Khaleel Ahmed: గత నాలుగున్నరేళ్లు మానసికంగా రోజూ యుద్ధమే చేశా: దిల్లీ పేసర్

దిల్లీ తరఫున అత్యుత్తమ ప్రదర్శన చేస్తూ ఇటీవల టీ20 ప్రపంచ కప్‌ కోసం ప్రకటించిన జట్టులో చోటు దక్కింది. అయితే, ట్రావెల్ రిజర్వ్‌ అయినప్పటికీ.. ఇదొక ముందడుగుగా భావిస్తున్నాడు ఆ క్రికెటర్.

Published : 11 May 2024 00:19 IST

ఇంటర్నెట్ డెస్క్: జాతీయ జట్టులోకి రావాలనేది ప్రతీ క్రికెటర్ కల. ఒక్కసారి ఆ అవకాశం వచ్చాక నిరూపించుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తారు. కానీ, కొన్నిసార్లు గాయాలు ఇబ్బందిపెట్టడంతో జట్టులో నుంచి వైదొలగాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. దిల్లీ పేసర్ ఖలీల్ అహ్మద్‌ పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా లేదు. ఈ 26 ఏళ్ల కుర్రాడు దాదాపు ఆరేళ్ల కిందట జాతీయ జట్టులోకి అరంగేట్రం చేశాడు. చివరిసారిగా 2019 నవంబర్‌లో టీమ్‌ఇండియా తరఫున మ్యాచ్‌ ఆడాడు. ఇప్పుడు మళ్లీ టీ20 ప్రపంచ కప్‌ కోసం ప్రకటించిన ట్రావెల్ రిజర్వ్‌ జాబితాలో చోటు దక్కించుకున్నాడు. ఈ నాలుగున్నరేళ్లలో మానసికంగా చాలా ఇబ్బందిపడ్డానని.. ప్రతిరోజూ యుద్ధంగా సాగేదని ఖలీల్ వ్యాఖ్యానించాడు. ప్రస్తుతం ఐపీఎల్‌లో దిల్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్న అతడు 12 మ్యాచుల్లో 14 వికెట్లు పడగొట్టాడు. 

‘‘ఐపీఎల్‌ 17వ సీజన్‌ ప్రారంభానికి ముందు చాలా నెలల నుంచి తీవ్రంగా శ్రమిస్తున్నా. తప్పకుండా మంచి రోజులు వస్తాయనే నమ్మకంతో ఉన్నా. ఈ ఎడిషన్ ముందుకుసాగుతున్న కొద్దీ నా ఆత్మవిశ్వాసం మరింత పెరిగింది. ఉత్తమంగానే బౌలింగ్‌ చేస్తున్నాననే నమ్మకం కలిగింది. తప్పకుండా మళ్లీ జట్టులోకి వస్తానని దృఢ నిశ్చయంతో ఉన్నా. టీ20 ప్రపంచకప్‌ కోసం ప్రకటించిన జట్టులో నాకూ రిజర్వ్‌లో చోటు దక్కడం ఆనందంగా ఉంది. ఇదొక ముందుడుగుగా భావిస్తా. 2019 ఆఖర్లో నేను భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించా. అప్పట్నుంచి నేను ఎప్పుడు జాతీయ టీమ్‌కు ఆడతానా? అని మానసికంగా చాలా బాధపడ్డా. ప్రతిరోజూ యుద్ధం చేసినట్లే ఉండేది నా పరిస్థితి. భారత జట్టు ఆడిన ప్రతీ మ్యాచ్‌ను చూసినప్పుడల్లా.. నేను కనుక జట్టులో ఉండుంటే అలా చేసేవాడినని ఊహించుకుంటూ ఉన్నా. నా మదిలో ఇలాంటివి చక్కర్లు కొడుతూ ఉండేవి. 

దేశవాళీ క్రికెట్‌లో ఆడితే ఎలాంటి ప్రాంతంలోనైనా  రాణించేందుకు వీలుంటుంది. అందుకే, ఏమాత్రం అవకాశం వచ్చినా వదలకుండా డొమిస్టిక్‌లో ఆడేందుకు ప్రయత్నించా. ఫాస్ట్‌ బౌలర్‌గా కాస్త కష్టమే అయినా.. అన్ని మ్యాచ్‌లను ఆడాలని నిర్ణయించుకున్నా. దానికోసం మానసికంగానూ సిద్ధమయ్యా. క్రికెట్టే జీవితంగా మారిన నాకు ఏ సమయంలోనైనా పోరాడాలని ముందే అనుకున్నా. ఆట కాకుండా మరేది నాకు ముఖ్యం కాదనిపించింది. చాలామంది ఐపీఎల్ 2024 ఎడిషన్‌ను బౌలర్లకు పీడకలలు తెప్పించే సీజన్‌గా చెబుతుంటారు. కానీ, నేను మాత్రం ఫాస్ట్‌ బౌలర్లు వెలుగులోకి వచ్చే సీజన్‌ అని చెబుతా. క్లిష్ట పరిస్థితుల్లో అత్యుత్తమ ప్రదర్శన చేస్తేనే ‘కింగ్‌’గా భావిస్తారు. నేనెప్పుడూ కింగ్‌గా ఉండేందుకే ఇష్టపడతా. ఇప్పుడున్న పరిస్థితుల్లో మెంటాలిటీ ఇలానే ఉంటుంది’’ అని ఖలీల్ అహ్మద్‌ వెల్లడించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని