Team India: ఆ జట్లకు వారిద్దరిలా.. భారత్‌కు హార్దిక్‌ టెస్టులు ఆడాలి: మాజీ కెప్టెన్

భారత టీ20 జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న హార్దిక్‌ పాండ్య కూడా టెస్టుల్లో ఆడాలనే డిమాండ్లూ ఎప్పట్నుంచో వస్తున్నాయి. తాజాగా ఇంగ్లాండ్‌ మాజీ కెప్టెన్ కూడా ఇదే విషయంపై స్పందించాడు.

Published : 09 Aug 2023 14:57 IST

ఇంటర్నెట్ డెస్క్‌: వన్డేలు, టెస్టులు ఆడుతున్న హార్దిక్‌ పాండ్య (Hardik Pandya) టెస్టుల్లోనూ ప్రాతినిధ్యం వహించాలని ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ నాజర్ హుస్సేన్ సూచించాడు. అయితే, పూర్తిగా ఫిట్‌నెస్‌ సాధిస్తేనే బరిలోకి దిగాలని పేర్కొన్నాడు. పేస్‌ ఆల్‌రౌండర్‌గా జట్టులో కీలక పాత్ర పోషించాలని తెలిపాడు. ఇంగ్లాండ్‌కు బెన్‌ స్టోక్స్‌, ఆసీస్‌కు కామెరూన్ గ్రీన్‌లా హార్దిక్‌ పాండ్య కూడా జట్టులో ఉంటే విదేశాల్లో భారత్‌కు ప్రయోజనకరంగా ఉంటుందని పేర్కొన్నాడు.  స్వదేశంలో టీమ్‌ఇండియా అద్భుతంగా ఆడుతుందని, కానీ విదేశాల్లో మాత్రం నిరుత్సాహానికి గురవుతోందని వ్యాఖ్యానించాడు. 

‘‘భారత జట్టులో కూడా స్టోక్స్, కామెరూన్ గ్రీన్, మిచెల్ మార్ష్‌ వంటి కేటగిరీ ఆటగాడు ఉండాలి. ఆరు లేదా ఏడో స్థానంలో బ్యాటింగ్‌ చేయడం.. కనీసం 10 నుంచి 15 ఓవర్లు సీమ్‌ బౌలింగ్‌ వేసేలా ఉంటే టీమ్‌కు ఎంతో ప్రయోజనం. స్వదేశీ పిచ్‌లపై రోహిత్, విరాట్ కోహ్లీ, శుభ్‌మన్‌ గిల్‌ ఉండటం వల్ల ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ, ఓవర్సీస్‌ పిచ్‌లపై హార్దిక్‌ పాండ్య వంటి ఆల్‌రౌండర్ టెస్టుల్లో అవసరం ఉంది’’ అని నాజర్ హుసేన్ తెలిపాడు. 


మరోసారి విండీస్‌ బోర్డు తీరుపై అశ్విన్‌

విండీస్‌ క్రికెట్ మైదానాల్లో సరైన సదుపాయాలు లేవని విమర్శలు గుప్పించిన రవిచంద్రన్ అశ్విన్‌ మరోసారి ట్విటర్‌ వేదికగా స్పందించాడు. భారత్ - విండీస్‌ జట్ల మధ్య మూడో టీ20 మ్యాచ్‌ ఆలస్యంగా ప్రారంభం కావడంపై విమర్శించాడు. 30 అడుగుల సర్కిల్‌ను మార్క్‌ చేయడంలో గయానా మైదానం సిబ్బంది జాప్యం చేశారు. దీంతో మ్యాచ్‌ దాదాపు ఐదు నిమిషాలపాటు ఆలస్యంగా ప్రారంభమైంది. దీనిని ఉద్దేశిస్తూ అశ్విన్‌ ట్వీట్ చేశాడు. ‘‘ఇది ప్రత్యేకమైన జాప్యం. ఇలాంటి కారణాలతో పర్యటించడం అంత సులువేం కాదు. క్రికెటర్‌గా ఇలాంటి ఊహించని పరిస్థితులను కూడా తీసుకోవాల్సి ఉంటుంది’’ అని పేర్కొన్నాడు. 


సంజూ.. వృథా చేసుకోవద్దు: చోప్రా

టీ20ల్లో యువకులు అదరగొడుతుండగా.. సీనియర్‌ సంజూ శాంసన్‌ మాత్రం రెండు టీ20ల్లో విఫలమై నిరాశపరిచాడు. మూడో మ్యాచ్‌లో బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. ఈ క్రమంలో వచ్చే రెండు మ్యాచుల్లోనైనా అవకాశం వస్తే తప్పకుండా సద్వినియోగం చేసుకోవాలని సంజూ శాంసన్‌కు మాజీ క్రికెటర్ ఆకాశ్‌ చోప్రా సూచించాడు. ‘‘సంజూ నీకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకో. ఇప్పుడు వృథా చేసుకుంటే తర్వాత అందిపుచ్చుకోలేవు. తర్వాత గుర్తు చేసుకుని బాధ పడాల్సి ఉంటుంది. ఇషాన్‌ కిషన్ సరిగా ఆడకపోయినప్పుడు సంజూ ఆ బాధ్యత తీసుకోవాలి. లేకపోతే వీరిద్దరి మధ్యలోకి జితేశ్‌ శర్మ వచ్చేస్తాడు. విండీస్‌ పర్యటనలో జితేశ్‌ ఏంటో నిరూపించుకున్నాడు’’ అని చోప్రా పేర్కొన్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని