Hardik on 2nd t20: నాతో సహా.. బ్యాటర్లు మరింత బాధ్యత తీసుకోవాలి: హార్దిక్‌

ఐదు టీ20ల సిరీస్‌లో వెస్టిండీస్‌ (WI vs IND) 2-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. గయానా వేదికగా జరిగిన రెండో మ్యాచ్‌లోనూ భారత్‌పై 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

Published : 07 Aug 2023 09:19 IST

ఇంటర్నెట్ డెస్క్: వెస్టిండీస్‌ అన్ని విభాగాల్లో రాణించి రెండో టీ20లోనూ (WI vs IND) విజయం సాధించింది. వరుసగా రెండు టీ20ల్లో భారత్‌పై గెలవడం విండీస్‌కు ఇదే తొలిసారి. తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్ 152 పరుగులే చేయగలిగింది. తిలక్‌ వర్మ (51) హాఫ్ సెంచరీ సాధించగా.. ఇషాన్‌ (27), హార్దిక్ (24) ఫర్వాలేదనిపించారు. అయితే, తనతో సహా మిగతా బ్యాటర్లూ మరింత బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉందని కెప్టెన్ హార్దిక్‌ వ్యాఖ్యానించాడు. మరో 20 పరుగులు అదనంగా చేస్తే బాగుండేదన్నాడు. టాప్‌ -7 బ్యాటర్లపై నమ్మకం ఉందని.. తప్పకుండా వచ్చే మ్యాచ్‌లో విజయం సాధిస్తామని పేర్కొన్నాడు. 

ఒక్క ఓవర్‌లో తేల్చుకుందాం.. దూబేకు చాహర్‌ సవాల్‌

‘‘నిజాయతీగా చెప్పాలంటే మా బ్యాటింగ్ ప్రదర్శన పట్ల సంతోషంగా లేను. మేం ఇంకాస్త మెరుగ్గా బ్యాటింగ్‌ చేయాల్సింది. కనీసం 170 వరకు స్కోర్‌ చేస్తే ఫలితం మరోలా ఉండేది. నికోలస్‌ పూరన్ ఆడిన తీరు అద్భుతం. దీంతో స్పిన్నర్లను రొటేట్‌ చేయడం క్లిష్టంగా మారింది. కేవలం అతడి ఇన్నింగ్స్‌ వల్లే మ్యాచ్‌ విండీస్‌ చేతుల్లోకి వెళ్లిపోయింది. ప్రస్తుతం ఉన్న భారత్‌ కాంబినేషన్‌పై నాకు నమ్మకముంది. టాప్‌ -7 బ్యాటర్లు మరింత బాధ్యత తీసుకోవాలి.  బౌలర్లూ గెలిపిస్తారని భావిస్తున్నా. జట్టు సమతూకంగా ఉండేలా చూడటంతోపాటు ఆటగాళ్లంతా విజయం కోసం పోరాడాలి. నాలుగో స్థానంలో ఎడమచేతివాటం బ్యాటర్‌ తిలక్‌వర్మ రావడం విభిన్నమైన ప్రయోగం. ఇది సత్ఫలితాలను ఇస్తోంది. తిలక్‌ వర్మ బ్యాటింగ్‌ను చూస్తుంటే అతడికి ఇది కేవలం రెండో అంతర్జాతీయ మ్యాచ్‌గా మాత్రం అనిపించలేదు. ఎంతో అనుభవం ఉన్న ఆటగాడిగా అద్భుత ఇన్నింగ్స్‌ ఆడాడు’’ అని హార్దిక్‌ కొనియాడాడు.

నా ప్రదర్శన  సంతృప్తికరంగా ఉంది: పూరన్

‘‘వరుసగా రెండు మ్యాచుల్లోనూ కీలక ఇన్నింగ్స్‌లు ఆడటం సంతృప్తినిచ్చింది. గత కొన్నేళ్లుగా చేసిన కృషికి ఫలితం ఇప్పుడొస్తోంది. మ్యాచ్‌లను ముగించడానికి అవసరమైన పరుగులు సాధించడం ఆనందంగానూ ఉంది. నిలకడగా ఆడేందుకు ప్రయత్నిస్తూనే ఉంటా. అందుకోసం నెట్స్‌లో తీవ్రంగా కష్టపడతా. గతంలో చాలా పొరపాట్లు జరిగేవి. వాటిని సరిదిద్దుకుంటూ నా జట్టు విజయం సాధించేందుకు ఆడటమే నా ముందున్న లక్ష్యం. అభిమానులను అలరించడానికి ఎక్కువ ప్రాధాన్యమిస్తా’’ అని ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌ అవార్డు విజేత నికోలస్‌ పూరన్‌ తెలిపాడు. పూరన్‌ ఈ మ్యాచ్‌లో 40 బంతుల్లో 67 పరుగులు చేశాడు. 

అప్పటి నుంచి సిరీస్‌ గెలవలేదు: రోవ్‌మన్ పావెల్‌

‘‘వరుసగా రెండు టీ20లను గెలవడం ఆనందంగా ఉంది. 2016 నుంచి ఇప్పటి వరకు మేం టీ20 సిరీస్‌ గెలవలేకపోయాం. ఇప్పుడా లోటును తీర్చుకునే అవకాశం వచ్చింది. ఫాస్ట్‌ బౌలర్లను తరచూ మారుస్తూ ఉండటం వల్ల ఫలితాలను సాధించగలిగాం. అంతేకాకుండా ఎండ వేడిమి ఎక్కువగా ఉంటుంది. అందుకే ఫాస్ట్‌ బౌలర్లతో ఒక్క ఓవర్‌ స్పెల్‌ మాత్రమే వేయిస్తూ వచ్చాం. బ్యాటింగ్‌లో మావాళ్లు అదరగొట్టారు. చాహల్, కుల్‌దీప్‌, బిష్ణోయ్‌ను ఎదుర్కోవడానికి ఎడమచేతివాటం బ్యాటర్లు అవసరం. పూరన్, హెట్‌మయెర్ కీలక పాత్ర పోషించారు’’ అని కెప్టెన్‌ పావెల్‌ అన్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని