Gautam Gambhir:: కోహ్లీని వెనకేసుకొచ్చిన గంభీర్‌.. మీడియాకు చురకలు..!

తక్కువ స్ట్రైక్‌ రేట్‌ విషయంలో విరాట్‌ కోహ్లీపై వస్తున్న విమర్శలను కోల్‌కతా మెంటార్‌ గౌతమ్‌ గంభీర్‌ కొట్టిపారేశాడు.

Updated : 28 Apr 2024 17:35 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: విరాట్‌ కోహ్లీతో తన అనుబంధంపై మీడియానే టీఆర్పీల కోసం తప్పుదోవ పట్టించేలా ప్రచారం చేసిందని కోల్‌కతా జట్టు మెంటార్‌ గౌతమ్‌ గంభీర్‌ అన్నాడు. సంచలనాల కోసమే తమ ఇద్దరి మధ్య ఏదో జరిగినట్లు చూపించిందని పేర్కొన్నాడు. ఇక స్ట్రైక్‌ రేట్‌ విషయంలో విమర్శలు ఎదుర్కొంటున్న కోహ్లీకి మద్దతుగా నిలిచాడు.

‘‘అదంతా టీఆర్పీల కోసమే. నేను ఎలాంటి వ్యక్తిని.. విరాట్‌ వ్యక్తిత్వం ఏమిటనేది మీడియాకు కనీస అవగాహన కూడా లేదు. మీడియా అనవసరంగా హైప్‌ సృష్టించింది. వాస్తవానికి పాజిటివ్‌గా కూడా హైప్‌ సృష్టించవచ్చు. జనాలకు మసాలా దొరక్కపోతే ఇలా చేస్తారని విరాట్‌ చెప్పిన మాటతో ఏకీభవిస్తాను. పరిపక్వత ఉన్న ఇద్దరి మధ్య బయటివారు ఎలాంటి ఇబ్బందులు సృష్టించలేరు. ఎందుకంటే అంతిమంగా బంధం వారి మధ్యే ఉంటుంది’’ అని గౌతీ వివరించాడు. విరాట్‌లా డ్యాన్స్‌, చమత్కారం తనకు సాధ్యం కాదని సరదాగా అంగీకరించాడు. ‘‘ఎంత అనుకున్నా విరాట్‌లా కనీసం ఒక్క స్టెప్‌ కూడా వేయలేను. నేను అతడి నుంచి ఏదైనా నేర్చుకోవాలనుకుంటే అది డ్యాన్స్‌ మాత్రమే’’ అని పేర్కొన్నాడు.

టీ20లో కోహ్లీ స్ట్రైక్‌ రేట్‌పై స్పందిస్తూ ‘‘ప్రతి ఆటగాడికి భిన్నమైన శైలి ఉంటుంది. మ్యాక్స్‌వెల్‌ చేసేది.. కోహ్లీకి సాధ్యం కాదు. విరాట్‌ ఆడినట్లు.. అతడు ఆడలేకపోవచ్చు. మీ జట్టులో విభిన్నమైన బ్యాటర్లు ఉండాల్సిందే. 1 నుంచి 8వ నంబర్‌ వరకు మీ వద్ద హిట్టర్లే ఉంటే.. 300 కొట్టొచ్చు లేదా 30కే ఆలౌట్‌ కావచ్చు. 100 స్ట్రైక్‌ రేటుతో ఆడినా మీరు గెలిచే పరిస్థితి ఉంటే మంచిదే. 180 స్ట్రైక్‌రేట్‌తో ఆడి ఓడిపోతే ఏమిటి ప్రయోజనం’’ అని గంభీర్‌ విశ్లేషించాడు. 

మరోవైపు కోహ్లీ కూడా ఇటీవల మాట్లాడుతూ మైదానంలో తన వైఖరిలో మార్పుపై వస్తున్న విమర్శలకు సమాధానం చెప్పాడు. ‘‘జనాలు నా ప్రవర్తనతో బాగా నిరాశపడ్డారు. నేను నవీన్‌ను హగ్‌ చేసుకున్నాను. ఆ తర్వాత మరో రోజు గౌతీ భాయ్‌ నన్ను ఆలింగనం చేసుకున్నాడు. ఈ పరిణామాలతో జనాలకు ఏమీ దొరక్కుండా పోయింది. ఫలితంగా గేలి చేయడం మొదలుపెట్టారు. మేమేమీ పిల్లలం కాదు’’ అని విరాట్‌ వ్యాఖ్యానించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని