WTC Final 2023: ప్చ్‌.. ఓటమే.. భారత్‌కు ఆశాభంగం

ప్చ్‌.. నిరాశే! రెండో ఇన్నింగ్స్‌లో బౌలింగ్‌ మెరుగుపడి ఉండొచ్చు. అవకాశాలే లేవనుకున్న స్థితిలో నాలుగో రోజు కోహ్లి, రహానెల పోరాటం కాస్త ఆశ కలిగించి ఉండొచ్చు.

Updated : 12 Jun 2023 07:02 IST

ఆస్ట్రేలియాదే డబ్ల్యూటీసీ
ఫైనల్లో ఘనవిజయం

ప్చ్‌.. నిరాశే! రెండో ఇన్నింగ్స్‌లో బౌలింగ్‌ మెరుగుపడి ఉండొచ్చు. అవకాశాలే లేవనుకున్న స్థితిలో నాలుగో రోజు కోహ్లి, రహానెల పోరాటం కాస్త ఆశ కలిగించి ఉండొచ్చు. కానీ ఓవల్‌లో టీమ్‌ఇండియాకు భంగపాటు తప్పలేదు. ఏదైనా అద్భుతంగా జరుగుతుండొచ్చని ఎంతో ఆత్రుతగా అయిదో రోజు ఆటను చూసిన అభిమానులకు ఆవేదనే మిగిలింది. ఏమాత్రం పోరాడకుండానే రోహిత్‌సేన చేతులెత్తేసింది.

ఆద్యంతం అన్ని రంగాల్లోనూ తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించిన ఆస్ట్రేలియాదే ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌. బొలాండ్‌ పదునైన పేస్‌తో విజృంభించడంతో ఆఖరి రోజు భారత్‌ 70 పరుగులకే చివరి అయిదు వికెట్లు కోల్పోయి 209 పరుగుల తేడాతో చిత్తయింది. ఐసీసీ ఈవెంట్‌ నుంచి మరోసారి రిక్తహస్తాలతో వెనుదిరిగింది. డబ్ల్యూటీసీ ఫైనల్లో ఓడడం భారత్‌కు ఇది వరుసగా రెండోసారి.

లండన్‌ : అద్భుతమేమీ జరగలేదు. తొలి ఇన్నింగ్స్‌లో భారీ ఆధిక్యం సమర్పించాక పుంజుకున్నా, ప్రపంచ రికార్డు లక్ష్య ఛేదనలో నాలుగో రోజు కాస్త ఆశలు రేపినా.. డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమ్‌ఇండియాకు పరాభవం తప్పలేదు. ఆఖరి రోజు ఆస్ట్రేలియా ఎలాంటి అవకాశమూ ఇవ్వలేదు. చకచకా వికెట్లు పడగొట్టి భారత్‌ ఇన్నింగ్స్‌ను ముగించింది. 444 పరుగుల ఛేదనలో ఓవర్‌నైట్‌ స్కోరు 164/3తో ఆదివారం ఇన్నింగ్స్‌ను కొనసాగించిన టీమ్‌ఇండియా.. బోలాండ్‌ (3/46), లైయన్‌ (4/41)ల ధాటికి 234 పరుగులకే ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 469 పరుగులకు ఆలౌట్‌ కాగా.. భారత్‌ 296 పరుగులే చేయగలిగింది. ఆసీస్‌ 270/8 వద్ద రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది. ట్రావిస్‌ హెడ్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు లభించింది.

బోలాండ్‌ ముంచేశాడు: కొండంత లక్ష్యం ముందున్నా, ఛేదన అసాధ్యంగా కనిపించినా, టాప్‌ ఆర్డర్‌ నిరాశపరిచినా.. టీమ్‌ఇండియా కాస్త ఆశతో ఆఖరి రోజులో అడుగుపెట్టింది అంటే కారణం కోహ్లి, అజింక్య రహానేలే. నాలుగో రోజు కోహ్లి ఎంతో సాధికారికంగా బ్యాటింగ్‌ చేశాడు. చూడముచ్చటైన షాట్లతో అలరించాడు. రహానె కూడా ఆసీస్‌ పేసర్లను సమర్థంగా ఎదుర్కొన్నాడు. 93కే మూడు వికెట్లు కోల్పోయిన జట్టును ఆదుకున్న ఈ జంట.. అభిమానుల్లో ఆశలను పెంచుతూ ఆటను ఆసక్తికరంగా మార్చేసింది. ఆదివారం ఎన్నో అంచనాలతో బరిలోకి దిగింది. కానీ ఆశలన్నీ ఆవిరి కావడానికి ఎంతో సమయం పట్టలేదు. కోహ్లి (49) ఓవర్‌నైట్‌ స్కోరుకు కేవలం 5 పరుగులే జోడించి వెనుదిరిగాడు. చివరి రోజు ఏడో ఓవర్లో బోలాండ్‌.. కోహ్లి, జడేజా (0)లను ఔట్‌ చేయడం ద్వారా మ్యాచ్‌లో టీమ్‌ఇండియాకు ఎలాంటి అవకాశం లేకుండా చేశాడు. రోహిత్‌సేనకు దారులు మూసేశాడు. మ్యాచ్‌ ఆరంభం నుంచి పదునైన పేస్‌తో ఆకట్టుకుంటూ ఆసీస్‌కు కీలకంగా మారిన బోలాండ్‌.. అస్థిర బౌన్స్‌ పిచ్‌పై మరోసారి సత్తా చాటాడు. ఆఫ్‌స్టంప్‌ లోగిలిలో అదే పనిగా బౌలింగ్‌ చేసిన బోలాండ్‌ ఫలితం రాబట్టాడు. దూరంగా వెళ్తున్న బంతిని డ్రైవ్‌ చేయబోయిన కోహ్లి ఎడ్జ్‌తో.. రెండో స్లిప్‌లో స్మిత్‌కు దొరికిపోయాడు. జడేజా.. వికెట్‌కీపర్‌కు తేలికైన క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. భారత్‌ అవకాశాలు అడుగంటిన పరిస్థితుల్లో.. రహానెకు కేఎస్‌ భరత్‌ (23) తోడయ్యాడు. కొన్ని ముచ్చటైన డ్రైవ్‌లతో అలరించిన రహానె.. భరత్‌తో కలిసి జట్టు స్కోరు 200 దాటించాడు. కానీ రహానె (46) ఎంతో సేపు నిలువలేదు. స్టార్క్‌ బౌలింగ్‌లో ఔట్‌ సైడ్‌ ఎడ్జ్‌తో వికెట్‌కీపర్‌కు చిక్కాడు. అంతే.. ఆ తర్వాత భారత్‌ ఓటమి లాంఛనమే. లైయన్‌.. టెయిలెండర్ల సంగతి చూసుకున్నాడు.

ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌: 469

భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: 296

ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌:  270/8 డిక్లేర్డ్‌

భారత్‌ రెండో ఇన్నింగ్స్‌: రోహిత్‌ ఎల్బీ (బి) లైయన్‌ 43; గిల్‌ (సి) గ్రీన్‌ (బి) బోలాండ్‌ 18; పుజారా (సి) కేరీ (బి) కమిన్స్‌ 27; కోహ్లి (సి) స్మిత్‌ (బి) బోలాండ్‌ 49; రహానె (సి) కేరీ (బి) స్టార్క్‌ 46; జడేజా (సి) కేరీ (బి) బోలాండ్‌ 0; భరత్‌ (సి) అండ్‌ (బి) లైయన్‌ 23; శార్దూల్‌ ఎల్బీ (బి) లైయన్‌ 0; ఉమేశ్‌ యాదవ్‌ (సి) కేరీ (బి) స్టార్క్‌ 1; షమి నాటౌట్‌ 13; సిరాజ్‌ (సి) బోలాండ్‌ (బి) లైయన్‌ 1; ఎక్స్‌ట్రాలు 13 మొత్తం: (63.3 ఓవర్లలో ఆలౌట్‌) 234; వికెట్ల పతనం: 1-41, 2-92, 3-93, 4-179, 5-179, 6-212, 7-213, 8-220, 9-224; బౌలింగ్‌: కమిన్స్‌ 13-1-55-1; స్కాట్‌ బోలాండ్‌ 16-2-46-3; స్టార్క్‌ 14-1-77-2; గ్రీన్‌ 5-0-13-0; లైయన్‌ 15.3-2-41-4

* అన్ని ఫార్మాట్లలో ఐసీసీ ట్రోఫీలు గెలిచిన తొలి జట్టుగా ఆస్ట్రేలియా చరిత్ర సృష్టించింది. ఆసీస్‌ 1987, 1999, 2003, 2007, 2015లో వన్డే ప్రపంచకప్‌లు, 2021లో టీ20 ప్రపంచకప్‌ గెలుచుకుంది. తాజాగా డబ్ల్యూటీసీ విజేతగా నిలిచింది.

‘ ‘మ్యాచ్‌లో వెనుకబడ్డా.. మేం మరింత పోరాటం చేయాల్సింది. ఓవల్‌ భారీ లక్ష్యాన్ని ఛేదించే పిచ్‌ కాదని.. అసాధారణంగా ఆడితేనే గెలుస్తామని తెలుసు. బౌలింగ్‌ నిరాశ పరిచింది. పరుగులు ధారాళంగా ఇచ్చేశాం. బ్యాటింగ్‌లో షాట్‌ సెలక్షన్‌ అధ్వాన్నంగా ఉంది. 2013 నుంచి ఐసీసీ ట్రోఫీ గెలవని మాట నిజమే. కానీ టైటిల్‌ను సమీపిస్తున్నాం. ఫైనల్స్‌, సెమీస్‌కు వస్తున్నాం. డబ్ల్యూటీసీ ఫైనల్లోనూ మా అత్యుత్తమ ఆటను ఆడలేకపోయాం. ఇంగ్లాండ్‌లో అనుభవం ఉన్న బ్యాటర్లు కూడా రాణించలేకపోయారు. ఊపిరి సలపని షెడ్యూల్‌ ఉంది. కానీ దొరికిన సమయంలోనే ఉత్తమంగా సన్నద్ధమవ్వాలి’’

కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌


‘‘భారత్‌ బ్యాటింగ్‌లో బాగా తడబడింది. వారి ఆట అర్ధరహితంగా ఉంది. ముఖ్యంగా షాట్‌ సెలక్షన్‌. నాలుగో రోజు చెతేశ్వర్‌ పుజారా షాటే ఇందుకు నిదర్శనం. అతడి స్థాయి బ్యాటర్‌ నుంచి ఇలాంటి షాట్‌ని ఊహించలేం. ఒక సెషన్‌ నిలవలేమా! కోహ్లి ఆడిన షాట్‌ కూడా చాలా సాధారణమైందే. వదిలేయాల్సిన బంతి అది. అర్ధసెంచరీ మైలురాయికి ఒక పరుగు దూరంలో ఉండడంతో అప్పటిదాకా అలాంటి డెలివరీలను వదిలేసిన వాడు.. ఓ బంతిని వెంటాడి ఔటయ్యాడు. తొలి ఇన్నింగ్స్‌లో జడేజా, రెండో ఇన్నింగ్స్‌లో రహానె కూడా ఇలాగే వెనుదిరిగారు’’

సునీల్‌ గావస్కర్‌


‘‘టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ను మూడు మ్యాచ్‌ల సిరీస్‌గా నిర్వహిస్తే బాగుంటుంది. కానీ అందుకు సమయం ఉందా అన్నది ప్రశ్న. నిజాయితీగా చెప్పాలంటే ఇలాంటి పెద్ద ఈవెంట్‌ను మూడు మ్యాచ్‌ల సిరీస్‌గా నిర్వహిస్తే రెండు జట్లకూ సమాన అవకాశాలుంటాయి. కానీ ఇందుకు సరైన ఖాళీ దొరకాలి. ఇక ఇలాంటి మ్యాచ్‌లకు సరైన సన్నద్ధత ఉండటం కూడా కీలకం. ఇంగ్లాండ్‌లో చివరగా సిరీస్‌ ఆడినపుడు మేం 25-30 రోజులు ఇక్కడ గడిపాం. బాగా సన్నద్ధమయ్యాం. అప్పుడు 2-1తో సిరీస్‌లో ఆధిక్యం కూడా సంపాదించాం. అదే మాదిరి ఇప్పుడు సన్నాహకానికి ఎక్కువ సమయం ఉండాల్సింది. బౌలర్లకు చాలినంత విశ్రాంతి దొరకడం కూడా కీలకం’’

రోహిత్‌ శర్మ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని