Sachin Tendulkar: ఇషాన్‌, శ్రేయస్‌ వివాదం వేళ.. ‘రంజీ’లపై సచిన్‌ పోస్ట్‌ వైరల్‌

Sachin Tendulkar: సెంట్రల్‌ కాంట్రాక్టుల్లో ఉండే ఆటగాళ్లు భారత్‌కు ప్రాతినిధ్యం వహించని సమయంలో దేశవాళీ క్రికెట్‌ ఆడాల్సిందేనని ఇటీవల బీసీసీఐ గట్టి హెచ్చరిక చేసింది. దీనిపై తాజాగా సచిన్‌ తెందూల్కర్‌ చేసిన పోస్ట్‌ వైరల్‌గా మారింది.

Updated : 06 Mar 2024 10:19 IST

ముంబయి: జాతీయ జట్టుకు దూరమైన ఆటగాళ్లు దేశవాళీ టోర్నమెంట్లలో ఆడకపోవడం తీవ్ర చర్చనీయాంశమైంది. దీన్ని బీసీసీఐ (BCCI) తీవ్రంగా పరిగణించింది. తమ హెచ్చరికలను పెడచెవిన పెట్టిన శ్రేయస్ అయ్యర్‌ (Shreyas Iyer), ఇషాన్‌ కిషన్‌ (Ishan Kishan)ను సెంట్రల్‌ కాంట్రాక్టుల నుంచి తప్పించింది. ఈ పరిణామాలపై తాజాగా క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌ (Sachin Tendulkar) స్పందించారు. దేశవాళీ టోర్నీలకు సమ ప్రాధాన్యం కల్పిస్తూ బోర్డు తీసుకున్న చర్యలను అభినందించారు.

రంజీ ట్రోఫీ (Ranji Trophy)లో ముంబయి జట్టు ఫైనల్‌కు చేరిన విషయం తెలిసిందే. దీనిపై సచిన్‌ సోషల్‌ మీడియాలో స్పందిస్తూ.. బీసీసీఐ నిర్ణయాన్ని ప్రస్తావించారు. ‘‘నా కెరీర్‌లో అవకాశం దొరికినప్పుడల్లా ముంబయి తరఫున ఆడటాన్ని ఎంతో ఇష్టపడేవాణ్ని. మా డ్రెస్సింగ్‌ రూమ్‌లో 7-8 మంది జాతీయ జట్టు ఆటగాళ్లు ఉండేవారు. వాళ్లతో కలిసి ఆడటం సరదాగా ఉండేది. జాతీయ ఆటగాళ్లు తమ దేశవాళీ జట్లతో కలిసి ఆడినప్పుడే.. వారి ఆటలో నాణ్యత మరింత పెరుగుతుంది. కొన్నిసార్లు కొత్త ప్రతిభ బయటపడుతుంది. వారి బేసిక్స్‌ను సరికొత్తగా మెరుగుపర్చుకునేందుకు అవకాశం కల్పిస్తుంది’’ అని సచిన్‌ రాసుకొచ్చారు.

భయమేల.. రవిచంద్రుడుండగ!

‘‘టీమ్‌ఇండియాకు ప్రాతినిధ్యం వహించే స్టార్‌ ఆటగాళ్లు దేశవాళీ టోర్నమెంట్లలో ఆడినప్పుడు వాటికి మరింత ఆదరణ దక్కుతుంది. అభిమానుల నుంచి కూడా ఆ టోర్నీలకు మద్దతు అందుతుంది. దేశవాళీ క్రికెట్‌కు బీసీసీఐ సమ ప్రాధాన్యం కల్పించడం అద్భుతంగా ఉంది’’ అని సచిన్‌ పేర్కొన్నారు.

అంతర్జాతీయ మ్యాచ్‌లు లేని సమయంలో దేశవాళీ క్రికెట్లో అత్యున్నత టోర్నీ అయిన రంజీ ట్రోఫీలో ఆడాలన్నది బీసీసీఐ నిబంధన. కానీ ప్రస్తుత తరం క్రికెటర్లు ఈ నిబంధనను పట్టించుకోవట్లేదు. ఇటీవల ఇషాన్‌ కిషన్‌, శ్రేయస్‌ అయ్యర్‌ బోర్డు ఆదేశాలపై నిర్లక్ష్యం వహించారు. దీంతో వారిపై బీసీసీఐ వేటు వేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని