సంక్షిప్త వార్తలు (5)

Eenadu icon
By Sports News Desk Published : 28 Oct 2025 03:34 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
3 min read

సింధు గాయంతో.. 

దిల్లీ: భారత స్టార్‌ షట్లర్‌ పి.వి.సింధు పాదం గాయంతో ఈ సీజన్లో మిగిలిన టోర్నీలకు దూరమైంది. ‘‘ఐరోపా అంచెకు ముందు అయిన పాదం గాయం నుంచి ఇంకా కోలుకోలేదు. డాక్టర్‌ సలహా మేరకు ఈ సీజన్లో మిగతా టోర్నీలకు దూరమవుతున్నా. త్వరలోనే బరిలో దిగుతాననే నమ్మకంతో ఉన్నా’’ అని సింధు తెలిపింది. 2024 పారిస్‌ ఒలింపిక్స్‌లో పతకం సాధించలేకపోయిన సింధు.. గత డిసెంబర్‌లో సయ్యద్‌ మోదీ టోర్నీలో టైటిల్‌ నెగ్గింది. కానీ ఈ ఏడాది మెరుగైన ఫలితాలు సాధించలేకపోయింది. మలేసియా మాస్టర్స్‌లో రన్నరప్‌గా నిలిచిన సింధు.. ఇండియా ఓపెన్, ప్రపంచ ఛాంపియన్‌షిప్, చైనా మాస్టర్స్‌లో క్వార్టర్‌ఫైనల్‌ చేరింది. 


పుదుచ్చేరి 92/8 

హైదరాబాద్‌తో రంజీ 

పుదుచ్చేరి: హైదరాబాద్, పుదుచ్చేరి రంజీ మ్యాచ్‌ను వర్షం వెంటాడింది. వాన వల్ల మూడో రోజు, సోమవారం 25 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. ఆ కొద్ది ఆటలో హైదరాబాద్‌ బౌలర్లు విజృంభించారు. ఓవర్‌నైట్‌ స్కోరు 25/1తో తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన పుదుచ్చేరి.. 92 పరుగులకే 8 వికెట్లు కోల్పోయింది. పున్నయ్య (3/10), తనయ్‌ త్యాగరాజన్‌ (2/41) ఆ జట్టును దెబ్బతీశారు. ఆనంద్‌ బైస్‌ (41) టాప్‌ స్కోరర్‌.

ఆంధ్ర, బరోడా మ్యాచ్‌కు వర్షం దెబ్బ: వర్షం వల్ల ఆంధ్ర, బరోడా మ్యాచ్‌ (గ్రూప్‌-ఎ) మూడో రోజు ఆట తుడిచిపెట్టుకుపోయింది. ఒక్క బంతి కూడా సాధ్యం కాలేదు. తొలి ఇన్నింగ్స్‌లో బరోడా 363 పరుగులు చేయగా... ఆంధ్ర 43/2తో ఉంది.


యాషెస్‌ తొలి టెస్టుకు కమిన్స్‌ దూరం 

కాన్‌బెరా: ఇంగ్లాండ్‌తో యాషెస్‌ తొలి టెస్టులో తలపడే ఆస్ట్రేలియా జట్టుకు కెప్టెన్‌ కమిన్స్‌ దూరమయ్యాడు. వెన్ను గాయంతో ఈ జులై నుంచి అతడు బరిలో దిగలేదు. కమిన్స్‌ ఇంకా కోలుకోకపోవడంతో నవంబర్‌ 21న పెర్త్‌లో మొదలయ్యే తొలి టెస్టులో ఆడట్లేదు. అతడి గైర్హాజరీలో స్టీవ్‌ స్మిత్‌ ఆసీస్‌ను నడిపించనున్నాడు. ఈ వారంలో కమిన్స్‌ బౌలింగ్‌ సాధనను ఆరంభిస్తాడని.. త్వరలోనే పూర్తి ఫిట్‌నెస్‌ సాధిస్తాడని ఆశిస్తున్నట్లు ఆస్ట్రేలియా కోచ్‌ ఆండ్రూ మెక్‌డొనాల్డ్‌ చెప్పాడు. 2021 నుంచి కమిన్స్‌ అందుబాటులో లేని ఆరు టెస్టుల్లో స్మిత్‌ ఆసీస్‌కు సారథ్యం వహించాడు. తొలి టెస్టు (పెర్త్‌)లో పేసర్లు హేజిల్‌వుడ్, స్టార్క్‌ బోలాండ్‌ బరిలో దిగనున్నారు. 


వెన్నెల శుభారంభం 

ఆసియా యూత్‌ క్రీడలు 

బహ్రెయిన్‌: ఆసియా యూత్‌ క్రీడల్లో భారత షట్లర్లు శుభారంభం చేశారు. మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్లో వెన్నెల కలగొట్ల 23-21, 21-10తో నెత్మీ రత్ననాయకె (శ్రీలంక)ను ఓడించింది. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో పరమ్‌ చౌదరి-అనన్య జంట 8-21, 15-21తో నాసియోన్‌-బోయె (దక్షిణ కొరియా) జోడీపై గెలిచింది. బాక్సింగ్‌లో మిశ్రమ ఫలితాలు లభించాయి. 50 కేజీల్లో లాన్‌చెంబా 4-1తో అమన్య (ఫిలిప్ఫీన్స్‌)పై నెగ్గగా.. 75 కేజీల్లో దేవేంద్ర చౌదరి 0-5తో గుయాన్‌ (చైనా) చేతిలో ఓడాడు. టీటీలో భారత జంట సార్థక్‌ ఆర్య-సిండ్రిలా దాస్‌ ప్రిక్వార్టర్స్‌ చేరింది. సార్థక్‌ ద్వయం 11-6, 11-5తో ఇమ్రాన్‌-అమీనా (మాల్దీవులు) జంటను ఓడించింది. స్విమ్మర్లు నిరాశపరిచారు. ఏడు విభాగాల్లో ఫైనల్‌కు వెళ్లినా ఒక్కరూ పతకం తేలేకపోయారు. 


భారత్‌కు కఠినమైన డ్రా 

సార్‌బ్రూకెన్‌ (జర్మనీ): హైలో ఓపెన్‌ సూపర్‌ 500 బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్లో భారత షట్లర్లకు కఠినమైన డ్రా పడింది. మంగళవారం ఆరంభమయ్యే ఈ టోర్నీలో పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్లో అయిదో సీడ్‌ క్రిస్టో పొపోవ్‌ (ఫ్రాన్స్‌)ను లక్ష్యసేన్‌ ఢీకొంటున్నాడు. విక్టర్‌ లాయ్‌ (డెన్మార్క్‌)తో ఆయుష్‌ శెట్టి ఆడనున్నాడు. గత కొంతకాలంగా ఫామ్‌ అందుకునేందుకు ఇబ్బంది పడుతున్న కిదాంబి శ్రీకాంత్‌.. తొలి రౌండ్లో కిరణ్‌ జార్జ్‌తో తలపడతాడు. లియోంగ్‌ జున్‌ (మలేసియా)తో శంకర్‌ ముత్తుస్వామితో ఆడతాడు. మహిళల సింగిల్స్‌లో అన్మోల్‌.. జూలీ జాకోబ్‌సన్‌ (డెన్మార్క్‌)తో.. జులియానా (బ్రెజిల్‌)తో ఉన్నతి హుడా పోటీపడనున్నారు. పొలీనా బరోవా (ఉక్రెయిన్‌)తో అనుపమ ఉపాధ్యాయ తలపడనుంది. ఇటీవలే అల్‌ అయిన్‌ మాస్టర్స్‌ టోర్నీలో విజేతగా నిలిచిన శ్రియాంశి వలిశెట్టి.. తొలి రౌండ్లో మూడో సీడ్‌ లిన్‌ హోజోమార్క్‌ (డెన్మార్క్‌)ను ఢీకొంటుంది. పురుషుల డబుల్స్‌ తొలి రౌండ్లో పృథ్వీ-సాయి ప్రతీక్‌ జంట.. క్రిస్టో-టోమా పొపోవ్‌ (ఫ్రాన్స్‌) జోడీతో.. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో రుత్విక శివాని-రోహన్‌ కపూర్‌ ద్వయం.. జొనాథన్‌ బింగ్‌-సాన్‌ క్రిస్టల్‌ (కెనడా) జంటతో ఆడనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని