Virat - Carey: అప్పుడు విరాట్ కోహ్లీ ఇచ్చిన సలహాతో రాణించగలిగా: ఆసీస్‌ బ్యాటర్

భారత్‌తో జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్‌లో (WTC Final 2023) విరాట్ కోహ్లీ ఇచ్చిన సూచనలను ఇప్పుడు యాషెస్ సిరీస్‌లోనూ (Ashes Series) పాటిస్తున్నట్లు ఆసీస్‌ వికెట్ కీపర్‌ అలెక్స్ కేరీ తెలిపాడు.

Updated : 21 Jun 2023 14:03 IST

ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్ (WTC Final 2023) మ్యాచ్‌లో టీమ్‌ఇండియా ఓడిపోవడానికి ప్రధాన కారణం బ్యాటింగ్‌లో విఫలం కావడం. అయితే, ఆస్ట్రేలియా మాత్రం ఆ విషయంలో తడబాటుకు గురి కాకుండా రాణించింది. మరీ ముఖ్యంగా టాప్‌ ఆర్డర్‌తోపాటు లోయర్‌ ఆర్డర్‌లో ఆ జట్టు వికెట్‌ కీపర్‌ అలెక్స్ కేరీ ( 48, 66*) కూడా విలువైన పరుగులు చేశాడు. రెండో ఇన్నింగ్స్‌లో హాఫ్‌ సెంచరీ సాధించాడు. తాజాగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న యాషెస్‌ సిరీస్‌లోనూ కేరీ ఆడుతున్నాడు. తొలి టెస్టులోని మొదటి ఇన్నింగ్స్‌లో హాఫ్‌ సెంచరీ (66), రెండో ఇన్నింగ్స్‌లోనూ విలువైన 20 పరుగులను కేరీ చేశాడు. ఈ క్రమంలో ఇలా ఆడటానికి ప్రధాన కారణంగా ఇద్దరి పేర్లను చెప్పాడు. అందులో ఆసీస్ బ్యాటర్ స్టీవ్‌ స్మిత్ కాగా.. మరొకరు టీమ్‌ఇండియా స్టార్‌ ఆటగాడు విరాట్ కోహ్లీ. డబ్ల్యూటీసీ ఫైనల్‌ సందర్భంగా వీరిద్దరూ ఇచ్చిన సూచనల వల్లే మంచి ఇన్నింగ్స్‌లు ఆడుతున్నట్లు కేరీ పేర్కొన్నాడు.

‘‘ఇద్దరు సీనియర్ల నుంచి చాలా అంశాలు నేర్చుకున్నా. మరీ ముఖ్యంగా స్పిన్‌ బౌలింగ్‌లో రివర్స్‌ స్వీప్‌ ఆడకుండా ఉండాలని సూచించారు. ఇలాంటివి ఎందుకు ఆడతావు? అని అడిగారు. అందుకే, వారు చెప్పిందే వినడం తప్ప మరో మార్గం లేదు. కొన్నిసార్లు నేను అలాంటి షాట్లను నిర్లక్ష్యంగా ఆడి పెవిలియన్‌కు చేరేవాడిని. డబ్ల్యూటీసీ ఫైనల్‌ తొలి ఇన్నింగ్స్‌లోనూ జడేజా బౌలింగ్‌లో ఇలానే ఔటయ్యా. అక్కడ అలాంటి షాట్ అవసరం లేకపోయినా ఆడేసి దొరికిపోయా. దీంతో స్పిన్‌ బౌలింగ్‌లో రివర్స్‌ స్వీప్‌ ఆడకుండా ఉండేందుకు ప్రయత్నిస్తున్నా’’ అని తెలిపాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని