Ruturaj Gaikwad: వారిని చూస్తుంటే.. మా జట్టులో అదనంగా ఇద్దరు కుర్రాళ్లు ఉన్నట్టుంది: రుతురాజ్‌ గైక్వాడ్

వరుసగా రెండో విజయంతో చెన్నై జట్టు ఐపీఎల్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలోకి దూసుకెళ్లింది.

Updated : 27 Mar 2024 08:58 IST

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్‌లో చెన్నై రెండో విజయాన్ని నమోదు చేసింది. చెపాక్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో గుజరాత్‌ను 63 పరుగుల తేడాతో చిత్తు చేసింది. అన్ని విభాగాల్లోనూ రాణించిన చెన్నై.. ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. తొలుత బ్యాటింగ్‌.. ఆపైన అదిరిపోయే బౌలింగ్‌, ఫీల్డింగ్‌తో అభిమానులను అలరించింది. సీనియర్లు ఎంఎస్ ధోనీ, అజింక్య రహానె ఫీల్డింగ్‌ విన్యాసాలు ఆకట్టుకున్నాయి. మ్యాచ్‌ అనంతరం చెన్నై కెప్టెన్ రుతురాజ్‌ గైక్వాడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 

‘‘మూడు విభాగాల్లోనూ మేం అదరగొట్టాం. గుజరాత్‌ వంటి ప్రత్యర్థిపై సంపూర్ణ ఆధిక్యం ప్రదర్శించాం. చెన్నై పిచ్‌ ఎప్పుడు ఎలా మారుతుందో తెలియదు. తొలుత బ్యాటింగా?బౌలింగా? అనే దానితో సంబంధం లేకుండా ఆడాలని భావించాం. అదే ప్రణాళికతో బరిలోకి దిగాం. వికెట్లు చేతిలో ఉంటే చివర్లో మరింత దూకుడుగా ముందుకెళ్లే అవకాశం ఉంటుంది. దూబె, రచిన్‌ కీలకమైన ఇన్నింగ్స్‌లు ఆడారు. దూబెతో మేనేజ్‌మెంట్‌, ధోనీ ప్రత్యేకంగా వర్కౌట్‌ చేశారు. అతడి ఆత్మవిశ్వాసం స్థాయి అద్భుతం. ధోనీ, అజింక్య రహానె వంటి సీనియర్లు ఫీల్డింగ్‌లోనూ మెరుపులు మెరిపించారు. దీంతో మా జట్టులో అదనంగా మరో ఇద్దరు కుర్రాళ్లు ఉన్నట్లుంది. రహానె ఫీల్డింగ్ నైపుణ్యం గత మ్యాచ్‌లోనూ చూశాం. నాణ్యమైన ఫీల్డింగ్‌ మాకు అదనపు బలం’’ అని రుతురాజ్‌ తెలిపాడు. 

పవర్‌ ప్లేలో వెనుకబడిపోయాం: గిల్

‘‘మా బ్యాటింగ్‌ను చెన్నై కట్టడి చేసింది. వారి ప్రణాళికలు చక్కగా అమలు చేయగలిగారు. పవర్‌ ప్లేలో ఇంకాస్త మెరుగ్గా ఆడితే బాగుండేది. కానీ అలా జరగలేదు. ఈ వికెట్‌ మీద 200 వరకు ఛేదించవచ్చని భావించాం. ఈ మ్యాచ్‌ ద్వారా మా బౌలర్లకు మరిన్ని విషయాలు నేర్చుకునేందుకు అవకాశం దొరికింది. టోర్నీ మధ్యలో కాకుండా ఇప్పుడే ఇలాంటి మ్యాచ్‌ ఆడేయడం మంచిదైంది. కెప్టెన్‌గా నేను చాలా అంశాలను నేర్చుకునే దశలో ఉన్నా. కొత్త అనుభవాలు, విభిన్న సమయాల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనేది తెలుసుకుంటున్నా. గత రెండేళ్లు మేం ఫైనల్‌కు చేరాం. ఈసారి కూడా వెళ్లేందుకు ప్రయత్నిస్తాం’’ అని గుజరాత్ కెప్టెన్ శుభ్‌మన్‌ గిల్ అన్నాడు.Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని