నిన్న జేక్‌.. నేడు జాక్స్‌

ఐపీఎల్‌లో ఇప్పటికే ఆస్ట్రేలియా యువ సంచలనం జేక్‌ ఫ్రేజర్‌ సంచలన ఇన్నింగ్స్‌లతో చెలరేగిపోతుంటే.. ఇప్పుడు మరో విదేశీ కుర్రాడు తన సత్తా చూపించాడు. బెంగళూరుకు ఆడుతున్న ఇంగ్లాండ్‌ ఆల్‌రౌండర్‌ విల్‌ జాక్స్‌..

Updated : 29 Apr 2024 07:01 IST

ఐపీఎల్‌లో మరో ‘కొత్త’ మెరుపు
41 బంతుల్లోనే సెంచరీ
గుజరాత్‌పై ఆర్సీబీ గెలుపు
అహ్మదాబాద్‌

ఐపీఎల్‌లో ఇప్పటికే ఆస్ట్రేలియా యువ సంచలనం జేక్‌ ఫ్రేజర్‌ సంచలన ఇన్నింగ్స్‌లతో చెలరేగిపోతుంటే.. ఇప్పుడు మరో విదేశీ కుర్రాడు తన సత్తా చూపించాడు. బెంగళూరుకు ఆడుతున్న ఇంగ్లాండ్‌ ఆల్‌రౌండర్‌ విల్‌ జాక్స్‌.. ఆదివారం విధ్వంసక శతకంతో జట్టుకు ఘనవిజయాన్నందించాడు. ఒక దశ వరకు మామూలుగానే ఆడిన జాక్స్‌.. మధ్యలో పూనకం వచ్చినట్లు గుజరాత్‌ బౌలర్లపై పడిపోయాడు. కేవలం 10 బంతుల్లో తన రెండో 50ని అందుకుని మొత్తంగా 41 బంతుల్లోనే శతకం సాధించి ఔరా అనిపించాడు. కోహ్లి కూడా చెలరేగడంతో 201 పరుగుల లక్ష్యాన్ని కేవలం 16 ఓవర్లలోనే ఛేదించేసింది. 14 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఆర్సీబీ 200పై లక్ష్యాన్ని ఛేదించడం విశేషం.

ఐపీఎల్‌ సీజన్లో రెండో విజయం సాధించడానికి నెల రోజులు వేచి చూసింది బెంగళూరు. ఆ గెలుపు ఊపులో ఇంకో రోజుల్లోనే మరో విజయాన్ని అందుకుంది. ఆదివారం బెంగళూరు.. గుజరాత్‌ను 9 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. మొదట సాయి సుదర్శన్‌ (84 నాటౌట్‌; 49 బంతుల్లో 8×4, 4×6), షారుక్‌ ఖాన్‌ (58; 30 బంతుల్లో 3×4, 5×6) మెరుపులతో గుజరాత్‌ 200/3 స్కోరు చేసింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ విల్‌ జాక్స్‌ (100 నాటౌట్‌; 41 బంతుల్లో 5×4, 10×6) విధ్వంసక శతకంతో లక్ష్యాన్ని ఆర్సీబీ 16 ఓవర్లలో ఒక్క వికెటే కోల్పోయి అందుకుంది.   కోహ్లి (70 నాటౌట్‌; 44 బంతుల్లో 6×4, 3×6) కూడా సత్తా చాటాడు.

మొదట కోహ్లి..: 201 ఛేదనలో బెంగళూరుకు కెప్టెన్‌ డుప్లెసిస్‌ (24; 12 బంతుల్లో 1×4, 3×6) మెరుపు ఆరంభాన్నిచ్చాడు. ఒకవైపు కోహ్లి నెమ్మదిగా ఆడుతుంటే డుప్లెసిస్‌ మాత్రం బాదడంపైనే దృష్టి పెట్టాడు. దీంతో ఆర్సీబీ 3 ఓవర్లకు 37/0తో దూసుకెళ్లింది. పవర్‌ప్లేలోనే డుప్లెసిస్‌ వెనుదిరిగినా.. బాదే బాధ్యతను విరాట్‌ తీసుకున్నాడు. సాయికిశోర్‌ వేసిన అయిదో ఓవర్లో వరుసగా రెండు సిక్సర్లు కొట్టాడు. ఈ క్రమంలోనే విరాట్‌ 37 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. 12 ఓవర్లకు ఆర్సీబీ స్కోరు 123/1. సాధించాల్సిన రన్‌రేట్‌ దాదాపు పది వరకు ఉంది. కోహ్లి ఇలాగే ఆడుతూపోతే గెలుపు తథ్యం అన్న అంచనాల్లో ఉన్నారు అభిమానులు! విరాట్‌ను ఔట్‌ చేస్తే ఆర్సీబీని చుట్టేయచ్చన్న ఆలోచనలో ఉంది గుజరాత్‌! కానీ ముప్పు ఇంకోవైపు ఉందని ఊహించలేకపోయింది.

అమ్మో జాక్స్‌..: కోహ్లి ఒకవైపు బాదుతుంటే మరోవైపు ఓపిగ్గా బంతికో పరుగు చొప్పున చేస్తూ మద్దతు ఇచ్చాడు జాక్స్‌. మొదట 16 బంతుల్లో 16 పరుగులే చేసిన అతడు.. 22 బంతుల్లో 29 పరుగులతో కాస్త వేగాన్ని పెంచాడు. కానీ అక్కడ నుంచి పూనకం వచ్చినట్టు బౌలర్లపై పడిపోయాడు. బౌలర్లపై కసి ఉన్నట్టుగా అతడు కొట్టడం.. బంతి వెళ్లి ప్రేక్షకుల్లో పడడం.. ఇలా సాగింది జాక్స్‌ ఆట. ముఖ్యంగా మోహిత్‌ వేసిన 15 ఓవర్లో శివాలెత్తిపోయాడు. ఆ ఓవర్లో 3 సిక్స్‌లు, 2 ఫోర్లతో ఏకంగా 29 పరుగులు రాబట్టిన జాక్స్‌.. 16వ ఓవర్లో (రషీద్‌ఖాన్‌) మరో నాలుగు సిక్స్‌లు, ఫోర్‌ బాది 41 బంతుల్లో సెంచరీ సాధించడమే కాక.. ఆర్సీబీకి ఘన విజయాన్ని అందించాడు. 31 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న జాక్స్‌.. కేవలం మరో పది బంతుల్లోనే సెంచరీ సాధించడం విశేషం. 14 ఓవర్లకు సమీకరణం 36 బంతుల్లో 54గా ఉంటే మరో రెండు ఓవర్లలోనే బెంగళూరు ఛేదన పూర్తయిందంటే జాక్స్‌ విధ్వంసాన్ని ఊహించొచ్చు.  

సుదర్శన్‌, షారుక్‌ మెరుపులు: అంతకుముందు స్పిన్నర్‌ స్వప్నిల్‌ సింగ్‌తో తొలి ఓవర్‌ వేయించిన బెంగళూరు ఆరో బంతికే ఫలితం రాబట్టింది. సన్‌రైజర్స్‌తో గత మ్యాచ్‌లో ట్రావిస్‌ హెడ్‌ను త్వరగా పెవిలియన్‌ చేర్చిన మ్యాచ్‌ను మలుపుతిప్పిన స్వప్నిల్‌.. ఈసారి సాహా (5)ను ఔట్‌ చేశాడు. అక్కడ నుంచి ఆర్సీబీ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు వేయడంతో పవర్‌ప్లేలో జీటీ ధాటిగా ఆడలేకపోయింది. కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ (16) కూడా స్పిన్నర్‌ మ్యాక్స్‌వెల్‌కి దొరికిపోవడంతో 7 ఓవర్లకు 47/2తో ఇబ్బందుల్లో పడింది. ఈ స్థితిలో ఓపెనర్‌ సాయి సుదర్శన్‌, షారుక్‌ ఖాన్‌తో కలిసి ఆర్సీబీ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. ఎనిమిదో ఓవర్లో సుదర్శన్‌ ఓ సిక్స్‌, ఫోర్‌..తొమ్మిదో ఓవర్లో షారుక్‌ ఓ సిక్స్‌, ఫోర్‌ బాదడంతో గుజరాత్‌ స్కోరులో కదలిక వచ్చింది. షారుక్‌ సిక్సర్లతో సాగగా.. సుదర్శన్‌ గ్రౌండ్‌ షాట్లతో స్కోరు పెంచడంతో జీటీ 14 ఓవర్లకు 131/2తో భారీ స్కోరుపై కన్నేసింది. కానీ సిరాజ్‌ వేసిన ఓ రివర్స్‌ స్వింగ్‌ యార్కర్‌కి షారుక్‌ క్లీన్‌బౌల్డ్‌ కావడంతో ఈ భాగస్వామ్యానికి తెరపడింది. ఈ స్థితిలో సుదర్శన్‌, మిల్లర్‌ (26 నాటౌట్‌; 19 బంతుల్లో 2×4, 1×6) ధాటిగా ఆడడంతో జీటీ 200 మార్కును అందుకుంది.

గుజరాత్‌ ఇన్నింగ్స్‌: సాహా (సి) కర్ణ్‌శర్మ (బి) స్వప్నిల్‌ సింగ్‌ 5; శుభ్‌మన్‌ గిల్‌ (సి) గ్రీన్‌ (బి) మ్యాక్స్‌వెల్‌ 16; సుదర్శన్‌ నాటౌట్‌ 84; షారుక్‌ ఖాన్‌ (బి) సిరాజ్‌ 58; మిల్లర్‌ నాటౌట్‌ 26; ఎక్స్‌ట్రాలు 11 మొత్తం: (20 ఓవర్లలో 3 వికెట్లకు) 200; వికెట్ల పతనం: 1-6, 2-45, 3-131; బౌలింగ్‌: స్వప్నిల్‌ సింగ్‌ 3-0-23-1; సిరాజ్‌ 4-0-34-1; యశ్‌ దయాల్‌ 4-0-34-0; మ్యాక్స్‌వెల్‌ 3-0-28-1; కర్ణ్‌శర్మ 3-0-38-0; గ్రీన్‌ 3-0-42-0

బెంగళూరు ఇన్నింగ్స్‌: కోహ్లి నాటౌట్‌ 70; డుప్లెసిస్‌ (సి) శంకర్‌ (బి) సాయికిశోర్‌ 24; విల్‌ జాక్స్‌ నాటౌట్‌ 100; ఎక్స్‌ట్రాలు 12 మొత్తం: (16 ఓవర్లలో వికెట్‌ నష్టానికి) 206; వికెట్ల పతనం: 1-40; బౌలింగ్‌: అజ్మతుల్లా 2-0-18-0; సందీప్‌ వారియర్‌ 1-0-15-0; సాయికిశోర్‌ 3-0-30-1; రషీద్‌ 4-0-51-0; నూర్‌ 4-0-43-0; మోహిత్‌శర్మ 2-0-41-0

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని