చివరికి బజ్‌బాలే

రెండేళ్లుగా బజ్‌బాల్‌ ఆటతో ఇంగ్లాండ్‌ టెస్టుల్లో ఎలా దూసుకుపోతోందో తెలిసిందే. భారత పర్యటనలోనూ అదే పంథా అనుసరిస్తామని ఇంగ్లిష్‌ ఆటగాళ్లు ముందే చెప్పారు.

Updated : 29 Jan 2024 07:39 IST

రెండేళ్లుగా బజ్‌బాల్‌ ఆటతో ఇంగ్లాండ్‌ టెస్టుల్లో ఎలా దూసుకుపోతోందో తెలిసిందే. భారత పర్యటనలోనూ అదే పంథా అనుసరిస్తామని ఇంగ్లిష్‌ ఆటగాళ్లు ముందే చెప్పారు. కానీ తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో ప్రణాళిక ప్రకారం సాగిన టీమ్‌ఇండియా ఆధిపత్యం ప్రదర్శించి బజ్‌బాల్‌కు చెక్‌ పెట్టినట్లే కనిపించింది. 190 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యంతో ఓ దశలో మూడు రోజుల్లోనే మ్యాచ్‌ ముగిస్తుందేమో అనిపించింది. కానీ పరిస్థితి తలకిందులైంది. అనూహ్యంగా భారత్‌ తడబడటంతో తనకు అలవాటైన రీతిలో పుంజుకున్న ఇంగ్లాండ్‌ విజేతగా నిలిచింది. చివరకు బజ్‌బాలే నెగ్గింది. అందుకు ప్రధాన కారణం ఒలీ పోప్‌, టామ్‌ హార్ట్‌లీ. రెండో ఇన్నింగ్స్‌లో పోప్‌ 196 పరుగుల అద్భుత ఇన్నింగ్స్‌తో జట్టు ఆశలు నిలపగా.. హార్ట్‌లీ 7 వికెట్లతో గెలిపించాడు. మొత్తంగా తన అరంగేట్ర టెస్టులో అతను 9 వికెట్లు సాధించాడు. స్పిన్‌తో ఇంగ్లాండ్‌ను దెబ్బకొట్టాలని చూసిన భారత్‌కు అదే బూమరాంగ్‌లా తగిలింది. పోప్‌ దెబ్బకు లైన్‌, లెంగ్త్‌ తప్పిన మన స్పిన్నర్లు పరుగులు ఇచ్చేసుకున్నారు. రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్‌ 45/1తో ఉన్నప్పుడు క్రీజులోకి వచ్చిన పోప్‌ 386 నిమిషాల పాటు క్రీజులో నిలిచి చివరి వికెట్‌గా వెనుదిరిగాడు. స్పిన్‌కు అనుకూలమైన పిచ్‌పై అశ్విన్‌, జడేజా, అక్షర్‌ లాంటి స్పిన్నర్లను అతను ఎదుర్కొన్న తీరు అద్భుతం. స్వీప్‌ను ప్రధాన ఆయుధంగా ఉపయోగించి విజయవంతమయ్యాడు. ఆదివారం తొలి సెషన్‌లోనూ ప్రత్యర్థిని త్వరగా ఆలౌట్‌ చేయకపోవడం కొంపముంచింది. ఇక హార్ట్‌లీ స్పిన్‌కు మన బ్యాటర్ల దగ్గర సమాధానమే లేకుండా పోయింది. రోహిత్‌ కనీసం స్వీప్‌ షాట్లు ఆడాడు. మిగతా బ్యాటర్లకు క్రీజులో నిలవడమే కష్టమైపోయింది. అశ్విన్‌, భరత్‌ లాగా మిగతా బ్యాటర్లూ కనీస పోరాట పటిమ ప్రదర్శించి ఉంటే ఫలితం మరోలా ఉండేదే. ఈ ఓటమితో ఇంగ్లాండ్‌ జట్టుతో సిరీస్‌ అంత తేలిక కాదని మన జట్టుకు స్పష్టంగా తెలిసొచ్చింది. మరి మిగతా నాలుగు మ్యాచ్‌ల్లో మన జట్టు వ్యూహం మారుస్తుందా?  2021లోనూ ఇలాగే ఓటమితో ఇంగ్లాండ్‌ సిరీస్‌ను మొదలెట్టిన భారత్‌.. మిగతా మూడు మ్యాచ్‌ల్లో గెలిచి సిరీస్‌ దక్కించుకుంది. మరి ఈసారి కూడా అదే ఫలితం పునరావృతం అవుతుందా..? లేక భారత్‌ పుంజుకుని ఆ జట్టుకు చెక్‌ పెడుతుందా..?

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని