IND vs WI - Suryakumar Yadav: కుమ్మేసిన సూర్య

టీమ్‌ఇండియా నిలిచింది. సూర్య సునామీలా విరుచుకుపడ్డ వేళ.. సిరీస్‌ ఆశలను సజీవంగా ఉంచుకుంది. సూపర్‌ ఫామ్‌ను కొనసాగిస్తూ తెలుగు కుర్రాడు తిలక్‌ వర్మ మరోసారి ఆకట్టుకున్నాడు.

Updated : 09 Aug 2023 07:00 IST

మళ్లీ మెరిసిన తిలక్‌
మూడో టీ20లో  విండీస్‌పై భారత్‌  ఘనవిజయం
ప్రావిడెన్స్‌

టీమ్‌ఇండియా నిలిచింది. సూర్య సునామీలా విరుచుకుపడ్డ వేళ.. సిరీస్‌ ఆశలను సజీవంగా ఉంచుకుంది. సూపర్‌ ఫామ్‌ను కొనసాగిస్తూ తెలుగు కుర్రాడు తిలక్‌ వర్మ మరోసారి ఆకట్టుకున్నాడు. ఫలితంగా గెలుపు తప్పనిసరైన మూడో టీ20లో వెస్టిండీస్‌ను టీమ్‌ఇండియా చిత్తుగా ఓడించింది.

రుస పరాజయాల నుంచి కోలుకుంటూ టీమ్‌ఇండియా అదరగొట్టింది. సూర్యకుమార్‌ యాదవ్‌ (83; 44 బంతుల్లో 10×4, 4×6) సూపర్‌ బ్యాటింగ్‌కు తిలక్‌ వర్మ (49 నాటౌట్‌; 37 బంతుల్లో 4×4, 1×6) విలువైన ఇన్నింగ్స్‌తో తోడైన వేళ.. మూడో టీ20లో మంగళవారం 7 వికెట్ల తేడాతో వెస్టిండీస్‌పై ఘనవిజయం సాధించింది. రోమన్‌ పావెల్‌ (40 నాటౌట్‌; 19 బంతుల్లో 1×4, 3×6), బ్రెండన్‌ కింగ్‌ (42; 42 బంతుల్లో 5×4, 1×6) రాణించడంతో మొదట వెస్టిండీస్‌ 5 వికెట్లకు 159 పరుగులు చేసింది. కుల్‌దీప్‌ యాదవ్‌ (3/28) చక్కగా బౌలింగ్‌ చేశాడు. సూర్య, తిలక్‌ జోరుతో లక్ష్యాన్ని భారత్‌ 17.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి అలవోకగా ఛేదించింది.  సిరీస్‌లో విండీస్‌ 2-1తో ఆధిక్యంలో ఉంది. నాలుగో టీ20 శనివారం జరుగుతుంది.

సూర్య ధనాధన్‌: ఒంటి చేత్తో మ్యాచ్‌ గమనాన్నే మార్చగల సత్తా సూర్యకుమార్‌ యాదవ్‌ సొంతం. కానీ మెరుపులే లేవు. సూర్యకు ఏమైందని అభిమానులంతా భావిస్తుండగా.. ఎట్టకేలకు అతడు తనదైన శైలిలో రెచ్చిపోయాడు. టీమ్‌ఇండియా సిరీస్‌ ఆశలు సజీవంగా ఉండాలంటే తప్పక నెగ్గాల్సిన మ్యాచ్‌లో తనవైన విన్యాసాలతో సూర్య ఉర్రూతలూగించాడు. తన 360 డిగ్రీ ఫామ్‌ను అందుకుంటూ కళ్లు చెదిరే షాట్లతో అలరించాడు. ఎడాపెడా ఫోర్లు, సిక్స్‌లతో జట్టును వడివడిగా విజయం వైపు నడిపించాడు. ఛేదనలో నిజానికి భారత ఓపెనర్లిద్దరూ విఫలమయ్యారు. ఇషాన్‌ కిషన్‌ స్థానంలో జట్టులోకి వచ్చిన అరంగేట్ర బ్యాటర్‌ యశస్వి జైస్వాల్‌ (1) తొలి ఓవర్లోనే క్యాచ్‌ ఔట్‌ కాగా.. మరోసారి నిరాశపరుస్తూ అయిదో ఓవర్లో గిల్‌ (6) వెనుదిరిగాడు. అప్పటికి స్కోరు 34. అది సూర్య చలవే. అప్పటికే అతడు బాదుడు మొదలెట్టేశాడు. తొలి బంతి నుంచే సూర్య జోరు మొదలైంది. జైస్వాల్‌ నిష్క్రమణతో వచ్చిన అతడు తొలి రెండు బంతుల్లో వరుసగా 4, 6 కొట్టి తన ఉద్దేశాన్ని చాటి చెప్పాడు. తిలక్‌ వర్మది కూడా కీలక ఇన్నింగ్సే. సూపర్‌ఫామ్‌ను కొనసాగిస్తూ అతడు మరోసారి ఆకట్టుకునేలా బ్యాటింగ్‌ చేశాడు. ఎదుర్కొన్న తొలి రెండు బంతులను చక్కని షాట్లతో అతడు బౌండరీ దాటించాడు. అయిదో ఓవర్లో తిలక్‌ రాకతో సూర్యకు మంచి జోడీ దొరికినట్లయింది. తిలక్‌ సంయమనాన్ని ప్రదర్శిస్తూ, చక్కగా స్ట్రైక్‌రొటేట్‌ చేస్తూ సహకరిస్తుండగా.. సూర్య యథేచ్ఛగా విరుచుకుపడ్డాడు. మెకాయ్‌ వేసిన ఇన్నింగ్స్‌ ఆరో ఓవర్లో రెండు ఫోర్లు, సిక్స్‌ దంచేశాడు. ఆఫ్‌స్టంప్‌ ఆవల పడ్డ బంతిని అతడు బౌలర్‌ తలమీదుగా అలవోకగా సిక్స్‌ కొట్టిన తీరును చూసితీరాల్సిందే. షెపర్డ్‌ ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు సాధించిన సూర్య.. 23 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు.షెపర్డ్‌ వేసిన మరో ఓవర్లో ఓ స్లో ఆఫ్‌ కటర్‌ను అతడు తనదైన స్కూప్‌తో సిక్స్‌గా మలిచి అభిమానులను మురిపించాడు. ఆ తర్వాతి బంతినే బౌండరీ దాటించాడు. సూర్య జోరు కొనసాగించడంతో భారత్‌ 12 ఓవర్లలో 114/2తో తిరుగులేని స్థితిలో నిలిచింది. తర్వాతి ఓవర్లో జోసెఫ్‌ బౌలింగ్‌లో సిక్స్‌ కొట్టిన సూర్య.. సెంచరీ చేసేలా కనిపించాడు. కానీ అదే ఊపులో మరో షాట్‌ ఆడబోయి బ్యాక్‌వర్డ్‌ స్క్వేర్‌ లెగ్‌లో క్యాచ్‌ ఔటయ్యాడు. చివరి ఏడు ఓవర్లలో చేయాల్సింది 37 పరుగులే కావడంతో భారత్‌ కంగారు పడాల్సిన అవసరం లేకపోయింది. పైగా సూర్య తుఫాన్‌ ఆగినా.. అక్కడ సాధికారికంగా బ్యాటింగ్‌ చేస్తున్న తిలక్‌ ఉన్నాడు. అతడు ఎలాంటి తడబాటుకు అవకాశం ఇవ్వకుండా హార్దిక్‌తో కలిసి జట్టును విజయ తీరాలకు చేర్చాడు. వాళ్లేమీ సమయం వృథా చేయలేదు. 16వ ఓవర్లో షెపర్డ్‌ లెంగ్త్‌ బంతిని పుల్‌తో తిలక్‌ స్టాండ్స్‌లోకి తరలిస్తే.. హార్దిక్‌ ఓ ఫోర్‌ కొట్టాడు. చివరి నాలుగు ఓవర్లలో 12 పరుగులు చేయాల్సిన స్థితిలో భారత్‌ విజయం లాంఛనమే అయింది. సూర్యతో మూడో వికెట్‌కు 87 పరుగులు జోడించిన తిలక్‌.. హార్దిక్‌ (20 నాటౌట్‌)తో అభేద్యమైన నాలుగో వికెట్‌కు 43 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు.

మెరిసిన పావెల్‌: వెస్టిండీస్‌ ఇన్నింగ్స్‌లో కెప్టెన్‌ పావెల్‌ ఆటే హైలైట్‌. కుల్‌దీప్‌ యాదవ్‌ సూపర్‌ బౌలింగ్‌తో ఆతిథ్య జట్టును టీమ్‌ఇండియా కట్టడి చేసినట్లే కనిపించింది. కానీ మెరుపు ఇన్నింగ్స్‌ ఆడిన పావెల్‌.. తన జట్టుకు మెరుగైన స్కోరును అందించాడు. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న వెస్టిండీస్‌కు మంచి ఆరంభం లభించింది. ఓపెనర్లు బ్రెండన్‌ కింగ్‌, కైల్‌ మేయర్స్‌ (25; 28 బంతుల్లో 3×4, 1×6) చక్కగా బ్యాటింగ్‌ చేయడంతో ఆ జట్టు 7 ఓవర్లలో 50 పరుగులకు చేరుకుంది. తర్వాతి ఓవర్లో మేయర్స్‌ను ఔట్‌ చేయడం ద్వారా మొదటి వికెట్‌ భాగస్వామ్యాన్ని విడదీసిన అక్షర్‌.. భారత్‌కు తొలి వికెట్‌ను అందించాడు. ఆ తర్వాత విండీస్‌ పరుగుల కోసం శ్రమించింది. కుల్‌దీప్‌ బౌలింగ్‌లో చార్లెస్‌ (12) వికెట్‌ కోల్పోయిన ఆ జట్టు .. 8 నుంచి 12 ఓవర్ల మధ్య 24 పరుగులే చేయగలిగింది. అయితే కుల్‌దీప్‌ బౌలింగ్‌లో వరుసగా 6, 4.. హార్దిక్‌ బౌలింగ్‌లో మరో ఫోర్‌తో ఇన్నింగ్స్‌కు పూరన్‌ (20) ఊపు తెచ్చాడు. కానీ 15వ ఓవర్లో అతడితోపాటు కింగ్‌ను ఔట్‌ చేయడం ద్వారా విండీస్‌కు కుల్‌దీప్‌ షాకిచ్చాడు. 16 ఓవర్లకు స్కోరు 113 పరుగులే. దీంతో విండీస్‌ తక్కువ స్కోరుతో సరిపెట్టుకునేలా కనిపించింది. కానీ రోమన్‌ పావెల్‌ చెలరేగడంతో ఆఖరి నాలుగు ఓవర్లలో వెస్టిండీస్‌ ఓ వికెట్‌ చేజార్చుకుని 46 పరుగులు పిండుకుంది. పావెల్‌ రెండు సిక్స్‌లు బాదడంతో 19వ ఓవర్లో అర్ష్‌దీప్‌ ఏకంగా 17 పరుగులు సమర్పించుకున్నాడు. ఆఖరి ఓవర్లో ముకేశ్‌ బౌలింగ్‌లో పావెల్‌ మరో సిక్స్‌ దంచేశాడు.

వెస్టిండీస్‌ ఇన్నింగ్స్‌: బ్రెండన్‌ కింగ్‌ (సి) అండ్‌ (బి) కుల్‌దీప్‌ 42; కైల్‌ మేయర్స్‌ (సి) అర్ష్‌దీప్‌ (బి) అక్షర్‌ పటేల్‌ 25; చార్లెస్‌ ఎల్బీ (బి) కుల్‌దీప్‌ 12; పూరన్‌ (స్టంప్డ్‌) శాంసన్‌ (బి) కుల్‌దీప్‌ 20; రోమన్‌ పావెల్‌ నాటౌట్‌ 40; హెట్‌మయర్‌ (సి) తిలక్‌ (బి) ముకేశ్‌ కుమార్‌ 9; షెపర్డ్‌ నాటౌట్‌ 2; ఎక్స్‌ట్రాలు 9 మొత్తం: (20 ఓవర్లలో 5 వికెట్లకు) 159; వికెట్ల పతనం: 1-55, 2-75, 3-105, 4-106, 5-123; బౌలింగ్‌: హార్దిక్‌ పాండ్య 3-0-18-0; అర్ష్‌దీప్‌ 3-0-33-0; అక్షర్‌ పటేల్‌ 4-0-24-1; చాహల్‌ 4-0-33-0; కుల్‌దీప్‌ యాదవ్‌ 4-0-28-3; ముకేశ్‌ కుమార్‌ 2-0-19-1

భారత్‌ ఇన్నింగ్స్‌: జైస్వాల్‌ (సి) జోసెఫ్‌ (బి) మెకాయ్‌ 1; గిల్‌ (సి) చార్లెస్‌ (బి) జోసెఫ్‌ 6; సూర్యకుమార్‌ (సి) కింగ్‌ (బి) జోసెఫ్‌ 83; తిలక్‌ వర్మ నాటౌట్‌ 49; హార్దిక్‌ నాటౌట్‌ 20; ఎక్స్‌ట్రాలు 5 మొత్తం: (17.5 ఓవర్లలో 3 వికెట్లకు) 164; వికెట్ల పతనం: 1-6, 2-34, 3-121; బౌలింగ్‌: మెకాయ్‌ 2-0-32-1; అకీల్‌ హోసీన్‌ 4-0-31-0; జోసెఫ్‌ 4-0-25-2; చేజ్‌ 4-0-28-0; షెపర్డ్‌ 3-0-36-0; రోమన్‌ పావెల్‌ 0.5-0-10-0


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని