IND vs AUS: కొంపముంచిన వాన

విశాఖ పిచ్‌ ఎప్పుడూ బ్యాటింగ్‌కు అనుకూలం. అయితే రెండ్రోజులుగా వాతావరణంలో వచ్చిన మార్పు పిచ్‌ పరిస్థితుల్ని పూర్తిగా మార్చేసింది. 

Updated : 20 Mar 2023 09:42 IST

విశాఖ పిచ్‌ ఎప్పుడూ బ్యాటింగ్‌కు అనుకూలం. అయితే రెండ్రోజులుగా వాతావరణంలో వచ్చిన మార్పు పిచ్‌ పరిస్థితుల్ని పూర్తిగా మార్చేసింది.  శుక్ర, శనివారాల్లో ఆకాశం మేఘావృతమై జల్లులు కూడా పడ్డాయి. ఇక శనివారం రాత్రంతా భారీ వర్షం కురిసింది. ఆదివారం ఉదయం 10 గంటల వరకు చినుకులు పడుతూనే ఉన్నాయి. దీంతో వికెట్‌పై తేమ అలాగే ఉండిపోయింది. ఈ పరిస్థితుల్ని అర్థం చేసుకున్న ఆసీస్‌.. అయిదుగురు పేసర్లతో బరిలో దిగింది. వారిలో స్టాయినిస్‌కు బౌలింగ్‌ చేసే అవసరమే రాలేదు. గత మ్యాచ్‌లో ఆడిన మ్యాక్స్‌వెల్‌ను తప్పించి అతని స్థానంలో పేసర్‌ నాథన్‌ ఎలిస్‌ను ఆడించింది. భారత్‌ మాత్రం అందుకు భిన్నంగా ఆలోచించింది. విశాఖలో ఎప్పట్లాగే స్పిన్నర్లు ప్రభావం చూపుతారని భావించి శార్దూల్‌ ఠాకూర్‌ బదులు అక్షర్‌ పటేల్‌తో బరిలో దిగింది. కానీ పరిస్థితులు పూర్తిగా ఆసీస్‌కు అనుకూలించాయి. ఆ జట్టు పేసర్లు విజృంభించి భారత్‌ను కుప్పకూల్చి మన జట్టుకు ఘోర పరాభవాన్ని మిగిల్చారు.


స్వింగ్‌తో తంటాలేల?

వరుసగా శ్రీలంక, న్యూజిలాండ్‌లపై 3-0తో సిరీస్‌ విజయాలు.. కోహ్లి వరుస శతకాలు.. గిల్‌ భారీ ఇన్నింగ్స్‌లు భారత అభిమానుల్ని ఉర్రేతలూగించాయి. సొంతగడ్డపై మరికొన్ని నెలల్లో జరిగే ప్రపంచకప్‌లో మనకు ఎదురేలేదన్న ధీమాను కలిగించాయి. అయితే ఆసీస్‌తో మొదటి రెండు వన్డేల అనంతరం ఏదో తేడాగా ఉందన్న అనుమానాలు ప్రారంభమమయ్యాయి. శ్రీలంక, కివీస్‌లతో ఆడిన ఆరు వన్డేల్లో నాల్గింట్లో భారత్‌ మొదట బ్యాటింగ్‌ చేసింది. శ్రీలంకతో గువాహటిలో 373/7, తిరువనంతపురంలో 390/5.. కివీస్‌తో హైదరాబాద్‌లో 349/8, ఇందౌర్‌లో 385/9 స్కోర్లతో భారత్‌ చెలరేగింది. ఫ్లాట్‌ పిచ్‌లపై భారత బ్యాటర్లకు తిరుగులేకపోయింది. కానీ బంతి కాస్త ప్రభావం చూపే పిచ్‌లకొచ్చేసరికి బ్యాట్లెత్తేశారు. శుక్రవారం వాంఖడే, ఆదివారం విశాఖలో భారత ఇన్నింగ్స్‌లే ఇందుకు నిదర్శనం. తొలి వన్డేలో భారత్‌ 39 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. 83 పరుగులకే సగం మంది పెవిలియన్‌ చేరారు. ఇక రెండో వన్డేలో పరిస్థితి మరీ ఘోరం. 49 పరుగులకే 5 వికెట్లు పడ్డాయి. 117 పరుగులకే ఆలౌట్‌. సగం ఓవర్లకే ఇన్నింగ్స్‌ను ముగించారు.

గిల్‌ నుంచి పాండ్య వరకు భారత బ్యాటర్లు ఔటైన తీరు ఎన్నో ప్రశ్నల్ని లేవనెత్తుతోంది. రెండు మ్యాచ్‌ల్లోనూ భారత బ్యాటర్లను ఎక్కువగా ఇబ్బంది పెట్టింది ఎడమచేతి వాటం పేసర్‌ స్టార్కే. పిచ్‌ నుంచి ఏమాత్రం సహకారం లభించినా అతడిని ఎదుర్కోవడం కష్టమన్నది తేలిపోయింది. గతంలో ఎడమచేతి వాటం పేసర్లను ఆడటంలో భారత బ్యాట్స్‌మెన్‌ ఇబ్బంది పడేవారు. ఇప్పుడు మళ్లీ అలాంటి సమస్యే రావడం కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ మెదడుకు పని చెప్పేదే. ఇక విశాఖ వన్డేలో భారత బ్యాటర్లు ప్రాథమిక సూత్రాల్ని కూడా పక్కనబెట్టినట్లు కనిపిస్తుంది. పేసర్లకు సహకరిస్తున్న పిచ్‌పై మొదట క్రీజులో కుదురుకోవడం ముఖ్యమన్న విషయాన్ని మరిచిపోయారు. వికెట్లకు దూరంగా వెళ్తున్న బంతుల్ని ఆడటం ద్వారా గిల్‌, రోహిత్‌, పాండ్య ఔటయ్యారు. ఏమాత్రం ఫుట్‌వర్క్‌ లేకుండా నిల్చున్న స్థానం నుంచే బంతుల్ని వెంటాడితే ఏం జరుగుతుందో ఉదాహరణలుగా నిలిచారు. సూర్యకుమార్‌ షాట్‌ సెలెక్షన్‌ మరీ పేలవం. టీ20ల్లో మాదిరే వన్డేల్లోనూ తొలి బంతికే పరుగులు రాబట్టాలని.. బౌండరీ, సిక్సర్‌ బాదాలని అతడికి ఎవరు చెప్పారో? టీ20 ఆలోచన తీరుతో బ్యాటింగ్‌ చేయబోయి అతను దెబ్బ తింటున్నాడు. ఒకట్రెండు బంతుల్ని డిఫెన్స్‌ ఆడి క్రీజులో కుదురుకునే ప్రయత్నం చేయకపోతే అతడికి కష్టమే. టీమ్‌ఇండియా తరచుగా చేస్తున్న మరో పొరపాటు.. కుడి, ఎడమల కూర్పు లేకపోవడం. బ్యాటింగ్‌ ఆర్డర్‌లో వరుసగా రోహిత్‌, గిల్‌, కోహ్లి, సూర్య, రాహుల్‌, హార్దిక్‌ల రూపంలో ఆరుగురు కుడిచేతి వాటం బ్యాటర్లే. పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు.. వికెట్లు వెంటవెంటనే పడుతున్నప్పుడు కూర్పును మార్చాలన్న ఆలోచన ఎందుకు రావట్లేదన్నది ప్రశ్న. రవీంద్ర జడేజా, అక్షర్‌ పటేల్‌ వరుసగా  7, 8 స్థానాల్లో బ్యాటింగ్‌కు వస్తున్నారు. గత కొంతకాలంగా మూడు ఫార్మాట్లలో ఈ ఇద్దరి బ్యాటింగ్‌ బాగుంది. జడేజా, అక్షర్‌లలో ఒకరిని  4, మరొకరిని ఆరో స్థానంలో ఉపయోగించుకోడానికి జట్టుకున్న ఇబ్బందేమిటో అర్థంకాదు. ప్రపంచకప్‌కు ఆయా బ్యాటింగ్‌ స్థానాల్ని ఖాయం చేసుకుంటున్న భారత్‌.. ఆర్డర్‌పై సరైన కసరత్తు చేస్తుండకపోవడం పొరపాటే. కనీసం క్లిష్టమైన మ్యాచ్‌ల్లో అయినా ఎడమచేతి వాటం బ్యాటర్లను ముందుకు పంపితే రెండో వన్డేలాంటి అనుభవాల్ని తప్పించుకోవచ్చు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు