సమయంలో రూట్ ఔట్..

టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లాండ్‌కు ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. హమీద్ పరుగులేమీ చేయకుండా ఔటయ్యాడు. కాసేపటికే మరో ఓపెనర్ క్రావ్వే కూడా ఔటయ్యాడు. తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన రూట్, మలన్ జంట ఇన్నింగ్స్‌ను కాస్త నిలబెట్టేందుకు ప్రయత్నించారు. వీరిద్దరూ కలిసి 48 పరుగులు జోడించారు. అయితే మలన్‌ ఔటైనప్పటికీ.. స్టోక్స్‌తో కలిసి రూట్ ఇంగ్లాండ్‌ స్కోరు బోర్డును నడిపించాడు. ఈ క్రమంలో అర్ధశతకం సాధించాడు. అయితే నిలదొక్కుకొని పరుగులు చేస్తున్న కీలక సమయంలో స్టార్క్‌ బౌలింగ్‌లో కీపర్‌ క్యారీకి క్యాచ్‌ ఇచ్చి రూట్‌ ఔటయ్యాడు. దీంతో అసహనంతో క్రీజ్‌ను వదిలి పెవిలియన్‌కు చేరాడు. దీనికి సంబంధించిన వీడియోను క్రికెట్‌ ఆస్ట్రేలియా తమ ట్విటర్‌ ఖాతాలో షేర్‌ చేసింది. ఆ తర్వాత బెయిర్‌స్టో, రాబిన్‌సన్‌ మినహా ఎవరూ రాణించకపోవడంతో ఇంగ్లాండ్ 200 పరుగుల లోపే ఆలౌటైంది. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని