IND vs WI: ఓడితే.. అంతే!

టీమ్‌ఇండియా నిండా స్టార్‌ ఆటగాళ్లే! ఒంటి చేత్తో ఫలితం మార్చే వీరులున్నారు. క్రీజులో నిలబడి భారీ ఇన్నింగ్స్‌ ఆడే బ్యాటర్లు.. వికెట్ల వేటలో సాగే బౌలర్లున్నారు.

Updated : 08 Aug 2023 09:31 IST

టీమ్‌ఇండియాకు సవాల్‌
నేడు వెస్టిండీస్‌తో మూడో టీ20

టీమ్‌ఇండియా నిండా స్టార్‌ ఆటగాళ్లే! ఒంటి చేత్తో ఫలితం మార్చే వీరులున్నారు. క్రీజులో నిలబడి భారీ ఇన్నింగ్స్‌ ఆడే బ్యాటర్లు.. వికెట్ల వేటలో సాగే బౌలర్లున్నారు. కానీ సమష్టితత్వం.. గెలవాలన్న కసి.. గెలిపించాలన్న బాధ్యత కనిపించడం లేదు. వెరసి వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌లో 0-2తో వెనుకంజ. ఇలాంటి పరిస్థితుల్లో సిరీస్‌ ఆశలు నిలవాలంటే తప్పక గెలవాల్సిన పోరుకు భారత్‌ సిద్ధమైంది. మూడో టీ20 నేడే. మరి హార్దిక్‌ సేన పుంజుకుంటుందా?

ప్రావిడెన్స్‌ (గయానా)

ఒక్క రోజు విరామం తర్వాత.. అదే మైదానంలో మరో మ్యాచ్‌. ఆదివారం ఎక్కడైతే 2 వికెట్ల తేడాతో ఓడి.. అయిదు మ్యాచ్‌ల సిరీస్‌లో 0-2తో వెనుకబడిందో అదే చోట మంగళవారం మూడో టీ20లో వెస్టిండీస్‌ను భారత్‌ ఢీకొంటోంది. మందకొడి పిచ్‌లపై పరిస్థితులను సద్వినియోగం చేసుకుంటూ చెలరేగుతున్న విండీస్‌ బౌలర్లను మరోసారి ఎదుర్కోవడం భారత బ్యాటర్లకు పరీక్షే. మరోవైపు విధ్వంసకర ఆటగాడు పూరన్‌ను మన బౌలర్లు నిలువరించాల్సిన అవసరం ఉంది. లేకపోతే 2016 తర్వాత ఓ ద్వైపాక్షిక టీ20 సిరీస్‌లో విండీస్‌ చేతిలో టీమ్‌ఇండియాకు తొలి ఓటమి తప్పదు. గత రెండు మ్యాచ్‌ల్లోనూ విజయానికి చేరువగా వచ్చి.. దూరమైన టీమ్‌ఇండియా ఈ సారి ఎలా ఆడుతుందో?

తిలక్‌ ఒక్కడే

విండీస్‌తో తొలి రెండు టీ20ల్లో బ్యాటింగ్‌ పరంగా చెప్పుకోవాల్సింది ఏమైనా ఉంది అంటే అది కేవలం హైదరాబాద్‌ ఆటగాడు తిలక్‌ వర్మ ప్రదర్శన మాత్రమే. తొలి టీ20తో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన ఈ 20 ఏళ్ల ఎడమచేతి వాటం బ్యాటర్‌.. ఆ మ్యాచ్‌లో 39 పరుగులతో టాప్‌స్కోరర్‌గా నిలిచాడు. ఇక రెండో టీ20లో అర్ధశతకం అందుకున్నాడు. మంచి లయ మీద కనిపిస్తూ ఆత్మవిశ్వాసంతో బ్యాటింగ్‌ చేస్తున్న అతను మూడో మ్యాచ్‌లోనూ జోరు సాగించేలా ఉన్నాడు. అతనితో పాటు మిగతా బ్యాటర్లు రాణిస్తే జట్టు విజయ తీరాలకు చేరగలదు. బ్యాటర్లు మరింత బాధ్యత తీసుకోవాలంటూ కెప్టెన్‌ హార్దిక్‌ కూడా చెప్పాడు. మరి ఇషాన్‌, శుభ్‌మన్‌, సూర్యకుమార్‌, సంజు శాంసన్‌ ఈ మ్యాచ్‌లో ఎలాంటి ప్రదర్శన చేస్తారో చూడాలి. బ్యాటింగ్‌లో దూకుడు లోపించిందన్నది నిజం. సూర్య అంచనాలను అందుకోలేకపోవడం జట్టును దెబ్బతీస్తోంది. మరోవైపు బంతితో, బ్యాట్‌తో పర్వాలేదనిపిస్తున్న కెప్టెన్‌ హార్దిక్‌.. సారథిగా వ్యూహాల విషయంలో మరింత దృష్టి సారించాల్సి ఉంది. రెండో టీ20లో ఆఖర్లో వికెట్లు తీసిన చాహల్‌కు మరో ఓవర్‌ వేసే అవకాశం ఇవ్వకపోవడం, అక్షర్‌ను వాడుకోకపోవడం లాంటి నిర్ణయాలు విమర్శలకు తావిచ్చాయి.

మరింత మెరుగ్గా

గత రెండు టీ20 మ్యాచ్‌ల్లోనూ విండీస్‌ బౌలర్లు రాణించినంతంగా మన బౌలర్లు ప్రభావం చూపలేకపోయారు. ముఖ్యంగా ప్రత్యర్థి పేసర్లు పరిస్థితులను చక్కగా అంచనా వేస్తూ వైవిధ్యమైన బౌలింగ్‌తో భారత్‌ను దెబ్బకొడుతున్నారు. స్లో డెలివరీలు, షార్ట్‌ పిచ్‌ బంతులతో వికెట్లు సాధిస్తున్నారు. భారత పేసర్లలో హార్దిక్‌ మాత్రమే గత మ్యాచ్‌లో సత్తాచాటాడు. అర్ష్‌దీప్‌, ముకేశ్‌ కీలక సమయంలో పరుగులిచ్చేశారు. ముఖ్యంగా ముకేశ్‌ పరుగుల కట్టడిలో విఫలమవుతున్నాడు. ఈ మ్యాచ్‌ కోసం అతని స్థానంలో ఉమ్రాన్‌ మాలిక్‌ లేదా అవేష్‌ ఖాన్‌ను ఆడించే అవకాశం ఉంది. స్పిన్నర్లలో చాహల్‌ నిలకడగా వికెట్లు పడగొడుతున్నాడు. కుల్‌దీప్‌ గాయం కారణంగా జట్టులోకి వచ్చిన రవి బిష్ణోయ్‌ గత మ్యాచ్‌లో పూరన్‌ను ఆపలేకపోయాడు. ఫిట్‌గా ఉంటే కుల్‌దీప్‌ తుది జట్టులో  ఆడతాడు.

జోరుమీద ప్రత్యర్థి

బలమైన టీమ్‌ఇండియాపై వరుసగా రెండు టీ20ల్లో గెలిచిన వెస్టిండీస్‌ ఆత్మవిశ్వాసం పెరిగింది. ఇదే జోరులో మూడో టీ20లోనూ నెగ్గి సిరీస్‌ పట్టేయాలని చూస్తోంది. ఏడేళ్ల తర్వాత భారత్‌పై సిరీస్‌ గెలిచేందుకు వచ్చిన అవకాశాన్ని    జారవిడుచుకోవద్దని ఆ జట్టు పట్టుదలతో ఉంది. ఆ జట్టు టాప్‌ఆర్డర్‌ కూడా విఫలమవుతున్నప్పటికీ సూపర్‌ ఫామ్‌లో ఉన్న పూరన్‌ జట్టును గెలిపిస్తున్నాడు. అతనితో పాటు కెప్టెన్‌ పావెల్‌, హెట్‌మయర్‌ బ్యాటింగ్‌లో రాణిస్తున్నారు. మిగతా బ్యాటర్లు కూడా లయ అందుకుంటే ఆ జట్టును ఆపడం కష్టమే. బ్యాటింగ్‌ లోతు కూడా ఆ జట్టుకు ఎక్కువే. ఇక బౌలింగ్‌లో విండీస్‌  పటిష్ఠంగా కనిపిస్తోంది. అల్జారి జోసెఫ్‌, మెకాయ్‌, షెఫర్డ్‌, హోల్డర్‌, మేయర్స్‌ ఫాస్ట్‌ బౌలింగ్‌తో ఆకట్టుకుంటున్నారు. స్పిన్నర్‌ అకీల్‌ హొసీన్‌ కూడా రాణిస్తున్నాడు.

జట్లు (అంచనా)...

భారత్‌: ఇషాన్‌, శుభ్‌మన్‌, సూర్యకుమార్‌, తిలక్‌, శాంసన్‌, హార్దిక్‌, అక్షర్‌, రవి బిష్ణోయ్‌/కుల్‌దీప్‌, అర్ష్‌దీప్‌, చాహల్‌, ముకేశ్‌/ఉమ్రాన్‌/అవేష్‌ ఖాన్‌

వెస్టిండీస్‌: కింగ్‌, మేయర్స్‌, ఛార్లెస్‌, పూరన్‌, పావెల్‌, హెట్‌మయర్‌, షెఫర్డ్‌, హోల్డర్‌, అకీల్‌, అల్జారి జోసెఫ్‌, మెకాయ్‌.


పిచ్‌

రెండో టీ20 మాదిరే ఈ మ్యాచ్‌లోనూ పిచ్‌ మందకొడిగా ఉండే అవకాశం ఉంది. బౌలర్లకే ఎక్కువ సహకరించొచ్చు. చిన్న బౌండరీలు కావడంతో భారీ షాట్‌లు ఆడటం బ్యాటర్లకు సులభం


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని