సన్‌రైజర్స్‌ మళ్లీ..

సన్‌రైజర్స్‌ మళ్లీ తడబడింది. సంచలన బ్యాటింగ్‌తో టోర్నీలో కలకలం రేపి ఓ దశలో తిరుగులేనట్లు కనిపించిన ఆ జట్టు వరుసగా రెండో పరాజయం చవిచూసింది. సన్‌రైజర్స్‌ బ్యాటర్లకు కళ్లెం వేసిన చెన్నై సూపర్‌కింగ్స్‌ అయిదో విజయాన్ని ఖాతాలో వేసుకుంది.

Updated : 29 Apr 2024 06:55 IST

వరుసగా రెండో ఓటమి
చెన్నై చేతిలో చిత్తు
చెలరేగిన రుతురాజ్‌
చెన్నై

సన్‌రైజర్స్‌ మళ్లీ తడబడింది. సంచలన బ్యాటింగ్‌తో టోర్నీలో కలకలం రేపి ఓ దశలో తిరుగులేనట్లు కనిపించిన ఆ జట్టు వరుసగా రెండో పరాజయం చవిచూసింది. సన్‌రైజర్స్‌ బ్యాటర్లకు కళ్లెం వేసిన చెన్నై సూపర్‌కింగ్స్‌ అయిదో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. కెప్టెన్‌ రుతురాజ్‌ విలువైన ఇన్నింగ్స్‌తో చెన్నై మెరుగైన స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషిస్తే... తుషార్‌ సూపర్‌ బౌలింగ్‌తో ప్రత్యర్థిని దెబ్బతీశాడు.

పెనర్లు హెడ్‌, అభిషేక్‌ శర్మలపై సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఎంతగా ఆధారపడి ఉందో మరోసారి రుజువైంది. ఈ విధ్వంసక బ్యాటర్లు మరోసారి శుభారంభాన్నివ్వలేకపోవడంతో ఆ జట్టు వరుసగా రెండో ఓటమిని చవిచూసింది. రుతురాజ్‌ గైక్వాడ్‌ (98; 54 బంతుల్లో 10×4, 3×6) చెలరేగడంతో ఆదివారం చెన్నై 78 పరుగుల తేడాతో సన్‌రైజర్స్‌ను చిత్తుగా ఓడించింది. రుతురాజ్‌తో పాటు మిచెల్‌ (52; 32 బంతుల్లో 7×4, 1×6), శివమ్‌ దూబె (39 నాటౌట్‌; 20 బంతుల్లో 1×4, 4×6) మెరవడంతో మొదట చెన్నై 3 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. ఛేదనలో తడబడ్డ సన్‌రైజర్స్‌ 18.5 ఓవర్లలో 134 పరుగులకే ఆలౌటైంది. మార్‌క్రమ్‌ (32; 26 బంతుల్లో 4×4) టాప్‌ స్కోరర్‌. తుషార్‌ దేశ్‌పాండే (4/27) సన్‌రైజర్స్‌ పతనాన్ని శాసించాడు. పతిరన (2/17), ముస్తాఫిజుర్‌ (2/19), జడేజా (1/22), శార్దూల్‌ (1/27) కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేశారు. సన్‌రైజర్స్‌ అసలు ఏ దశలోనూ గెలుపు దిశగా సాగలేదు. క్రమం తప్పకుండా వికెట్లు చేజార్చుకున్న ఆ జట్టు ఆద్యంతం వెనుకబడిపోయింది. ప్రమాదకర ఓపెనర్‌ హెడ్‌ (13) రెండో ఓవర్లోనే ఔట్‌ కావడం ఆ జట్టుకు పెద్ద దెబ్బ. నాలుగు ఓవర్లు ముగిసే సరికి అన్మోల్‌ప్రీత్‌ (0), అభిషేక్‌ శర్మ (15)ల వికెట్లనూ కోల్పోయింది. ఈ మూడు వికెట్లూ తుషార్‌కే దక్కడం విశేషం. మార్‌క్రమ్‌, నితీశ్‌ కుమార్‌ రెడ్డి (15) కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నా ధాటిగా ఆడలేకపోయారు. వీళ్లిద్దరినీ జడేజా, పతిరన ఔట్‌ చేయడంతో సన్‌రైజర్స్‌ 11 ఓవర్లలో 86/5తో నిలిచింది. సాధించాల్సిన రన్‌రేట్‌ అప్పటికే బాగా పెరిగిపోయింది. క్లాసెన్‌ (20; 21 బంతుల్లో 1×6) క్రీజులో ఉన్నా ప్రయోజనం లేకపోయింది. అతడు, సమద్‌ (19) పరుగుల కోసం చెమటోడ్చారు. బౌండరీలే కరవయ్యాయి. గెలవాలంటే ఆఖరి అయిదు ఓవర్లలో సన్‌రైజర్స్‌ 104 పరుగులు చేయాల్సిన పరిస్థితి. 16వ ఓవర్లో క్లాసెన్‌ను పతిరన ఔట్‌ చేయడంతో ఆ జట్టు ఓటమి ఖాయమైపోయింది. మిగతా ఆట ఓటమి అంతరాన్ని తగ్గించుకోవడం కోసమే. సన్‌రైజర్స్‌ అన్ని ఓవర్లు కూడా ఆడలేకపోయింది.

రుతురాజ్‌ కెప్టెన్‌ ఇన్నింగ్స్‌: రుతురాజ్‌ కెప్టెన్‌ ఇన్నింగ్స్‌తో అంతకుముందు చెన్నై రెండొందలు దాటగలిగింది. కానీ ఆ జట్టు ఆరంభం చాలా సాధారణం. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన చెన్నై పవర్‌ ప్లే ముగిసే సరికి 50/1తో నిలిచింది. మూడో ఓవర్లోనే రహానె (12 బంతుల్లో 9) ఔట్‌ కాగా.. మిచెల్‌తో కలిసి రుతురాజ్‌ ఇన్నింగ్స్‌ను నడిపించాడు. రుతురాజ్‌ బ్యాట్‌ ఝళిపించినా.. మిచెల్‌ పరుగుల కోసం కష్టపడ్డాడు. ఇన్నింగ్స్‌ తొమ్మిదో ఓవర్లోగానీ చెన్నైకి తొలి సిక్స్‌ రాలేదు. కమిన్స్‌ బంతిని మిచెల్‌ లాంగాఫ్‌లో స్టాండ్స్‌లోకి కొట్టాడు. అక్కడి నుంచి ఇన్నింగ్స్‌కు ఊపొచ్చింది. గేర్‌ మార్చిన మిచెల్‌ ఎడాపెడా ఫోర్లు కొట్టేయడంతో 12 ఓవర్లకు చెన్నై 115/1తో నిలిచింది. మిచెల్‌ ఔటైనా.. రుతురాజ్‌ జోరు కొనసాగించాడు. చకచకా ఫోర్లు, సిక్స్‌లు కొట్టాడు. మరోవైపు దూబె కూడా చెలరేగిపోవడంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. అయితే చివరి రెండు ఓవర్లలో చెన్నైకి 20 పరుగులే వచ్చాయి. ఆఖరి ఓవర్లో, శతకానికి రెండు పరుగుల దూరంలో రుతురాజ్‌ ఔటయ్యాడు.

చెన్నై ఇన్నింగ్స్‌: రహానె (సి) షాబాజ్‌ (బి) భువనేశ్వర్‌ 9; రుతురాజ్‌ (సి) నితీశ్‌ (బి) నటరాజన్‌ 98; మిచెల్‌ (సి) నితీశ్‌ (బి) ఉనద్కత్‌ 52; శివమ్‌ దూబె నాటౌట్‌ 39; ధోని నాటౌట్‌ 5; ఎక్స్‌ట్రాలు 9 మొత్తం: (20 ఓవర్లలో 3 వికెట్లకు) 212; వికెట్ల పతనం: 1-19, 2-126, 3-200; బౌలింగ్‌: భువనేశ్వర్‌ 4-0-38-1; నితీశ్‌ 1-0-8-0; షాబాజ్‌ అహ్మద్‌ 3-0-33-0; నటరాజన్‌ 4-0-43-1; ఉనద్కత్‌ 4-0-38-1; కమిన్స్‌ 4-0-49-0

సన్‌రైజర్స్‌ ఇన్నింగ్స్‌: హెడ్‌ (సి) మిచెల్‌ (బి) తుషార్‌ 13; అభిషేక్‌ (సి) మిచెల్‌ (బి) తుషార్‌ 15; అన్మోల్‌ప్రీత్‌ (సి) అలీ (బి) తుషార్‌ 0; మార్‌క్రమ్‌ (బి) పతిరన 32; నితీశ్‌  (సి) ధోని (బి) జడేజా 15; క్లాసెన్‌ (సి) మిచెల్‌ (బి) పతిరన 20; సమద్‌ (సి) రిజ్వీ (బి) శార్దూల్‌ 19; షాబాజ్‌ (సి) మిచెల్‌ (బి) ముస్తాఫిజుర్‌ 7; కమిన్స్‌ (సి) మిచెల్‌ (బి) తుషార్‌ 5; భువనేశ్వర్‌ నాటౌట్‌ 4; ఉనద్కత్‌ (సి) అలీ (బి) ముస్తాఫిజుర్‌ 1; ఎక్స్‌ట్రాలు 3 మొత్తం: (18.5 ఓవర్లలో ఆలౌట్‌) 134; వికెట్ల పతనం: 1-21, 2-21, 3-40, 4-72, 5-85, 6-117, 7-119, 8-124, 9-132; బౌలింగ్‌: దీపక్‌ చాహర్‌ 3-0-22-0; తుషార్‌ దేశ్‌పాండే 3-0-27-4; ముస్తాఫిజుర్‌ 2.5-0-19-2; జడేజా 4-0-22-1; శార్దూల్‌ 4-0-27-1; పతిరన 2-0-17-2

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని